కరోనా విషయంలో.. అమెరికా లైట్ తీసుకుందా?

ABN , First Publish Date - 2020-03-31T01:10:54+05:30 IST

కొవిడ్-19 విషయంలో అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా? ప్రభుత్వం ముందుగానే స్పందించి

కరోనా విషయంలో.. అమెరికా లైట్ తీసుకుందా?

కొవిడ్-19 విషయంలో అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా? ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదా? చైనాను దోషిగా చూపించి ట్రంప్ చేతులు దులుపుకున్నారా? అసలు అమెరికాలో కరోనా లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారా? న్యూయార్క్, న్యూజెర్సీలలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజలు అసలు ఏం చెబుతున్నారు? 


కొవిడ్-19 అమెరికాను ఏ విధంగా కుదిపేస్తోందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 7,37,929 కరోనా కేసులు నమోదైతే.. ఇందులో 1,43,055 కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు అయ్యాయి. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా 35,019 మంది మృతి చెందగా.. ఒక్క అమెరికా నుంచే 2,513 మంది మృత్యువాతపడ్డారు. దేశంలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలలో అధిక శాతం కేసులు నమోదవుతున్నాయి. న్యూయార్క్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతోనే కరోనా వ్యాప్తి చెందిందని అక్కడి ప్రజలు కోపాన్ని వెల్లగక్కుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందంటూ న్యూజెర్సీ ప్రజలు మండిపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకు వెళ్లినా ఏ ఒక్కరు తమకు పరీక్షలు నిర్వహించలేదని చాలా మంది ఆవేదన వెల్లగక్కుతున్నారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఉన్నాయి కాని.. వాటికి ఫోన్ చేస్తే స్పందించే వారే కరువయ్యారని ప్రజలు చెబుతున్నారు. ‘నాకు, నా కూతురుకు వారం రోజుల నుంచి జలుబు, దగ్గు వస్తూనే ఉన్నాయి. కరోనా సోకిందేమోనన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించమంటే డాక్టర్లు కనీసం ఈ అంశాన్ని సీరియస్‌గా కూడా తీసుకోలేదు’ అని న్యూజెర్సీకి చెందిన మెలిస్సా లాంబర్ట్ తనకు ఎదురైన పరిస్థితిని చెప్పుకొచ్చింది. 


న్యూజెర్సీ వ్యాప్తంగా ఎన్నో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినప్పటికి ప్రజలకు మాత్రం పరీక్షలు నిర్వహించలేదని ప్రజలు అధికారులపై నిప్పులు చెరిగారు. న్యూజెర్సీలో కరోనా కేసులు ఎందుకు పెరిగాయనే ప్రశ్నకు.. ఇక్కడి ప్రజలు చెబుతున్న సమాధానాలు సరిపోతాయి. పరీక్షలు నిర్వహించకుండా అసలు ఎంత మంది కరోనా బారిన పడ్డారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందంటూ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వారికి తోచిన లెక్కలను జత చేసి చెప్పేస్తున్నారని.. నిజానికి ప్రభుత్వం వెల్లడిస్తున్న జాబితా మొత్తం తప్పేనని ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రజల ఆరోపణలను రోవాన్ యూనివర్శిటీలోని ఇన్‌ఫెక్షస్ డిసీజ్ చీఫ్ జుడిత్ లైట్‌ఫుట్ తోసిపుచ్చారు. నిత్యం తాము పరీక్షలు నిర్వహించే సంఖ్యను పెంచుకుంటూనే వెళ్తున్నామన్నారు. అయితే ఎవరికి ముందుగా పరీక్షలు నిర్వహించాలన్న దానిపై కొంత సందిగ్దం ఏర్పడిందన్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకు వస్తున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు హెల్త్ కమిషనర్ పెర్సిషిలి చెబుతున్నారు. ఆసుపత్రులకు వచ్చినా పరీక్షలు నిర్వహించడం లేదంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానన్నారు.


ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికాలో లాక్ డౌన్ ప్రకటించే అవకాశం లేదన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌‌లో ఉన్న ప్రాంతాలు కూడా ఈస్టర్ నుంచి మామూలు స్థితికి వచ్చేస్తాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఎన్నో వ్యాధుల కారణంగా చాలా మంది చనిపోతూనే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాను నిర్మించింది లాక్‌డౌన్ చేయడానికి కాదని పేర్కొన్నారు. కార్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కార్లను తయారుచేయడం మానేశామా అని ఎదురు ప్రశ్నించారు. మరోపక్క ఈ మొత్తానికి కారణం చైనానే అంటూ నెపాన్ని చైనా మీద నెట్టేశారు. కరోనా వైరస్‌ను కూడా చైనీస్ వైరస్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ కూడా ట్రంప్‌పై మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో ఈ పరిస్థితి సంభవించిందని అన్నారు. కరోనా వ్యాప్తి మొదలైన సమయంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఇంత మంది కరోనా బారిన పడే వారు కాదని అన్నారు. 

Updated Date - 2020-03-31T01:10:54+05:30 IST