వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటింది. దీంతో కరోనా మహమ్మారి వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా అది నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 53 లక్షల కరోనా మరణాలు సంభవించగా, అందులో 15 శాతం(8 లక్షలు) అక్కడివే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అమెరికాలో కొవిడ్ మరణాలు పూర్తిగా ఆగలేదు. అమెరికాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య సెయింట్ లూయిస్, అట్లాంటా నగరాల మొత్తం జనాభాకు సమానం. కొవిడ్ మృతుల్లో 75 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారేనని పేర్కొంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అత్యధిక కొవిడ్ మరణాల జాబితాలో అమెరికా తర్వాతి స్థానంలో బ్రెజిల్ (6 లక్షల మరణాలు) ఉంది. కాగా, బ్రిటన్‌లో మునుపెన్నడూ లేని విధంగా భారీగా 78,610 కొత్త కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో 10వేల కేసులు ఒమైక్రాన్ వేరియంట్‌వే.