కోవర్టు గండం!

ABN , First Publish Date - 2021-02-24T07:02:51+05:30 IST

ఎన్నికల్లో విజయ తీరాన్ని చేరుకునే వరకు ప్రతి ఓటరునూ ప్రాధేయపడాలి.

కోవర్టు గండం!

 అభ్యర్థుల్లో అయోమయం

 వెంట నడుస్తున్నా విశ్వసించలేని పరిస్థితి

 కోవర్టిజం నడుస్తోందని అనుమానం


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఎన్నికల్లో విజయ తీరాన్ని చేరుకునే వరకు ప్రతి ఓటరునూ ప్రాధేయపడాలి. వెంట నడిచే కార్యకర్తలు అలకపాన్పులు ఎక్కకుండా జాగ్రత్తపడాలి. ఈ రెండింటిలో ఏ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా ఓటమి వచ్చి వాకిట్లో వాలిపోతుంది. పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేసే అంశాలు ఇవి. ఇప్పుడు వీటికి తోడు మరో అంశం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’. ప్రచారంలో ఒక్కొక్కరినీ ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులకు ఇది లాభం చేకూర్చుతుందో.. దెబ్బతీస్తుందో చెప్పడం కష్టమే. జంపింగ్‌ జిలానీలు ఎక్కువగా ఎన్నికల సమయంలో జెండాలను మార్చేస్తుంటారు. ప్రచారంలో బిజీగా ఉన్న అభ్యర్థులు ఇలా వచ్చి తమలో చేరేవారితో పాటు, తమ వెంట తిరిగే అనుచరగణం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ప్రచారానికి వెళితే, కార్యకర్తల సంఖ్య అధికంగా కనిపించాలి. ఆ కార్యకర్తల్లో చివరి వరకూ తమ వెంట నికరంగా నిలబడేదెవరో అభ్యర్థులు తేల్చుకోలేకపోతున్నారు. ఎవరు అంకిత భావంతో తమకు అనుకూలంగా పనిచేస్తున్నారో, ఎవరు అనుకూలురుగా నటిస్తూ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారో అభ్యర్థులు గుర్తించలేకపోతున్నారు.


చేరిక సంబరమేనా...

ఒక అభ్యర్థి వద్ద తమకు గౌరవం దక్కడం లేదనో, కష్టపడిన వారికి కాకుండా పొరుగు ప్రాంతం వారికి టికెట్‌ కేటాయించారనో కార్యకర్తలు పార్టీలు మార్చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఇలాంటి వారు వచ్చి తమ పార్టీలో చేరుతున్నారన్న ఆనందం కంటే అభ్యర్థులను భయమే ఎక్కువగా వెంటాడుతోంది. కొత్తగా చేరిన వారు తమతో కలిసి పనిచేయడానికి వచ్చారా? కోవర్టులుగా వ్యవహరించడానికి వచ్చారా? అన్నది ఒక సందేహం. సాధారణంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరి వ్యూహాలను మరొకరు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. దాన్ని బట్టి వ్యూహాలను మార్చుకుంటారు. అందుకోసమే ప్రత్యర్థులు కొందరిని తమ శిబిరాలకు పంపుతున్నారన్న అనుమానాలతో అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ప్రచారానికి వీలుగా కార్యకర్తలు తమ ప్రాంతాల్లో కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యాలయాల్లో ఏం జరుగుతుందోనన్న సందేహం అభ్యర్థులను వెంటాడుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జరిగిన సిత్రాలే విజయవాడలోనూ జరిగే అవకాశాలు లేకపోలేదని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. 


‘ప్రస్తుతం ఎవరిని విశ్వసించాలో, ఎవరిని విశ్వసించకూడదో తెలియని పరిస్థితుల్లో మేం ఉన్నాం. మా వెంట తిరిగే వాళ్లంతా మాకే పనిచేస్తున్నారన్న నమ్మకం ఒకప్పుడు ఉండేది. తెర వెనుక ఉండి కొంతమంది పెద్ద నాయకులు అమలు చేసే వ్యూహాలు మాకు అర్థం కావడం లేదు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండా మునిగిపోతాం.’ అని ఓ అభ్యర్థి వ్యాఖ్యానించడమే వారి మనసులో ఉన్న భయాన్ని సూచిస్తోంది.

Updated Date - 2021-02-24T07:02:51+05:30 IST