క్వారీ గొయ్యిలపై డ్రోన్‌ సర్వే

ABN , First Publish Date - 2022-05-18T07:12:33+05:30 IST

నగర శివార్లలోని రాందాసుపేట ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల్లో క్వారీయింగ్‌ చేసి, లీజుదారులు వదిలేసిన గోతుల స్థలాలను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన మొదలైంది.

క్వారీ గొయ్యిలపై డ్రోన్‌ సర్వే
క్వారీ లీజుదార్లతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత

ముందుగా రాందాసుపేట క్వారీ గోతుల చుట్టూ రక్షణ గోడ

జిల్లా కలెక్టర్‌ మాధవీలతకు అంగీకారం తెలిపిన లీజుదారులు 

150 ఎకరాల్లో ఏళ్లతరబడి తవ్వేసి లోయల్లా వదిలేసిన వైనం

ప్రమాదకరంతోపాటు నిరుపయోగం.. కొందరు మృత్యువాత

వాటిని ఎలా వినియోగంలోకి తేవాలన్నది సర్వే ద్వారా గుర్తింపు 

రాజమహేంద్రవరం,మే17(ఆంధ్రజ్యోతి): నగర శివార్లలోని రాందాసుపేట ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల్లో క్వారీయింగ్‌ చేసి, లీజుదారులు వదిలేసిన గోతుల స్థలాలను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన మొదలైంది. ఈ నేపఽథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఈ గోతులను పూడ్చి, వినియోగంలోకి తేవడంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు చేపట్టారు. ఇక్కడ సుమారు 150 ఎకరాల భూమి గోతులుగా మారి నిరుపయోగంతో ఉండడంతోపాటు ప్రమాదకరంగా మారింది. ఇక్కడ డ్రోన్‌ సర్వే చేయించి, పరిస్థితిని అంచనా వేయాలని నిర్ణయించారు. ముందుగా రాందాసుపేట క్వారీ గోతుల చుట్టూ రక్షణ గోడ నిర్మించడానికి నిర్ణయించి, లీజుదారులు ఒప్పుకునేలా చేశారు. 1992-2005 మధ్య ఈ ప్రాంతంలో 150 ఎకరాల భూమిలో 50 క్వారీలు లీజుకు తీసుకుని, కంకర తవ్వేసి, పెద్ద లోయల్లా క్వారీ గోతులను వదిలేశారు. ఈ లోయల్లో పడి గతంలో పలువురు మృతి చెందారు. పశువులు కూడా తరచూ మృతి చెందుతూ ఉంటాయి. ఇక్కడ భయానకంగానూ తయారవ్వడంతో ఈ ప్రాంతాల ప్రజలు చాలాకాలం నుంచి ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు స్పందించలేదు. లీజుదారులూ గాలికొదిలేశారు. కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత దృష్టికి ఈ విషయం రావడంతో ఆమె జోక్యం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో క్వారీలు లీజుకు తీసు కుని, తవ్వి వదిలేసిన లీజుదారులను పిలిచి బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వారి నుంచి వివరాలు తీసుకోవడంతోపాటు రాందాసుపేట ప్రజల ఇబ్బందులు కూడా లీజుదార్లకు తెలిపారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కావడంతోపాటు ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుండడంతో ఈ క్వారీ గోతులు ప్రమాదకంగా ఉండడంతోపాటు, అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయనే విషయాన్ని చర్చించారు. ఈ గోతుల భూమిని ఏ విధంగా వినియోగించుకోవాలనే ఆలోచన చేసి, ముందుగా డ్రోన్‌ సర్వే చేయడానికి నిర్ణయించారు. వాస్తవానికి లీజుదారులు ఈ గోతులను పూడ్చి ఇవ్వాలి. కానీ వదిలేశారు. కలెక్టర్‌ మాధవీలత జోక్యంతో ఈ క్వారీ గోతుల వద్ద రక్షణ గోడ నిర్మించాలని కలెక్టర్‌ చేసిన సూచనకు లీజుదారులు అంగీకరించారు.  ఎవరి లీజు స్థలం దగ్గర వారే గోడకట్టేట్టు నిర్ణయించారు. రక్షణ గోడలేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.. ఈనేపథ్యంలో రాందాసుపేట క్వారీ ప్రాంతంలో తక్షణం మార్గదర్శకాల ప్రకారం తక్షణం రక్షణ గోడ నిర్మించాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనికి లీజుదారులు అంగీకరించారు. స్థానికంగా కొంతమంది నుంచి అభ్యంతరాలు ఉన్నాయని లీజుదారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకుని రావడంతో తాను రెవెన్యూ, ఇతర అధికార్లను పంపించి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. డ్రోన్‌ సర్వే చేసిన తర్వాత ఈ భూమి ని ఎలా వినియోగంలోకి తేవాలనే విషయంపై దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె. దినేష్‌కుమార్‌, ఆర్డీవో ఎ.చైత్రవర్షిణి, మైన్స్‌ ఏడీ ఎం.విష్ణువర్డన్‌, క్వారీ లీజుదారుల ప్రతినిధులు చెరుకూరి కృష్ణాజీ, శ్రీహరిరెడ్డి, పార్ధసారఽథి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-18T07:12:33+05:30 IST