సౌకర్యాలకు దూరంగా పట్నం కోర్టులు

ABN , First Publish Date - 2022-01-22T05:48:30+05:30 IST

సౌకర్యాలకు దూరంగా పట్నం కోర్టులు

సౌకర్యాలకు దూరంగా పట్నం కోర్టులు
ఇబ్రహీంపట్నంలోని కోర్టు భవనం

  • ఒకే ప్రాంగణంలో మూన్నాలుగు కోర్టులు 
  • కొన్నింటికీ భవనాలే లేవు!
  • కక్షిదారులకు, సిబ్బందికి వసతుల లేమి 
  • గంటలకొద్దీ చెట్ల కిందే నిరీక్షణ
  • పట్టించుకోని ప్రభుత్వం

ఇబ్రహీంపట్నం: న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాల చిన్న చూపు ఎంతలా ఉందో ఇబ్రహీంపట్నం కోర్టులను చూస్తే తెలుస్తోంది. ఇక్కడ నాలుగు కోర్టులున్నా ఎక్కడా ప్రజలకు కనీస సౌకర్యాల్లేవు. కక్షిదారులకు నీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారు. 1946లో అదాలత్‌ పేరుతో ఇబ్రహీంపట్నం కోర్టును ఏర్పాటు చేశారు. అప్పట్లో మంగల్‌పల్లిలో ఈ కోర్టు ఉండేది. 1948లో ఇబ్రహీంపట్నంకు తరలించారు. 1990వరకు అద్దె భవనాల్లోనే కోర్టు కొనసాగింది. 1990లో భవనం, మేజిస్త్రేట్‌ క్వార్టర్‌ నిర్మించారు. అప్పటి నుంచి మున్సి్‌ఫకోర్టు ఇందులో కొనసాగింది. ప్రస్తుతం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు(రెగ్యులర్‌), సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు(25వ మెట్రోపాలిటన్‌ మెజిస్త్రేట్‌), అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు(26వ మెట్రోపాలిటన్‌ మెజిష్టేట్‌)ల ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. మున్సిఫ్‌ కోర్టుకు తప్ప మిగతా కోర్టులకు భవనాల్లేవు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు రేకుల పైకప్పుతో ఉన్న వ్యవసాయ శాఖ గోదాంలో కొనసాగుతోంది. అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎమ్మెల్యే నిధులు, బార్‌ అసోసియేషన్‌ కంట్రిబ్యూషన్‌తో నిర్మించిన చిన్న హాల్‌లో కొనసాగుతోంది. ఈ కోర్టులకు నిత్యం 500కుపైనే కక్షిదారులు వచ్చిపోతుంటారు. వీరికి కనీస సౌకర్యాలు వేవు. మలమూత్రాలకు కోర్టు బయట ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని ఆశ్రయిస్తున్నారు. పిలిచిన సమయంలో వీరు కోర్టులో లేకుంటే వారెంటు జారీ అవుతుంది. దీంతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూర్చోవడానికి బెంచీలూ లేవు. చెట్ల కింద లేదా ఆరుబయట గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.


  • కనీస సౌకర్యాలు కల్పించాలి : మొద్దు బాల్‌రెడ్డి, పొల్కంపల్లి, ఇబ్రహీంపట్నం మండలం

ఇబ్రహీంపట్నం కోర్టులకు వచ్చే కక్షిదారులు కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలి. నీటి వసతి, మూత్రశాలులేక బయటకు వెళ్తున్నారు. మహిళలైతే మరీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. గంటల తరబడి ఆరుబయట చెట్ల కింద నిల్చుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకొని సమస్యలు తీర్చాలి.


  • న్యాయ వ్యవస్థపై చిన్నచూపొద్దు : అరిగె శ్రీనివా్‌సకుమార్‌, ఇబ్రహీంపట్నం బార్‌ అసోసియేషన్‌ చైర్మన్‌

న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. పట్నంలోని కోర్టులకు నిత్యం వందలాది మంది కక్షిదారులు వస్తున్నారు. వారికి తాగునీటి వసతి, మూత్రశాలలులేక ఇబ్బందులు పడుతున్నారు. కూర్చోవడానికి కూడా సౌకర్యం లేదు. ఇక్కడ నిర్వహిస్తున్న అన్ని కోర్టులకూ నూతన భవనాలను నిర్మించాలి.

Updated Date - 2022-01-22T05:48:30+05:30 IST