Covid-19 : కర్ణాటక మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2021-05-05T18:12:47+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో కర్ణాటక మంత్రివర్గం బుధవారం కీలక

Covid-19 : కర్ణాటక మంత్రివర్గం కీలక నిర్ణయాలు

బెంగళూరు : కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో కర్ణాటక మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వివరించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు ప్రధాన బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కుదుర్చుకునేందుకు జగదీశ్ షెట్టార్‌ను నియమించామని చెప్పారు. 


ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు, రెమ్‌డెసివిర్, ఇతర అవసరాలను తీర్చే బాధ్యతను ప్రతి జిల్లాకు సంబంధిత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి అప్పగించినట్లు తెలిపారు. జగదీశ్ షెట్టార్ ఆక్సిజన్ సెంటర్లకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కుదుర్చుకుని ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. 


రాష్ట్రంలోని వైద్య కళాశాలలతో డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ్ సమన్వయంతో పని చేస్తారని చెప్పారు. మానవ వనరులు, రెమ్‌డెసివిర్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల కొరత లేకుండా బసవరాజ్ బొమ్మయ్, ఆర్ అశోక్ చర్యలు తీసుకుంటారని తెలిపారు. బీబీఎంపీ వార్ రూమ్ ఇన్‌ఛార్జిగా అరవింద లింబావలి వ్యవహరిస్తారన్నారు. 


పొరుగున ఉన్న మహారాష్ట్రలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినందువల్ల కర్ణాటకలోని జిందాల్ కంపెనీలో తయారవుతున్న ఆక్సిజన్‌ను రాష్ట్రంలోనే వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. 


ఏప్రిల్ 3న చామరాజ్ నగర్‌లో జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు శివయోగి కలసద్‌ను నియమించామన్నారు. మూడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించామన్నారు. మీడియా సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా పరిగణించి, ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. రెమ్‌డెసివిర్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తోందన్నారు. 


Updated Date - 2021-05-05T18:12:47+05:30 IST