కోవిడ్-19 : కొన్ని బ్యాంకు శాఖల మూసివేత?

ABN , First Publish Date - 2020-03-26T22:07:13+05:30 IST

బ్యాంకులు తమ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం

కోవిడ్-19 : కొన్ని బ్యాంకు శాఖల మూసివేత?

న్యూఢిల్లీ : బ్యాంకులు తమ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం నేపథ్యంలో వివిధ బ్యాంకుల శాఖల్లో కొన్నిటిని మూసివేయడంపై సమాలోచనలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన ప్రణాళికను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), ఇతర ప్రధాన బ్యాంకులు రచిస్తున్నట్లు తెలిపాయి.


మన దేశ ప్రజలు ఇప్పటికీ నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల అష్ట దిగ్బంధనం నుంచి బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారు. బ్యాంకుల సేవలను అత్యవసర సేవలుగా పరిగణిస్తున్నారు. 


అయితే తమ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బ్యాంకు శాఖ మాత్రమే పని చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు పని చేసే అవకాశం ఉంది. పని చేసిన రోజుల్లో కూడా కేవలం పేదల సంక్షేమ పథకాల సొమ్మును అందజేయడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల గురించి తెలియనివారికి సేవలందించడానికి ప్రాధాన్యమివ్వబోతున్నట్లు సమాచారం. 


కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ సొమ్ము కూడా పేదలకు డైరెక్ట్ క్యాష్ పేమెంట్స్‌ విధానంలో వారి ఖాతాలకు చేరుతుంది. ఇటువంటి సొమ్మును పేదలకు అందజేయడం కోసం బ్యాంకు శాఖలు పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


అష్ట దిగ్బంధనం సమయంలో కొన్ని బ్యాంకు శాఖలను మూసివేయడానికి సంబంధించిన సమాచారంపై భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్పందించలేదు.


Updated Date - 2020-03-26T22:07:13+05:30 IST