కరోనా టెస్టు వద్దన్న యువకుడిపై కర్రలతో బంధువుల దాడి! దెబ్బలు తాళలేక..

ABN , First Publish Date - 2020-05-24T14:36:26+05:30 IST

కరోనా టెస్టు వద్దన్న యువకుడిపై అతడి బంధువులు భౌతిక దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు దెబ్బలు తాళలేక మృతి చెందాడు.

కరోనా టెస్టు వద్దన్న యువకుడిపై కర్రలతో బంధువుల దాడి! దెబ్బలు తాళలేక..

బిజ్‌నోర్(ఉత్తరప్రదేశ్): కరోనా టెస్టు వద్దన్న యువకుడిపై అతడి బంధువులు భౌతిక దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు దెబ్బలు తాళలేక మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మం మన్‌జీత్ సింగ్ అనే వలస కార్మికుడు ఢిల్లీలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించడంతో అతడు మే 19న తన స్వస్థలమైన బిజ్‌నోర్‌కు వెళ్లాడు. అక్కడ మన్‌జీత్‌లో జ్వర లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించగా ఫలితం నెగెటివ్ అని వచ్చింది.


అయితే మన్‌జీత్ ఇంటికి చేరుకున్న తరువాత అతడి బంధువులు మనోజ్, కపిల్‌కు మాత్రం అతడు కరోనా బారినపడి ఉంటాడనే సందేహం వెంటాడింది.  దీంతో వారు కరోనా టెస్టు చేయించుకోవాలంటూ అతడి‌పై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు మన్‌జీత్ ఒప్పుకోకపోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మనోజ్, కపిల్.. మన్‌జీత్‌పై కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో మూర్ఛపోయిన అతడి‌ని మీరట్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తలకు తీవ్రగాయమవడంతో మన్‌జీత్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన కపిల్, మనోజ్, వారి తల్లి, మనోజ్ భార్య‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.   

Updated Date - 2020-05-24T14:36:26+05:30 IST