మళ్లీ మొదటికి!

ABN , First Publish Date - 2021-04-11T05:43:51+05:30 IST

మళ్లీ మొదటికి!

మళ్లీ మొదటికి!

కమ్ముకొస్తున్న.. కరోనా!

కలవరపెడుతున్న సెకండ్‌ వేవ్‌

ప్రమాదస్థాయికి చేరుతున్న పరిస్థితులు

సిద్ధం కాని కొవిడ్‌ ఆస్పత్రులు

టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీట్‌మెంట్‌ ఎక్కడో తెలియక బాధితుల అయోమయం

అప్రమత్తత కాగితాలకే పరిమితం

ఇప్పటికైనా సంసిద్ధమయ్యేనా..?

 

జిల్లాను కరోనా కారు మేఘాలు కమ్మేస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లో వేగంగా కొవిడ్‌ ప్రజలపై దాడి చేస్తోంది. జిల్లాలో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మొదటి వేవ్‌ సమయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుని క్వారంటైన్‌ సెంటర్లను ప్రారంభించి... ఎప్పటికప్పుడు బాఽధితులకు చికిత్స అందిస్తే, సెకండ్‌ వేవ్‌లో మాత్రం అవేమీ లేకుండా పోయాయి. దీంతో కొవిడ్‌ బాధితులు ఆందోళన చెందుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. అధికార యంత్రాంగం ఇంకా పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. 

 

బాధితులకు నిరాదరణ

రెండు రోజుల క్రితం తెనాలి పట్టణంలోని ప్రగడకోటయ్యనగర్‌లో అద్దెకుంటున్న ఒక కుటుంబంలో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ ఇంటి యజమానులు పిల్లల సహా తల్లిదండ్రులను కూడా బయటకు పంపేశారు. వారికి వేరే దారి లేక పెదరావూరులోని ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో మండుటెండలో కూర్చున్నారు. సాయంత్రానికి సమాచారం తెలిసిన సబ్‌కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ చలించిపోయి వెంటనే 108 వాహనాన్ని పంపించి వారిని వైద్యశాలకు పంపారు.

 


గుంటూరు(సంగడిగుంట), ఏప్రిల్‌10: కరోనా సెకండ్‌వేవ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్రమత్తత ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా నివారణలో ముఖ్యమైన టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ ఎక్కడో తెలియక బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కేసులో నమోదవుతున్నా.. అధికార యంత్రాంగం ఇంకా పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్లలో వేగంగా పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా కరోనా బాఽధితులను, వారి కాంట్రాక్ట్స్‌ను అంతేవేగంగా గుర్తించి అవసరమైన వారికి చికిత్స ఏర్పాట్లు చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గతంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 600 బెడ్లతో అత్యుత్తమ చికిత్సను అందించారు. కానీ ప్రస్తుతం కరోనా బాధితులను, సాధారణ వ్యాధిగ్రస్తులకు ఒకే ఫ్లోర్‌లో చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రికి కరోనా చికిత్స కోసం అనుమతి ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రవేటు ఆసుపత్రులు అనధికారికంగా చికిత్సను అందిస్తున్నాయి. దానికి తగ్గట్టే ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. కరోనాతో మృతి చెందుతున్నవారి సంఖ్య ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన ఉండటం లేదు. జీజీహెచ్‌లో రోజుకో మరణం సంభవిస్తోంది. కానీ లెక్కల్లో మాత్రం చూపడం లేదు.


కళ్లు తెరవడం లేదు..

తెనాలి: తెనాలి ప్రాంతంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడి జిల్లా వైద్యశాలలతో కోవిడ్‌ నిర్ధారణ అయిన బాధితులకు చాలినన్ని బెడ్‌లు లేవు. దీనికితోడు వైద్యసేవలు అందించేందుకు సిబ్బందీలేరు. దీంతో పాజిటివ్‌ బాధితుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుతం బాధితులు భారీగా పెరిగిపోవటం, ఆసుపత్రిలో ఖాళీ లేకపోవటంతో ఎక్కువమందికి హోం క్వారంటైన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో తెనాలి-పెదరావూరు మద్యలో టిడ్కో నిర్మించిన భవన సముదాయాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చారు. అప్పుడు బాధితులు ఎందరొచ్చినా గదులు సరిపోయేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు.  ఇదిలా ఉంటే జిల్లా వైద్యశాలలో కొవిడ్‌ సేవలు అందించేందుకు గతంలో తీసుకున్న సిబ్బంది జీతాలు ఇవ్వటంలేదని విధులకు రావటం మానేశారు. ఉన్న వైద్య సిబ్బంది సరిపోక, పక్కనే ఉన్న తల్లీపిల్లల వైద్యశాలలోని సిబ్బందినికూడా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో! మరణాల రేటుకూడా పట్టణంలో పెరిగిపోతూ వస్తోంది. అయినా అధికారులు మాత్రం కళ్లు తెరవటంలేదు.


జిల్లాలో పరిస్థితి ఇలా..

 చిలకలూరిపేట నియోజకవర్గంలో కొవిడ్‌ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిర్ధారణ పరీక్షలు మాత్రం రోజుకు 30కి మించి చేయడం లేదు. కొవిడ్‌బారిన పడిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచేందుకు సరిపడా కిట్‌లు కూడా సరిపడా లేవు.  దీంతో బాధితులు  ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన సుమారు 50మందికి పైగా గుంటూరు, విజయవాడలలోని ఆసుపత్రులలో చికిత్స చేయుంచుకుంటున్నట్లు సమాచారం. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా వందలకు చేరింది. సెకండ్‌ వేవ్‌లో వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటికి 68 కేసులు నమోదయ్యాయి. పల్నాడు ప్రాంతంలో కొవిడ్‌ మహమ్మారి ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో కొవిడ్‌ సోకిన వారు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా వారికి ప్రభుత్వ సిబ్బంది ఎవరూ మందుబిళ్ల ఇచ్చిన దాఖలాలు లేవు. కొవిడ్‌ కాంటాక్టులను గుర్తించటంలో వైద్యసిబ్బంది ముందడుగు వేయటం లేదు. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలలో కలిపి రోజుకు సగటున 40 కేసుల వరకు నమోదవుతున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కడా ఒక కిట్‌ అందించిన దాఖలాలు లేవు.


కొత్తగా 527 పాజిటివ్‌ కేసులు

గుంటూరు (మెడికల్‌) ఏప్రిల్‌ 10:  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం జిల్లాలో శనివారం నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో 34 కేసులు, తాడేపల్లిలో 22, గుంటూరు రూరల్‌లో 12, వట్టిచెరుకూరులో 8,  పెదకాకానిలో 6, తాడికొండలో 5, సతె ్తనపల్లిలో 4, తుళ్లూరులో 3, అమరావతి, ముప్పాళ్ల, ఫిరంగిపురం, పెదనందిపాడులో రెండేసి కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో ఏకంగా 225 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి.  కారంపూడిలో 8, పిడుగురాళ్లలో 6,  దాచేపల్లిలో 3, రెంటచింతలలో 3, గురజాలలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పట్టణంలో 39 కేసులు, నకరికల్లులో 7, చిలకలూరిపేటలో 5, వినుకొండలో 3,  యడ్లపాడు, ఈపూరు, రొంపిచర్లలో రెండేసి కేసులు నమోదయ్యాయి. భట్టిప్రోలులో 21, కొల్లిపరలో 10, పొన్నూరులో 6, వేమూరులో 3, చేబ్రోలులో 3, కాకుమానులో 2, బాపట్లలో 2, చుండూరులో 2 కరోనా కేసులు నమోదయ్యాయయి. తెనాలి పట్టణంలో అత్యధికంగా 50 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.


నిండుకున్న వ్యాక్సిన్‌ 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 10: దాదాపు పదిహేను రోజుల కిందట జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి బాబూ... అని వైద్య ఆరోగ్యశాఖ అనేక విధాలుగా ఒప్పించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో సానుకూలత ఏర్పడడం, కరోనా కేసులు పెరుగుతుండడంతో ఎక్కువ మంది వ్యాక్సిన్‌ కేంద్రాలవైపు చూస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా జిల్లాలో వ్యాక్సిన్‌ సరఫరాలో అంతరాయాలున్నాయి. కొన్ని డోసులను రెండోసారి వేయించుకునే వారి కోసం ఉంచారు. దీంతో తొలిసారి వేయించుకునేవారికి అనేకచోట్ల నోస్టాక్‌ బోర్డులే దర్శనమిచ్చాయి. 


వ్యాక్సిన్‌లలో ప్రైవేటు చేతివాటం..?

ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలలకు ఉచితంగా వ్యాక్సిన్‌ సరఫరా చేస్తోంది. అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రులలోనూ వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతులు ఇచ్చింది. సిబ్బంది జీతాలు, కొన్ని ప్రాథమిక పరీక్షల కోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఒక్కో రోగి నుంచి రూ.250 వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని ఆసుపత్రులలో పరీక్షల పేరుతో రూ.500-700 వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదనే కారణంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు.  

- నరసరావుపేట ఏరియా వైద్యశాల, పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, రొంపిచర్ల, కోటప్పకొండ ప్రాథమిక సెంటరులు, ప్రత్యేక శిబిరాలు, ప్రైవేటు వైద్యశాలల ద్వారా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ స్టాక్‌ అయిపోయిందని సంబంధిత వైద్యులు డాక్టర్‌ కిషోర్‌ శనివారం తెలిపారు. వ్యాక్సిన్‌ నిల్వలు రావలసి ఉందని, వస్తే ఆదివారం కూడా వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

- తాడేపల్లి అర్బన్‌, రూరల్‌లో 45 ఏళ్లు దాటినవారు మొత్తం 22 వేల మందికి వ్యాక్సిన్‌ వేయాల్సివుంది. పీహెచ్‌సీకి 5500 డోస్‌ల వ్యాక్సిన్‌ పంపగా, ఇప్పటివరకు 5200 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇంకా 300 డోస్‌ల వ్యాక్సిన్‌ మాత్రమే మిగిలి వుంది. వ్యాక్సినేషన్‌ పండుగ ప్రారంభమవుతున్న తరుణంలో వ్యాక్సిన్‌ డోస్‌ల రాకకోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. 

-  వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 9,700 మందికి వ్యాక్సిన్‌ వేశారు. శనివారం నాటికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ అయిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు.  తాడికొండ పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని వైద్యులు తెలిపారు.

- చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 4,990మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకునారు.  వ్యాక్సిన్‌ నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని అయితే ప్రజలలో ఉన్న అపోహల కారణంగా ఎక్కువశాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని వైద్యాధికారులు తెలిపారు.

- రేపల్లె నియోజకవర్గంలో ఇప్పటివరకు 11వేల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారని వైద్యులు తెలిపారు. మరో 600 మందికి వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉందన్నారు.  

- వేమూరు నియోజకవర్గంలో 9,153 మందికి మొదటి డోసు వేశారు. రెండో డోసు కింద 1,132 మందికి మాత్రమే వేశారు. మిగిలిన 1,015 డోసుల వ్యాక్సిన్‌ తిరిగి పంపారు.  

 

నేటి నుంచి అర్బన్‌లో టీకా ఉత్సవ్‌

ఫ డాక్టర్‌ చంద్రశేఖరరావు వెల్లడి


గుంటూరు (మెడికల్‌) ఏప్రిల్‌ 10 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా కట్టడికి ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో కరోనా టీకా ఉత్సవ్‌ నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌, ఇన్‌ఛార్జ్‌ డీఐవో డాక్టర్‌ జి.చంద్రశేఖరరావు తెలిపారు. అర్బన్‌ ప్రాంతాల్లో సచివాలయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అయితే సాంకేతిక కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం టీకా ఉత్సవ్‌ను నిర్వహించడం లేదన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ నాలుగు రోగుల పాటు సచివాలయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలని డాక్టర్‌ చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీకా ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 


కొవిడ్‌ ఆస్పత్రుల్లో పడకల కొరత

ఐదింటిలో బెడ్లు ఫుల్‌

గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రుల బాట

  

గుంటూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో పడకలు లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఐదు ఆస్పత్రుల్లో ఇప్పటికే 90 శాతం వరకు పడకలు నిండిపోవడంతో కొవిడ్‌ సోకి ఎవరైనా వెళుతుంటే పడకలు ఖాళీ లేవని చెబుతున్నారు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రభుత్వ ఆధీనంలో చినకాకాని ఎన్‌ఆర్‌ఐ, గుంటూరు జీజీహెచ్‌, కోండ్రుపాడులోని కాటూరి మెడికల్‌ కళాశాల, తెనాలిలోని జిల్లా ఆస్పత్రి, మణిపాల్‌ ఆస్పత్రి ఉన్నాయి. మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఉన్నప్పటికీ అక్కడ కేవలం 16 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. రోజురోజుకు కరోన కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిశ్చార్జ్‌లు కేవలం 70 నుంచి 80 మధ్యనే ఉంటున్నాయి. దీంతో పడకలు నిండిపోతున్నాయి. ఎన్‌ఆర్‌ఐలో ఐసీయూ పడకలు 20, నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్స్‌ 280, వెంటిలేటర్లు 10 ఉండగా ఇప్పటికే 347 మంది ఆ ఆస్పత్రిలో చేరారు. దీంతో అక్కడ ఖాళీ లేకుండా పోయింది. గుంటూరు జీజీహెచ్‌లో ఐసీయూ బెడ్లు 62, నాన్‌ ఐసీయూ ఆక్సీజెన్‌ బెడ్స్‌ 70, నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ 117, 57 వెంటిలేటర్లు ఉన్నాయి. వీటిల్లో 150కి పైగా నిండిపోయాయి. దీంతో అక్కడ ఖాళీ లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కాటూరి మెడికల్‌ కళాశాలలో మొత్తం 245 పడకలకు 127 నిండాయి. తెనాలి జిల్లా ఆస్పత్రిలో 220 పడకలకు 200 నిండిపోయాయి. మణిపాల్‌లో 30 పడకలకు 28 నిండాయి. కొవిడ్‌ సోకిన బాధితుల్లో తీవ్ర లక్షణాలు ఉన్న వారికి ఆక్సిజన్‌ బెడ్స్‌, వెంటిలేటర్లు అవసరమౌతాయి. ఇప్పుడు వాటికే కొరత ఏర్పడింది. గత ఏడాది కరోనా సోకి వారం వ్యవధిలో డిశ్చార్జ్‌ అయిన వారికి కూడా ప్రైవేటు యాజమాన్యాలు రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బిల్లులు వేశాయి. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రులు కూడా కోవిడ్‌ చికిత్సలు చేయడం లేదు. ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్స చేసినందుకు ముందు ఇస్తామని చెప్పిన బిల్లుల కంటే మూడింతలు తగ్గించి ప్రభుత్వం ఇవ్వడంతో ఇప్పుడు ఆయా ఆస్పత్రులు ముందుకు రాని పరిస్థితి జిల్లాలో నెలకొంది. 

 

Updated Date - 2021-04-11T05:43:51+05:30 IST