చేయి చేయి కలుపు.. కొవిడ్‌పై పోరాడు

ABN , First Publish Date - 2021-05-07T04:30:53+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ దెబ్బకు జిల్లా విలవిల్లాడుతోంది. అధికారికంగారోజుకు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, అనధికారికంగా ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మరణాల శాతం కూడా ఎక్కువగా నమోదవుతోంది.

చేయి చేయి కలుపు..  కొవిడ్‌పై పోరాడు

కొవిడ్‌ వారియర్స్‌, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఆంటీబాడీస్‌

ప్లాస్మాదానంతో మరొకరిని కాపాడే అవకాశం

మొదటివేవ్‌లో 80 శాతం ఫలితాలు

ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులు

ప్రభుత్వం ప్రోత్సాహం కొనసాగిస్తే ప్రయోజనం


నెల్లూరు, మే 6 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ దెబ్బకు జిల్లా విలవిల్లాడుతోంది. అధికారికంగారోజుకు  వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, అనధికారికంగా ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మరణాల శాతం కూడా ఎక్కువగా నమోదవుతోంది. దీంతో బెడ్లు దొరకడం కూడా కష్టంగా మారింది. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధిలకు ప్లాస్మా చికిత్స చాలా వరకు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొదటివేవ్‌లో ఈ చికిత్స 80 శాతం ఫలితాలను ఇచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. అదే మాదిరిగా మరోసారి ప్లాస్మా చికిత్సను వీలైనంత ఎక్కువ మందికి అందించగలిగితే మరణాల రేటును తగ్గించవచ్చని చెబుతున్నారు. అయితే ఇందుకు ప్లాస్మాదానం చేసేందుకు కొవిడ్‌ వారియర్స్‌ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒకరు దానం చేసే ప్లాస్మాతో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. కొవిడ్‌ మొదటివేవ్‌ సమయంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ప్లాస్మాదానంపై విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు సేకరించింది. జిల్లాలో వందల మంది దాతలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రికార్డు స్థాయిలో 503 మంది నుంచి 1006 ప్లాస్మా యూనిట్లను సేకరించారు. అత్యధిక యూనిట్లు ప్లాస్మా సేకరించిన జిల్లాల్లో దేశంలోనే రెండో స్థానంలో నెల్లూరు నిలవడం విశేషం. రాష్ట్రంలో తొలుత ప్లాస్మా చికిత్స చేసింది కూడా నెల్లూరులోనే. కరోనాతో పోరాడుతున్న రోగులకు వైద్యుల సూచనల మేరకు కొందరికి ఒక యూనిట్‌, మరికొందరికి రెండు యూనిట్ల చొప్పున అందించారు. అదే స్ఫూర్తితో మరోసారి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. 


ప్రోత్సాహం కొనసాగిస్తే ప్రయోజనం


కొవిడ్‌ మొదటివేవ్‌ సమయంలో అత్యధిక మంది ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇలా ప్లాస్మాదానం చేసిన వారికి ప్రభుత్వం రూ.5 వేలను ప్రోత్సాహం కింద అందించింది. ఆ సమయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్లాస్మాదాతలను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. దీంతో ఎక్కువ మంది ప్లాస్మాదానం చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు ప్మాస్లాదాతలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ఆపేసింది. ఈ ప్రోత్సాహాన్ని కొనసాగిస్తే ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొదటి వేవ్‌ సమయంలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు కాబట్టి కేవలం కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి నుంచే ప్లాస్మా సేకరించేందుకు అవకాశముండేది. కానీ ఇప్పుడు వ్యాక్సిన్‌ వేసుకున్నవారిలో 14 రోజుల తర్వాత యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతున్నాయి. ఇటువంటి  వారు కూడా ప్లాస్మాదానం చేయవచ్చు. దీంతో ఎక్కువ మందిని ప్లాస్మాదానానికి తీసుకొచ్చేందుకు అవకాశముంది. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటికే 125 మంది వరకు కొవిడ్‌ వారియర్స్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మాదానం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలంటే ప్రోత్సాహం అందించడంతోపాటు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతోమంది కరోనా బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని కాపాడేందుకు ముందుకొచ్చి ప్లాస్మాదానం చేయాలని జిల్లా యంత్రాంగం పిలుపునిస్తోంది. 


ప్లాస్మాదానానికి ముందుకు రావాలి

దాతలు ఇచ్చే ప్లాస్మా ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశముంటుంది. కరోనా నుంచి కోలుకున్న వారే కాకుండా వ్యాక్సిన్‌ వేయించుకొని 14 రోజులు దాటిన వారు కూడా ప్లాస్మాదానం చేయవచ్చు. దాతలు నేరుగా నెల్లూరులోని రెడ్‌క్రా్‌సకు వస్తే ముందుగా వారికి యాంటీబాడీస్‌ టెస్ట్‌ చేస్తాం. తద్వారా వారిలో ఏ స్థాయిలో యాంటీబాడీస్‌ ఉన్నాయన్నది కూడా తెలుసుకోవచ్చు. కరోనా బాధితులు ఆసుపత్రిలో చేరిన నిర్ణీత సమయంలోపు వారికి ప్లాస్మా చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  

- చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌

Updated Date - 2021-05-07T04:30:53+05:30 IST