జిల్లాలో కొవిడ్‌ కల్లోలంపై వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తం

ABN , First Publish Date - 2021-04-16T07:06:02+05:30 IST

జిల్లాలో ఈనెల ఒకటి నుంచి కొవిడ్‌ కేసులు అడ్డు అదుపులేకుండా పెరిగిపోతున్నాయి. మునుపటి తరహాలో వందలాది పాజిటివ్‌లు పైపైకి పరుగులు తీస్తూ కలవరపెడుతున్నాయి. దీంతో క్రమేపీ కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి బాధితులు పోటెత్తుతున్నారు.

జిల్లాలో కొవిడ్‌ కల్లోలంపై వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తం

జిల్లాలో కొవిడ్‌ కల్లోలం రేపుతోంది. పాజిటివ్‌లు అదుపుతప్పి వందల్లో నమోదవుతున్నాయి. పల్లె, పట్నం, నగరం తేడా లేకుండా మొత్తం జిల్లా అంతటినీ వైరస్‌ చుట్టేస్తోంది. ప్రతి రోజు వందల్లో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇంత జరుగుతున్నా కాంటాక్ట్స్‌ అన్వేషణ మాత్రం పక్కాగా జరగడం లేదు. ఒక వ్యక్తి నుంచి వైరస్‌ ఎంతమందికి వ్యాపించిదనేది గుర్తించడంలో వైద్య ఆరోగ్య శాఖ సమర్థంగా వ్యవహరించలేకపోతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నియంత్రణపై అధికారుల వైఫల్యంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వరుస కథనాలపై ఎట్టకేలకు జేసీ కీర్తి స్పందించారు. భారీగా పెరుగుతున్న కేసులు, పర్యవేక్షణ లేమిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇకపై కేసుల గుర్తింపు పక్కాగా ఉండేలా దిశానిర్దేశం చేశారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో కొత్తగా కొవిడ్‌ పడకలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జీజీహెచ్‌, డీహెచ్‌, కిమ్స్‌ల్లో ప్రత్యేక నోడల్‌ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాలో గురువారం 450 మందికి వైరస్‌ సోకింది. కాగా ఈ15 రోజుల్లోనే 2,193 కేసులు రావడం కలవరపరుస్తోంది.


  • వందల్లో కొత్త కేసులు..  కొరవడ్డ పర్యవేక్షణ లేమిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు
  • ఎట్టకేలకు జేసీ కీర్తి కీలక సమీక్ష.. ప్రైవేటు ఆసుపత్రుల సేవలనూ వాడుకునే యోచన
  • ఏరియా ఆసుపత్రుల్లో 20, సీహెచ్‌సీల్లో అయిదేసి కొవిడ్‌ బెడ్లు సిద్ధం చేయాలని నిర్ణయం
  • ఇకపై మరింత పక్కాగా పాజిటివ్‌ సోకిన వ్యక్తుల కాంటాక్ట్స్‌ గుర్తింపు 
  • గురువారం మరో 450 మందికి వైరస్‌ నిర్ధారణ.. 2,550కి చేరిన యాక్టివ్‌ కేసులు
  • ఈనెల 15 రోజుల్లో 2,193 పాజిటివ్‌లు.. అంతకుముందు 15 రోజుల్లో కేవలం 631 
  • కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ఆందోళనతో కాల్వలోకి దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఈనెల ఒకటి నుంచి కొవిడ్‌ కేసులు అడ్డు అదుపులేకుండా పెరిగిపోతున్నాయి. మునుపటి తరహాలో వందలాది పాజిటివ్‌లు పైపైకి పరుగులు తీస్తూ కలవరపెడుతున్నాయి. దీంతో క్రమేపీ కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి బాధితులు పోటెత్తుతున్నారు. అటు కేసుల తీవ్రత పెరిగిపోతున్నా క్షేత్రస్థాయిలో అందుకుతగ్గ జాగ్రత్తలు వైద్యఆరోగ్యశాఖ నుంచి సీరియస్‌గా ఉండడం లేదు. ముఖ్యంగా కాంటాక్ట్‌ల గుర్తింపులో నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరికైనా కొవిడ్‌ నిర్ధారణ అయితే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం అతడికి సంబంధించిన 30 మంది కాంటాక్ట్‌ అయిన వ్యక్తులకు ఆగమేఘాలపై టెస్ట్‌లు నిర్వహించాలి. కానీ ఇది పెద్దగా జరగడం లేదు. ఏదో పైపైన బాధితుడి కుటుంబ సభ్యుల వరకు పరీక్షలు చేసి వదిలేస్తున్నారు. దీంతో మిగిలిన కాంటాక్ట్స్‌ విషయం తెలియక, టెస్ట్‌లు దూరంగా ఉంటున్నారు. దీంతో వైరస్‌వ్యాప్తి అధికమై పాజిటివ్‌లు పెరగడానికి దోహదపడుతోంది. అటు పాజిటివ్‌లు వచ్చిన చోట్ల ఇదివరకటిలా రెడ్‌జోన్‌లు ఏర్పాటు చేసి కంటైన్మెంట్‌ కేంద్రాలు నిర్వహించడం లేదు. అక్కడక్కడా ఏర్పాటుచేస్తున్నా పర్యవేక్షణ మొక్కుబడిగానే ఉంటోంది. దీంతో వీటి పరిధిలో జనం అవసరాల పేరుతో బయట సంచరిస్తున్నారు. తద్వారా వైరస్‌ వేగంగా అందరినీ చుట్టేస్తోంది. ఈనేపథ్యంలో వీటన్నింటిని విశ్లేషిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో వరుసగా వస్తున్న కథనాలపై ఎట్టకేలకు జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) కీర్తి చెరుకూరి స్పందించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు, జీజీహెచ్‌, డీహెచ్‌ సూపరింటెండెంట్‌లు, ఆరోగ్యశ్రీ,104,108 వాహనాల కోఆర్డినేటర్లతో జేసీ లోతుగా సమీక్షించారు. వరుసగా వందలాది కేసులు రావడం, కాంటాక్ట్స్‌ గుర్తింపులో లోపాలపై చర్చించారు. ఇకపై కాం టాక్ట్స్‌ గుర్తింపు ఎక్కువగా జరగాలని ఆదేశించారు. పైపైన టెస్ట్‌లు చేసి వదిలేయకుండా 30మందికి కచ్చితంగా టెస్ట్‌లు చేయాలని, ఆ తర్వాత వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే వారి కాంటాక్ట్స్‌ను కూడా వదిలిపెట్టవద్దని ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్లపై పర్యవేక్షణ మరింత పెంచి బయటకు రాకపోకలు నిషేధించడంతోపాటు అందులో ఉన్న వారందరికి టెస్ట్‌లు కచ్చితంగా చేసితీరాలని సూచించారు. కేసులు రోజూ వందల్లో వస్తున్నందున ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కొవిడ్‌ టెస్ట్‌లు, చికిత్సకు అనుమతి ఇవ్వాలనేదానిపై చాలాసేపు చర్చించారు. ఏఏ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వాలనేదానిపై ఒకటిరెండు రోజుల్లో పేర్లు వెల్లడించనున్నారు. అలాగే జిల్లాలో ఏరియా ఆసుపత్రుల్లో 20 చొప్పున కొవిడ్‌ పడకలు, సీహెచ్‌సీల్లో అయిదేసి బెడ్లు కొవిడ్‌ బాధితులకు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా జీజీహెచ్‌, డీహెచ్‌పై ఒత్తిడి తగ్గించవచ్చని పేర్కొన్నారు. అటు వందలాది మంది కొవిడ్‌ బాధితులు జీజీహెచ్‌, డీహెచ్‌, కిమ్స్‌కు చికిత్స కోసం వస్తున్నారు. కానీ వీరు ఆసుపత్రుల్లో చేరడానికి సిబ్బంది సహకారం ఉండడం లేదు. అటు బొమ్మూరు క్వారంటైన్‌కు కలిపి నాలుగుచోట్ల నోడల్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. 

లక్షణాలు కనిపించకపోయినా..

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి ఉధృతమైంది. ఈనెల ఆరంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్‌లు పెరిగిపోయాయి. రోజుకు అయిదు వరకు వచ్చే కేసులు ఒక్కసారిగా 400నుంచి 500వరకు ఎగబాకుతున్నా యి. ఈనెల పదిహేను రోజుల్లో ఏకంగా 2,193 మందికి వైరస్‌ నిర్దారణ అయింది. అదే మార్చి నెల చివరి పదిహేను రోజుల్లో కేవలం 631 కేసులే వచ్చాయి. దీన్నిబట్టి ఏప్రిల్‌ నుంచి పాజిటివ్‌ల తీవ్రత ఏస్థాయిలో పెరిగిపోతోందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,27,556కు చేరుకున్నాయి. ఇందులో యాక్టివ్‌ కేసులు 2,550. ఒకరకంగా యాక్టివ్‌ కేసులు రెండు వారాల వరకు వందల్లో ఉండేవి. ఇప్పుడు ఏకంగా వేలల్లోకి పెరిగిపోయాయి. కాగా జిల్లాలో గురువారం 450 మందికి వైరస్‌ నిర్దారణ అయింది. ఇందులో అత్యధిక కేసులు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంలలో ఉన్నాయి. కాగా గడచిన కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ పాజిటివ్‌లు వందల్లోనే తేలుతున్నాయి. దీంతో వైద్యాధికారుల్లో కలవరం పెరుగుతోంది. మరోపక్క కొత్తగా వస్తున్న కేసుల్లో చాలామందికి లక్షణాలు కనిపించకపోవడంతో వారిని హోంఐసోలేషన్‌కు అనుమతిస్తున్నారు. వీరిలో ఎక్కు వమంది ఆసుపత్రుల్లో చేరడానికే మొగ్గుచూపుతుండడం విశేషం.

కొవిడ్‌ భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

రాయవరం, ఏప్రిల్‌ 15: కొవిడ్‌ భయాందోళన వృద్ధ దంపతులను బలిగొంది. రాయవరం మండలం మాచవరంలో వృద్థ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దంపతులకు ఇటీవల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఈనెల 12న పాజిటివ్‌ రిపోర్టు రావడంతో హోం ఐ సోలేషన్‌లో ఉన్నట్టు తెలియవచ్చింది. రెండ్రోజుల నుంచి ఇంటి వద్ద అలికిడి లేకపోవడంతో గాలించగా గురువారం రామచంద్రపు రం-మండపేట ప్రధాన కాలువలో మృతి చెంది ఉన్నట్టు గుర్తిం చారు. వారికి అంత్యక్రియలు నిర్వహించినట్టు సమాచారం. కరోనా భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Updated Date - 2021-04-16T07:06:02+05:30 IST