ఎల్లమ్మ ఆలయం స్వాధీనంపై కోర్టు స్టే

ABN , First Publish Date - 2022-06-26T06:05:01+05:30 IST

భక్తుల కొంగుబంగారం, నిర్వాహకులకు సిరులు కురిపిస్తున్న భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్‌ స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు స్టే విఽధించింది.

ఎల్లమ్మ ఆలయం స్వాధీనంపై కోర్టు స్టే
భువనగిరి పరిధిలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం దేవాలయం

 జాయింట్‌ స్టెటస్కో కొనసాగుతుందని పేర్కొన్న హైకోర్టు 

 మూడు నెలల్లో ఎండోమెంట్‌కు రూ.20లక్షల ఆదాయం 

భువనగిరి టౌన, జూన 25: భక్తుల కొంగుబంగారం, నిర్వాహకులకు సిరులు కురిపిస్తున్న భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్‌ స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు స్టే విఽధించింది. 2016 నుంచి కొనసాగుతున్న స్టెటస్కో యఽథాతథంగా కొనసాగుతుందని ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. దీంతో మరోమారు ఆలయ నిర్వహణ పూజారి కుటుంబం ఆధీనంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోది. కాగా సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఆలయానికి గత 10 సంవత్సరాలుగా భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ  ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంధి భక్తులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజలు చేసి, కానుకలు సమర్పిస్తుంటారు. కానీ భారీ దాయం సమకూరుతున్నప్పటికీ ఆలయంలో కనీస వసతులు కొరవడండంతో భక్తుల డిమాండ్‌ మేరకు ఎండోమెంట్‌ శాఖ అప్పటి ఆలయ పూజారి తోటకూరి బాలకృష్ణ నుంచి 2004న ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే పూజారి హైకోర్టును ఆశ్రయించడంతో 12 మే 2016లో జాయింట్‌ స్టెటస్కోవిధిస్తూ దేవాదాయ శాఖ, పూజారి కుటుంబానికి పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం పూజారి బాలకృష్ణ మృతి చెందాడు. దీంతో జాయింట్‌ స్టెటస్కో పార్టీలో ఒకరు మృతి చెందినందున ఎండోమెంట్‌ నిబంధనల ప్రకారం ఆలయం రెండో పార్టీకి ఆధీనమవుతుందని పేర్కొంటూ ఎండోమెంట్‌ శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఏప్రిల్‌ 9న సంబంధిత శాఖ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎండోమెంట్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ దివంగత ఆలయ పూజారి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎండోమెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులను సస్పెండ్‌  చేస్తూ తుది తీర్పు వెలువడే వరకు జాయింట్‌ స్టెటస్కో కొనసాగుతుందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను శనివారం ఏసీపీ వెంకట్‌రెడ్డి, భువనగిరి రూరల్‌ సీఐ వేణుగోపాల్‌కి పూజారి కుమారుడైన మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటే్‌షతో పాటు కుటుంబ సభ్యులకు అందజేసి, ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఆలయ ఈవో నరేందర్‌రెడ్డిని సంప్రదించగా స్టే కాపీ అందలేదని, తదుపరి చర్యలపై ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. 

పూజా సామగ్రి విక్రయ టెండర్ల ఆదాయం రూ.1.75కోట్లు

ఏప్రిల్‌ 9న ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం ఎండో మెంట్‌కు ఆలయం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. మూడు నెలల్లో హుండీ ద్వారా సుమారు రూ.15లక్షలు, కానుకలు, రశీదు చెల్లింపుల ద్వారా మరో 5లక్షలు ఆదాయం సమకూరింది. అలాగే పూజా సామాగ్రి, ప్రసాదం, బొమ్మల విక్రయం తదితర హక్కులకు ఏడాది కాలానికి గాను మే 19న నిర్వహించిన బహిరంగ వేలంపాట ద్వారా రూ.కోటి.75లక్షల ఆదాయం సమకూరింది. అయితే ఎండోమెంట్‌ స్వాధీనం చేసుకోముందు ప్రతి మూడు నెలలకు జరిపిన హుండీ లెక్కింపు ద్వారా కేవలం రూ.3లక్షల ఆదాయం మాత్రమే సమకూరేది. ఆలయం పేరిట బ్యాంకులో సుమారు రూ.కోటి డిపాజిట్‌గా ఉంది. ఎండో మెంట్‌ స్వాధీనం చేసుకున్నాక అమ్మవారి దర్శనం, మొక్కుల చెల్లింపు, సులభతరం కావడం, కనీస వసతులు సమకూరడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఆలయాన్ని ఎండోమెంట్‌ స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు స్టే విధించడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆలయం వద్ద ఉద్రిక్తత 

హైకోర్టు విధించిన స్టే ఆర్డర్‌ తమకు అనుకూలంగా ఉన్నందున వెంట నే ఆలయాన్ని తమకు అప్పగించాలంటూ పూజారి కుటుంబ సభ్యులు ఆలయం ఎదుట నిరసనగా దిగారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చినందునే ఉద్దేశపూర్వకంగా ఎండోమెంట్‌ అధికారులు ఆలయానికి రాలేదన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ అధికారులు వచ్చేవరకు ఆగాలని సూచించారు. ఈ క్రమంలో ఆలయ పూజారులు  గర్భగుడికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో ఆదివారం భక్తుల సందర్శన, అమ్మవారి పూజా కైంకర్యాలపై  సందేహాలు నెలకొన్నాయి. ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-06-26T06:05:01+05:30 IST