గాలిలోనూ కరోనా అంటున్న శాస్త్ర‌వేత్త‌లు.. ఆధారాలు చాలవన్న డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-07-07T13:17:22+05:30 IST

‘‘కరోనా వైరస్‌ ఎయిర్‌బోర్న్‌ (గాలి ద్వారా వ్యాపించే వైరస్‌) కాదు.. ఇది డ్రాప్‌లెట్‌ వైరస్‌. అంటే, వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు వారి ముక్కు నుంచి, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వారి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది.’’

గాలిలోనూ కరోనా అంటున్న శాస్త్ర‌వేత్త‌లు.. ఆధారాలు చాలవన్న డబ్ల్యూహెచ్‌వో

అతి సూక్ష్మ తుంపర్ల ద్వారా కూడా వ్యాపిస్తుంది

డబ్ల్యూహెచ్‌వోకు 239 మంది శాస్త్రవేత్తల లేఖ

గాల్లో వ్యాపించేదిగా ప్రకటించాలని సూచన

సరైన ఆధారాలు లేవన్న డబ్ల్యూహెచ్‌వో

‘‘కరోనా వైరస్‌ ఎయిర్‌బోర్న్‌ (గాలి ద్వారా వ్యాపించే వైరస్‌) కాదు.. ఇది డ్రాప్‌లెట్‌ వైరస్‌. అంటే, వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు వారి ముక్కు నుంచి, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వారి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది.’’


..కొవిడ్‌-19 గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణుల దాకా అందరూ చెబుతున్న మాట ఇదే! అంటే, వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడిన అతి సూక్ష్మ తుంపర్లలో ఉండే వైరస్‌ కొద్దిపాటి దూరం మేర గాలిలోకి వ్యాపిస్తుంది. ఆ తుంపర్లు కింద పడిపోగానే వైరస్‌ కూడా వాటితోపాటే కింద పడిపోతుందని దీని అర్థం. అందుకే బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. అలాంటి తుంపర్ల ద్వారా మనకు వైరస్‌ సోకకుండా నిరోధించడానికి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కానీ.. వారంతా చెబుతున్నట్టు ఇది కేవలం డ్రాప్‌లెట్‌ వైరస్‌ మాత్రమే కాదని, గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ అని పేర్కొంటూ 32 దేశాలకు చెందిన 239 శాస్త్రజ్ఞులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు! తుంపర్లతో పాటు వైరస్‌ గాల్లోనే ఉంటుందని.. బహిరంగ, జనసమ్మర్ద ప్రదేశాల్లోనే కాక ఇండోర్స్‌లో (ఇంటిలోపల, కార్యాలయాల్లో) సైతం గాల్లో ఉంటూ ఇతరులకు సంక్రమిస్తుందని అందులో పేర్కొన్నారు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ల అనంతరం ప్రపంచవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, మార్కెట్లు, క్యాసినోల వంటివి తెరిచాక కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఇదేనని వారు అభిప్రాయపడ్డారు. కాబ ట్టి, కరోనాను ‘ఎయిర్‌బోర్న్‌’ వైర్‌సగా ప్రకటించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు!! 


ఎయిర్‌బోర్న్‌.. డ్రాప్‌లెట్‌.. ఏమిటి తేడా?

ఎయిర్‌బోర్న్‌ వైర్‌సకు, డ్రాప్‌లెట్‌ వైరస్‌కు స్పష్టమైన తేడా ఏమిటి? ఏదైనా వైర్‌సను గాలి ద్వారా వ్యాపించేదిగా ఎలా నిర్ధారిస్తారు? అంటే.. సాధారణంగా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్లలో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉంటాయి. పెద్ద తుంపర్లు తక్కువ దూరం ప్రయాణించి కింద (లేదా) అక్కడ ఉన్న బొమ్మలు, తలుపు గొళ్లెం వంటివాటిపై పడిపోతాయి. అదే చిన్న తుంపర్లయితే మరికొంచెం ఎక్కువ దూరం ప్రయాణించి పడిపోతాయి (అలా తుంపర్లు పడిన చోట ఎవరైనా చెయ్యి పెట్టినప్పుడు అందులో ఉండే వైరస్‌ వారి చేతికి అంటుతుంది. ఆ చేతిని ముఖంపై పెట్టుకున్నప్పుడు ముక్కు, నోరు, కళ్ల ద్వారా వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే.. మనం పెట్టుకున్న మాస్కు ముందు భాగాన్ని ముట్టుకోవద్దని శాస్త్రజ్ఞులు పదేపదే చెబుతున్నారు). ఈ రెండింటికన్నా చిన్నవి.. అంటే మన కంటికి కనిపించనంత సూక్ష్మమైనవి, పరిమాణంలో 5 మైక్రోమీటర్ల (మైక్రో మీటర్‌/మైక్రాన్‌ అంటే మీటర్‌లో పది లక్షల వంతు) కన్నా తక్కువ వ్యాసం ఉండేవి గాలిలో ఎక్కువసేపు అలా నిలిచిపోతాయి. వాటిని ఏరోసాల్స్‌ అంటారు. ఈ ఏరోసాల్స్‌ను పీల్చడం ద్వారా కూడా వ్యాధి సంక్రమిస్తుంది కాబట్టి కొవిడ్‌-19 ఎయిర్‌బోర్న్‌ వ్యాధే అని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఆధారాలు చాలవు..

కరోనాను గాలి ద్వారా వ్యాపించే వైర్‌సగా ప్రకటించాలన్న శాస్త్రజ్ఞుల వాదనతో డబ్ల్యూహెచ్‌వో ఏకీభవించట్లేదు. అది ఎయిర్‌బోర్న్‌ అని ప్రకటించడానికి.. వారు చూపుతున్న ఆధారాలు సరిపోవని డాక్టర్‌ బెనెడెట్టా అలెగ్రాంజి  అన్నారు. కొవిడ్‌-19ను గాలి ద్వారా సోకే సాంక్రమిక వ్యాధిగా గుర్తించాలని ఏప్రిల్‌లోనే 36 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యుహెచ్‌వోకు ఒక లేఖ రాశారు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.


పాట పాడినా సంక్రమిస్తుంది!

‘ఆంధ్రజ్యోతి’తో మేరిల్యాండ్‌ ప్రొఫెసర్‌ డోనాల్డ్‌

‘‘కొవిడ్‌ సోకిన వారు గట్టిగా తుమ్మినా.. దగ్గినా.. గట్టిగా పాటలు పాడినా వైరస్‌ వ్యాపిస్తుంది.’’ అని  మేరిల్యాండ్‌ వర్సిటీ పరిశోధకుడు, డబ్ల్యుహెచ్‌వో సలహాదారు ప్రొఫెసర్‌ డోనాల్డ్‌ కె మిల్టన్‌ ‘ఆంధ్రజ్యోతి’ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘కరోనా నీటి ద్వారా వ్యాపించే వ్యాధి కాదని మనందరికీ తెలుసు. కానీ అది గాలి ద్వారా వ్యాపిస్తుందా? లేదా అనే విషయం దగ్గరే సమస్యంతా. డబ్ల్యుహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం తుమ్ములు, దగ్గు ద్వారా మాత్రమే కాకుండా శ్వాస, మాట, పాటల ద్వారా కూడా వ్యాపిస్తే దానిని ఎయిర్‌బోర్న్‌ అంటారు. ఎయిర్‌బోర్న్‌ వ్యాధులకు రెండు లక్షణాలుంటాయి. ఒకటి.. వ్యాధి కారక వైర్‌సలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అంతే కాకుండా వీటికి ఎక్కువ దూరం ప్రయాణించే శక్తి కూడా ఉంటుంది. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే కొవిడ్‌ను కూడా ఎయిర్‌బోర్న్‌ అనే అనాలి. మా పరిశోధనల్లో కూడా కోవిడ్‌ వైరస్‌ ఏరోసోల్స్‌ ద్వారా వ్యాపిస్తుందని తేలింది. అయితే కణ పరిమాణాలపై కొంత సందిగ్దత ఉంది. ఈ కారణం వల్లే కొవిడ్‌ను గాలి ద్వారా వ్యాపించే వ్యాధిగా డబ్ల్యుహెచ్‌వో ప్రకటించలేదు‘‘ అని ఆయన చెప్పారు. 


గాలి ద్వారా వ్యాపించదు: డీజీ శేఖర్‌ మాండే

కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుందంటూ 239 మంది శాస్త్రజ్ఞులు డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాయడంపై మనదేశానికి చెందిన సెంట్రల్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మాండే స్పందించారు. ‘గాలి ద్వారా వ్యాపించే వ్యాధి’కి పుస్తకాల్లో ఉన్న నిర్వచనాన్ని పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదని ఆయన స్పష్టం చేశారు. అయితే, వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అది గాలిలో కొన్ని అడుగుల దూరం మేరకు అతి సూక్ష్మ తుంపరల ద్వారా ప్రయాణించగలదని చెప్పారు. అంతే తప్ప అది గాలితోపాటు వ్యాపించదని.. కొద్దిసమయంలోనే కింద పడిపోతుందని ఆయన వివరించారు. అయితే, మూసినట్లుగా ఉండే కార్యాలయాల వంటి చోట్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందన్న ఆందోళనలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. -సెంట్రల్‌ డెస్క్‌, స్పెషల్‌ డెస్క్

Updated Date - 2020-07-07T13:17:22+05:30 IST