సామాజిక మాధ్యమాలకు ముకుతాడు!

ABN , First Publish Date - 2021-06-01T07:48:18+05:30 IST

ఈస్టిండియా కంపెనీతో మన దేశానికి దాపురించిన దుస్థితిని ఎలా మరచిపోగలం? ప్రపంచ వాణిజ్యంలో మన దేశం వాటా కేవలం రెండు శతాబ్దాలలో...

సామాజిక మాధ్యమాలకు ముకుతాడు!

ఈస్టిండియా కంపెనీతో మన దేశానికి దాపురించిన దుస్థితిని ఎలా మరచిపోగలం? ప్రపంచ వాణిజ్యంలో మన దేశం వాటా కేవలం రెండు శతాబ్దాలలో 23 శాతం నుంచి 2 శాతానికి పడిపోవడం ఆ కంపెనీ పుణ్యమే కదా! ఆ యూరోపియన్ కంపెనీ చరిత్రను అలా ఉంచి ఇప్పుడు మన జాతి జీవనంలో అంతర్భాగమైపోయిన అమెరికన్ కంపెనీల విషయాన్ని చూద్దాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు అయిన గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌ మన వాణిజ్యంపై గుత్తాధిపత్యం చెలాయించడమేకాదు, మన మనస్సులను సైతం నియంత్రిస్తున్నాయి! ఇదంతా తమ వ్యాపార ప్రయోజనాలను సాధించుకోవడానికే సుమా! భారత ప్రభుత్వం తమ కార్యకలాపాలపై నియంత్రణలను విధిస్తే దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోతుందనే తప్పుడు సమాచారాన్ని ఆ కంపెనీలు చురుగ్గా వ్యాపింపజేయడమే అందుకొక నిదర్శనం. చైనాలో తమ కార్యకలాపాలపై ఆ దేశ ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆంక్షలు, భారత్‌లో నియంత్రణల కంటే చాలా కఠినమైనవి అయినప్పటికీ ఆ కమ్యూనిస్టు దేశం భారీ విదేశీ మదుపులకు ప్రధాన గమ్యంగా కొనసాగుతోందన్న వాస్తవాన్ని అమెరికా ఐటి కంపెనీలు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నాయి. 


కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ఆ కంపెనీలకు తప్పనిసరి అయింది. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విటర్ నిలిపివేసింది. అదేవిధంగా భారతీయ జనతాపార్టీ కథనాలు కొన్నిటిని కూడా నిలిపివేసింది. అవి కల్పిత కథలు అని ట్విటర్ పేర్కొంది. ఇలా నిలిపివేయడం సరైన విషయమేనా కాదా అన్నది ప్రశ్న కాదు. ట్విటర్ ఈ నిర్ణయాలను తన వ్యాపార ప్రయోజనాలను మెరుగుపరచుకోవడానికి తీసుకున్నదా లేక సత్యాన్ని కాపాడేందుకు తీసుకున్నదా అన్నదే అసలు ప్రశ్న. ‘సరైన’ లేదా ‘తప్పుడు’ నిర్ణయాన్ని వ్యాపారపరమైన ఉన్నతిని దృష్టిలో పెట్టుకుని తీసుకోవచ్చా? ఈ ప్రకారం సామాజిక మాధ్యమాల కంపెనీలను క్రమబద్ధీకరించేందుకు భారత ప్రభుత్వం నిర్దేశించిన నియమనిబంధనలు సరైన రీతిలోనే ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం సదరు కంపెనీలు భారత ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండడం కోసం ఒక ఫిర్యాదుల అధికారిని, ఒక పాలనావ్యవహారాల అధికారిని, ఒక నోడల్ అధికారిని నియమించవలసి ఉంది. 


అయితే సామాజిక మాధ్యమాలపై నియంత్రణను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించడం శ్రేయస్కరం కాదు. అందులో ఒక కన్పించని ప్రమాదముంది. వూహాన్‌లోని ఒక ప్రభుత్వ ప్రయోగశాలలో కరోనా వైరస్‌ను సృష్టి ంచారనడానికి సంబంధించిన వార్తలేవీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వెలువడకుండా చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు ఒక నిజమైన పాత్ర నిర్వహించవలసి ఉంది. అవును, సమాచారాన్ని సత్యనిష్ఠతో అందజేయడంలో ఆ మాధ్యమాలు ఒక బృహత్తర సానుకూల పాత్ర నిర్వహిస్తున్నాయి. 


రెండు విరుద్ధ అంశాలు మన ముందున్నాయి. దేశ ప్రజలకు సామాజిక మాధ్యమాలు జవాబుదారీగా ఉండాలి; వాక్ స్వాతంత్ర్యం పేరుతో అవి వ్యాపార ప్రయోజనాల కోసం పాకులాడకూడదు. ప్రభుత్వాలు విధించే ఆంక్షలను అధిగమించి సమాచారాన్ని స్వేచ్ఛగా ప్రజలకు చేర్చాలి. ఇందుకు ఏం చేయాలి? దానికి సమాధానంగా మూడు చర్యలను సూచిస్తాను. ఒకటి-– సామాజిక మాధ్యమాల కంపెనీలన్నీ భారత్‌లో విధిగా తమ విభాగాన్ని నెలకొల్పి, తమ కార్యకలాపాలు అన్నిటినీ ఆ వేదిక నుంచే నిర్వహించాలి. ఈ కంపెనీల మేనేజ్‌మెంట్ బోర్డ్‌లలో ప్రభుత్వ ప్రతినిధిగా ఒక డైరెక్టర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండాలి. భారీ రుణాలు తీసుకున్న కంపెనీల మేనేజ్‌మెంట్ బోర్డ్‌లలో బ్యాంకులు తమ ప్రతినిధిని నియమించిన విధంగానే ఈ నియామకం కూడా జరగాలి. సదరు కంపెనీలలో ‘ఇండిపెండెంట్ డైరెక్టర్’లను నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండాలి. ఈ ప్రతినిధుల ద్వారా సామాజిక మాధ్యమాల కార్యకలాపాలను భారత ప్రజలు పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. 


రెండు–పెద్ద సామాజిక మాధ్యమాల కంపెనీలను ప్రభుత్వం విభజించి తీరాలి. వ్యక్తిగత గోపత్యకు సంబంధించిన నియమాల్లో వాట్సాప్ మార్పులు చేసిన తరువాత సిగ్నల్, టెలిగ్రామ్ మొదలైన మెసేజింగ్ వేదికలు ఇతోధిక పురోగతి సాధించడం గమనార్హం. ఒక్కో సామాజిక మాధ్యమ వేదికకు వినియోగదారులు ఎంత మంది ఉన్నారో పరిశీలించి, ఒక నిర్దిష్ట వేదికకు గరిష్ఠంగా ఎంత మంది వాడకందారులు ఉండాలో నిర్ణయించాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం ఆదేశించాలి. ఉదాహరణకు రెండు కోట్ల మంది కంటే ఎక్కువ మంది సభ్యులు గల సామాజిక మాధ్యమ వేదికను రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో చిన్న, స్వతంత్ర కంపెనీలుగా విభజించేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. 


మూడు–మనదేశంలో మన ఐ.టి. నిపుణులతో ప్రారంభమైన సామాజిక మాధ్యమాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల అండదండల నందించాలి. సిలికాన్ వ్యాలీలో భారతీయులు అగ్రేసరులుగా ఉన్నప్పటికీ విదేశీ కంపెనీలకు దీటుగా సొంత సామాజిక మాధ్యమాలను అభివృద్ధిపరచలేకపోవడం ఒక మహా విషాదం. పది లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్న దేశీయ సామాజిక మాధ్యమ వేదికలకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందడం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వివిధ దేశీయ సామాజిక మాధ్యమాల కంపెనీలు అభివృద్ధిచెందడానికి అవకాశాలు మెరుగవుతాయి. విదేశీ కంపెనీల పోటీని దీటుగా ఎదుర్కోవడంతోపాటు మనమే మన సొంత అంతర్జాతీయ వేదికలను కూడా అభివృద్ధిపరచుకోవడం సాధ్యమవుతుంది. 


దేశ చట్టాలకు జవాబుదారీతనం వహించేలా విదేశీ సామాజిక మాధ్యమాల కంపెనీలను బలవంతం చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం బలహీనపడుతుందని, దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక తగ్గిపోతుందేమోననే భయాన్ని మనం విడనాడి తీరాలి. దురదృష్టవశాత్తు మన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటువంటి భయసంకోచాలతో ఉంది. ఈ శోచనీయ పరిస్థితి సామాజిక మాధ్యమాలు వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచార ఫలితమేనని ప్రత్యేకంగా చెప్పాలా?


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-06-01T07:48:18+05:30 IST