ఇక కోవాగ్జిన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:19:43+05:30 IST

ఇక కోవాగ్జిన్‌

ఇక కోవాగ్జిన్‌

నేటి నుంచి కేవలం కోవాగ్జిన్‌ రెండో డోసు టీకాలే..

కోవిషీల్డ్‌ టీకాకు గడుపు పెంపు

మొదటి, రెండు డోసుల మధ్య 84 రోజుల సమయం

కోవాగ్జిన్‌కు మాత్రం 28 రోజులే..

కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి అధికారుల నిర్ణయం

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కోవిషీల్డ్‌ టీకా మొదటి, రెండు డోసుల మధ్య వ్యవధిని 42 రోజుల నుంచి 84 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందుకనుగుణంగా జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లా ప్రజలకు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్న వారికి, రెండో డోసు ఇవ్వడానికి దాదాపు 12 వారాల వ్యవధి ఉండటంతో అందుకనుగుణంగా కొవిన్‌ యాప్‌లో మార్పులు చేస్తున్నారని, శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని జిల్లా అధికారులు తెలిపారు. 

కోవాగ్జిన్‌కు 28 రోజులే గడువు

కోవాగ్జిన్‌ టీకా పంపిణీ విషయంలో మాత్రం మొదటి, రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులకే పరిమితమైంది. ఈ కారణంగా జిల్లాలో కోవాగ్జిన్‌ మొదటి డోసు టీకా తీసుకున్న వారందరికీ గడువులోగా రెండో డోసును అందించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో కోవిషీల్డ్‌ టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసి, కోవాగ్జిన్‌ రెండో డోసు లక్ష్యాన్ని పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో కేవలం కోవాగ్జిన్‌ మాత్రమే రెండో డోసు వేశారు. ఇంకా 27,500 కోవాగ్జిన్‌ టీకా డోసులు అందుబాటులో ఉండటంతో శనివారం కూడా జిల్లావ్యాప్తంగా 25 నుంచి 35 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో కేవలం కోవాగ్జిన్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. డ్యూ లిస్టుల ఆధారంగా కోవాగ్జిన్‌ రెండో డోసు ఇవ్వాల్సిన లబ్ధిదారులకు ముందే టైమ్‌స్లాట్స్‌ ప్రకారం టోకెన్లు అందజేసి ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా, ఎవరికైనా మొదటి డోస్‌ కింద కోవాగ్జిన్‌ టీకా ఇస్తే, తర్వాత వారికి రెండో డోసు అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు పరిమితంగానే సరఫరా అవుతున్న కోవాగ్జిన్‌ డోసులను కేవలం రెండో డోసు లబ్ధిదారులకే ఇవ్వాలని నిర్ణయించారు. 

50వేల మందికి పైగా ఎదురుచూపులు 

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 6లక్షల66వేల మందికి మొదటి డోస్‌ టీకా ఇచ్చారు. వీరిలో సుమారు లక్షా50వేల మంది కోవాగ్జిన్‌ టీకా తీసుకోగా, మిగిలిన వారందరికీ కోవిషీల్డ్‌ టీకానే ఇచ్చారు. కోవిషీల్డ్‌ టీకా మొదటి, రెండు డోసుల మధ్య వ్యవధిని 12 వారాలకు పెంచడంతో కోవిషీల్డ్‌ రెండో డోసు తీసుకోవాల్సిన లబ్ధిదారులకు ఇంకా సమయం ఉంది. కానీ, కోవాగ్జిన్‌ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి మాత్రం 28 రోజులకే రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా కోవాగ్జిన్‌ మొదటి డోసు టీకా తీసుకున్న 1.5 లక్షల మందిలో ఇప్పటివరకు దాదాపు లక్షమందికి రెండో డోసు కూడా ఇచ్చేశారు. మిగిలిన 50వేల మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. గడువులోగా వారికి రెండో డోసు ఇవ్వకపోతే, టీకా ప్రభావం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సరఫరా అవుతున్న కోవాగ్జిన్‌ టీకాలను రెండో డోసు లబ్ధిదారులకే అందిస్తామని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-15T05:19:43+05:30 IST