హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవాక్సిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. కొనుగోలు చేసిన ఏజెన్సీలకు సరఫరా పూర్తి కావడం.. భవిష్యత్తులో గిరాకీ తగ్గనుండడంతో అన్ని యూనిట్లలో కొవాక్సిన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. గత ఏడాది కాలంలో ఇతర వాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి కొవాక్సిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ దృష్టి పెట్టింది. అత్యవసర వినియోగ లిస్టింగ్ (ఈయూఎల్)లో చేర్చిన అనంతరం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం కంపెనీ ప్లాంట్లను సందర్శించింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా కార్యకలాపాలను పెంచేందుకు డబ్ల్యూహెచ్ఓ బృందానికి కంపెనీ హామీ ఇచ్చింది. ఇక ఉత్పత్తి యూనిట్ల మెయింటెనెన్స్, ప్రాసెస్ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని కంపెనీ భావిస్తోంది.