యూకేలో కరోనాతో మరణించిన భారతీయులు ఎంతమందంటే !

ABN , First Publish Date - 2020-11-28T20:59:34+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు బ్రిటన్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

యూకేలో కరోనాతో మరణించిన భారతీయులు ఎంతమందంటే !

లండన్: ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు బ్రిటన్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 15.89 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 57వేలకు పైగా మంది ఈ వైరస్‌కు బలయ్యారు. కాగా, యూకేలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారిలో వెయ్యి మందికి పైగా భారతీయులు ఉన్నారు. బ్రిటన్‌లోని వివిధ ఆస్పత్రులు, కేర్ హోమ్స్‌లో శుక్రవారం నాటికి 1,029 మంది భారతీయులు కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) వెల్లడించింది. అలాగే పాకిస్తానీలు 889 మంది, కరేబియన్స్ 739 మంది ఇప్పటివరకు కరోనాకు బలైనట్లు ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది. లీసెస్టర్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, సౌతాల్, బ్రెంట్, హారోలో వివిధ కంపెనీలు భారతీయులు, ఆసియా వాసుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఇక యూకేలో కరోనాతో చనిపోయిన భారతీయుల్లో చాలా మంది హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారని ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది. ఇలా కొవిడ్‌కు బలైన భారత వైద్య నిపుణుల్లో జితేంద్ర కుమార్ రాథోడ్, మంజీత్ సింగ్ రియాత్, క్రిషన్ అరోరా, రాజేష్ కలరయ్య, పూజ శర్మ, జయేష్ పటేల్, వివేక్ శర్మ, కమలేష్ కుమార్ మాసన్, అమరంటే డయాస్, సోఫీ ఫాగన్, హమ్జా పచేరి, అమరిక్ బామోత్రా ఉన్నారు. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా స్వైరవిహారం చేస్తున్న కరోనా ఇప్పటివరకు 6.20 కోట్ల మందికి సోకగా... 14.50 లక్షల మందిని కబళించింది.      

Updated Date - 2020-11-28T20:59:34+05:30 IST