మాయదారి.. మహమ్మారి

ABN , First Publish Date - 2021-04-16T05:06:59+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజూ 500కి అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి.

మాయదారి.. మహమ్మారి

కలవరపెడుతున్న కరోనా

చాపకింద నీరులా విస్తరణ

ఆస్పత్రుల్లో బెడ్లు ఫుల్‌

దోపిడీకి తెరలేపిన పలు ప్రైవేటు ఆస్పత్రులు

వేధిస్తున్న వ్యాక్సిన్‌ కొరత

 

అనుకున్నట్లే అవుతోంది.. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోని ప్రజల నిర్లక్ష్యం జిల్లాను ముంచుతోంది. కరోనా వైరస్‌ చాపకింద నీరులా మారుమూల గ్రామాలకు విస్తరిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పుత్రులు దోపిడీ మొదలు పెట్టాయి. ఇదిలాఉంటే వ్యాక్సినేషన్‌ కొరత జిల్లాను వీడటం లేదు. గురువారం మధ్యాహ్నం తరువాత అన్ని ఆసుపత్రుల్లోనూ నో స్టాకు బోర్డులే దర్శనమిచ్చాయి. 


గుంటూరు (సంగడిగుంట), ఏప్రిల్‌15: జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజూ 500కి అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెబుతున్నా.. ఆచరణలో అది అమలు కావడం లేదు. జిల్లాలో బుధవారం 22 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్స కోసం ప్రభుత్వం అనుమతిచ్చింది. వాస్తవానికి వారం నుంచే జిల్లాలోని పలు నర్సింగ్‌హోమ్‌లు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, కరోనా చికిత్స పేరుతో దోపిడీకి తెరలేపాయి. అనుమతి పొందిన ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నారు. ఆక్సిజన్‌ అవసరమైతే రోజుకు రూ.20వేలు, ఆక్సిజన్‌ అవసరం లేకపోతే రోజుకు రూ.15 వేలు. ఐసీయూలో అయితే 40 వేలు నిలబెట్టి వసూళ్లు చేస్తున్నారు.

 

 వ్యాక్సిన్‌.. నోస్టాక్‌

ప్రభుత్వం కరోనా సోకిన వారికి వెంటనే సమాచారం ఇవ్వకపోవడం, వారిని ఐసోలేట్‌ చేసే సదుపాయాలు కల్పించలేకపోవడం ప్రస్తుతం జిల్లాలో కరోనా విస్తరణకు ప్రధాన కారణంగా మారింది. పాత గుంటూరులో ఒకరు, పల్నాడులో ఒకరు, బాపట్ల ప్రాంతంలో ఒకరు చొప్పున ఆర్‌ఎంపీలు కరోనాతో మృతి చెందారు. దీంతో ప్రాక్టీస్‌ చేయాలా వద్దే అనే మీమాంసలో ఆర్‌ఎంపీలు ఉన్నారు. ఇదిలాఉంటే వ్యాక్సినేషన్‌ కొరత జిల్లాను వీడటం లేదు. గురువారం కూడా అవసరమైనంత వ్యాక్సిన్‌ సరఫరా జరగలేదు. మధ్యాహ్నం తరువాత అన్ని ఆసుపత్రులలోనూ నో స్టాకు బోర్డులే దర్శనమిచ్చాయి.  

Updated Date - 2021-04-16T05:06:59+05:30 IST