వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేం కాదు: బైడెన్

ABN , First Publish Date - 2020-12-05T16:59:21+05:30 IST

దేశ పౌరులంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేం కాదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శుక్రవారం వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేం కాదు: బైడెన్

వాషింగ్టన్: దేశ పౌరులంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేం కాదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రజలను తప్పనిసరిగా టీకా తీసుకోవాలని బలవంతం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు అగ్రరాజ్యంలో మహమ్మారి విలయతాండవం చేస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దాని సామర్థ్యం, భద్రతా దృష్ట్యా తీసుకోవడానికి దేశ ప్రజల్లో చాలా మంది ఆసక్తి చూపించడం లేదని ఇటీవల అక్కడి కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వే నివేదికలు వెల్లడించాయి. సుమారు 42 శాతం మంది వ్యాక్సిన్ పట్ల సుముఖంగా లేరని నివేదికలు తేల్చాయి. ఈ నేపథ్యంలోనే బైడెన్ ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేం కాదని ప్రకటించారు. అయితే, తాను మాత్రం యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తర్వాత వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకుంటాని పేర్కొన్నారు. తనతో పాటు ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జీ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకోవడానికి ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  


"దేశ పౌరులందరూ టీకా తీసుకోవడం తప్పనిసరేం కాదు. వారిని వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయబోయేది కూడా లేదు. టీకా ఒక్కటే కాదు.. మాస్క్ విషయంలో కూడా ఇలాగే ఉంటాం. కానీ, మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి. అందుకే ప్రతిఒక్కరూ ధరించాలని కోరతాను. శాశ్వతంగా కాకుండా కనీసం 100 రోజులు ధరించినా.. దాని ఫలితం వేరేలా ఉంటదనడంలో ఎలాంటి సందేహం లేదు. వైరస్ వ్యాప్తిని నిర్మూలించాలంటే మాత్రం మాస్కే మొదటి అస్త్రం. అలాగే తాను మాత్రం బహిరంగంగా టీకా తీసుకుంటానని, తనతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జీ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా కూడా అదే పని చేయబోతున్నారు."అని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ అన్నారు. 


ఇక వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తినా పూర్తిగా సర్కారే భర్తిస్తుందని బైడెన్ స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, అదే సమయంలో టీకా సైతం అందుబాటులోకి రానుండడంతో మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకుందని గుర్తు చేశారు. కాగా, శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,861 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2.80 లక్షలకు పైగా మంది మహమ్మారికి బలయ్యారు. అలాగే మొత్తం పాజిటివ్ కేసులు 1.45 కోట్లు దాటిపోయాయి.   

Updated Date - 2020-12-05T16:59:21+05:30 IST