ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అంటే ఏమిటి?

ABN , First Publish Date - 2020-04-08T02:20:25+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్-19 పరీక్షలను మరింత పెంచాలని

ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అంటే ఏమిటి?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్-19 పరీక్షలను మరింత పెంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), కేంద్రం హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించాయి. ఇందులో భాగంగా రక్తం ఆధారిత ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఐసీఎంఆర్ ఓ నోట్ పంపింది. ప్రస్తుత పరిస్థితిలో పరీక్షల కోసం ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను (రక్తం ఆధారిత) పంపిణీ చేయాలని యోచిస్తున్నట్టు పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లు అయిన వలసదారులు ఉండే ప్రాంతాలు, నిర్వాసితుల ప్రాంతాల్లో తొలుత ఈ ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.  


దేశంలో ఇప్పటి వరకు కోవిడ్-19ను గుర్తించేందుకు ఆర్‌టీ-పీసీఆర్ (థ్రోట్/నాసల్ స్వాబ్) పరీక్షలు చేస్తున్నారు. ఇది చాలా ఖరీదుతో కూడుకున్నదే కాకుండా సమయం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. అదే యాంటీబాడీ టెస్టులను చాలా వేగంగా చేయొచ్చు. చవక, సులభతరం కూడా. ఒక వ్యక్తి వైరస్, లేదంటే ఇతర వ్యాధికారక వైరస్ బారిన పడినప్పుడు శరీరం దానికి స్పందించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు రక్తంలోని కొన్ని ఇమ్యునోగ్లోబిలిన్స్, లేదంటే యాంటీబాడీల స్థాయిని కొలుస్తాయి. ఒక్క వేలిముద్రను ఉపయోగించి దీనిని చేయవచ్చు. గతంలో కరోనా పరీక్షలు చేయించుకోని రోగిని ఈ యాంటీబాడీ పరీక్షతో గుర్తించవచ్చు. 

Updated Date - 2020-04-08T02:20:25+05:30 IST