స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ ‘కరోనా’ మరణాలు.. అసలు కారణాలివేనా..?

ABN , First Publish Date - 2020-04-06T23:11:31+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్ -19 సునామీలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70వేల మంది మరణించారు. సుమారు 13ల

స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ ‘కరోనా’ మరణాలు.. అసలు కారణాలివేనా..?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్ -19 సునామీలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70వేల మంది మరణించారు. సుమారు 13లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వివరాలను పరిశీలిస్తే.. కరోనా కాటుకు అత్యధికంగా పురుషులే మరణిస్తన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. పలు పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కొవిడ్ ముప్పు పురుషులకే అత్యధికంగా ఉందని తేల్చి చెప్పాయి. అయితే.. వైరస్ తీవ్రత పురుషులపై మాత్రమే  ఎందుకు అత్యధికంగా ఉంటుందనే ప్రశ్నకు ఇంత వరకు సమాధానం దొరకలేదు. ప్రస్తుతం ఇది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవి ఏంటంటే..


జీవనశైలి..

వైరస్ ముప్పు అత్యధికంగా ఉండటానికి పురుషుల జీవన‌శైలి కూడా ఒక కారణం అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పొగతాగడం, మద్యం సేవించే అలవాటు ఉండటం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. మహిళల కంటే పరుషులు ఐదు‌రెట్లు ఎక్కువగా మద్యం సేవిస్తారు. పొగతాగడంలో కూడా పురుషులదే పై చేయి. పొగతాగడం, మద్యంసేవించే వారికి వైరస్ ముప్పు అత్యధికంగా ఉంటుందని ఇప్పటికే పలు రిపోర్టుల్లో వెల్లడైంది. అందువల్ల పురుషులపై మాత్రమే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


చేతులు కడుక్కునే అలవాటు..

చేతులు కడుక్కునే విషయంలో మగవారు బద్ధకంగా వ్యవహరిస్తారని అమెరికాకు చెందిన ఓ రిపోర్టు స్పష్టం చేసింది. టాయిలెట్‌లను ఉపయోగించుకున్న తర్వాత 100 మంది పురుషుల్లో కేవలం 31 మంది మాత్రమే వారి చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటున్నారు. స్త్రీలలో ఈ సంఖ్య 65గా ఉందని అమెరికాలో చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. ప్రజలు తరచుగా చేతులను సబ్బు లేదా సానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. పురుషుల్లో ఈ అలవాటు తక్కువగా ఉండటం వల్లే.. అత్యధిక మంది కొవిడ్-19 బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 


ఆరోగ్యంపట్ల అశ్రద్ధ.. 

కరోనా కాటుకు పరుషులే అత్యధికంగా బలవ్వడానికి.. ఆరోగ్యం పట్ల వారికి ఉండే అశ్రద్ధ కూడా ఓ ప్రధాన కారణం అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా స్త్రీలు అస్వస్థతకు గురైతే వారు వెంటనే దగ్గర్లోని వైద్యులను సంప్రదిస్తారనీ.. మగవాళ్లలో ఈ లక్షణం చాలా తక్కువ మందిలో ఉంటుందనే విషయం ఓ సర్వేలో వెల్లడైనట్లు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే దాకా పురుషులు సొంత వైద్యాన్నే నమ్ముకుంటారని పరిశోధనలో వెల్లడయింది. కరోనా వైరస్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా బారినపడగానే స్త్రీలు చికిత్స పొంది కోలుకుంటున్నారనీ.. పురుషులు మాత్రం ఆలస్యం చేసి ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. 


రోగనిరోధక శక్తి..

స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువ. మహిళల్లో రోగనిరోధక శక్తి అత్యధికంగా ఉండటం వల్ల.. ఏవైనా వైరల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డా కూడా వారు త్వరగా కోలుకుంటారు. ఇమ్యూనిటీపవర్ ఎక్కువగా ఉండటం వల్లే.. వైద్యానికి కూడా స్త్రీలు త్వరగా స్పందిస్తారు. అందువల్లే కరోనా బారినపడ్డా కానీ.. పురుషుల కంటే స్త్రీలే తొందరగా కోలుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. 


హార్మోన్లు..

స్త్రీల జీవితకాలంలో వివిధ దశలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. బాల్యం, యవ్వనం, గర్భవతి, మోనోఫాజ్.. వంటి దశల్లో స్త్రీలలో విడుదలయ్యే హార్మోన్లలో తేడాలుంటాయి. ఇవి కాస్తా శరీరంలోని రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంటాయి. మహిళల్లోని ఈ జీవితచక్రమే కరోనా నుంచి పరోక్షంగా కాపాడుతోంది. కరోనా బారిన పడి మరణిస్తున్న వారిలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం కావచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.  రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారు కరోనా బారిన పడినా.. త్వరగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే..


ఎక్స్ క్రోమోజోమ్..

లింగ నిర్ధారణకు ఉపయోగపడే ఎక్స్ క్రమోజోమ్‌కు, కరోనా వైరస్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? కచ్చితంగా సంబంధం ఉంటుందంటున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తి కారణమయ్యే జన్యువులను ఎక్స్ క్రోమోజోమ్‌లు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. స్త్రీలలో రెండు ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయనీ.. పురుషుల్లో మాత్రం ఒకటే ఎక్స్ ‌క్రోమోజోమ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల వైరస్ తీవ్రత స్త్రీలలో తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. నిపుణులు చెప్పిన విషయాలకు కూడా సరైన ఆధారాలు లేకపోవడం గమనార్హం. 

Updated Date - 2020-04-06T23:11:31+05:30 IST