కర్ణాటక : మసీదు వెనుక బయటపడ్డ నిర్మాణంలోకి ప్రవేశంపై కోర్టు స్టే

ABN , First Publish Date - 2022-04-23T18:58:41+05:30 IST

కర్ణాటకలోని మలాలీ శివారు ప్రాంతంలోని ఓ మసీదు

కర్ణాటక : మసీదు వెనుక బయటపడ్డ నిర్మాణంలోకి ప్రవేశంపై కోర్టు స్టే

మంగళూరు : కర్ణాటకలోని మలాలీ శివారు ప్రాంతంలోని ఓ మసీదు వెనుక కనిపించిన హిందూ దేవాలయం వంటి నిర్మాణంలోకి ఎవరూ ప్రవేశించరాదని కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఈ నిర్మాణాన్ని తొలగించరాదని, నష్టపరచరాదని చెప్పింది. ఇప్పటికే దక్షిణ కన్నడ జిల్లా అధికారులు ఈ మసీదు ఆధునికీకరణ పనులను నిలిపేయాలని ఆదేశించారు. 


మసీదు వెనుక కనిపించిన నిర్మాణాన్ని పరిరక్షించాలని కోరుతూ గంజిమఠ్ గ్రామవాసి ధనంజయ్ మంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ జరిగే వరకు ఈ నిర్మాణాన్ని తొలగించరాదని, దానికి నష్టం కలిగించరాదని ఆదేశించింది. ఈ నిర్మాణంలోకి మసీదు కమిటీ సభ్యులు కానీ, భక్తులు కానీ వెళ్ళడానికి వీల్లేదని తెలిపింది. 


మలాలీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు మంగళూరు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలావుండగా, కోర్టు ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ డివిజినల్ కార్యదర్శి శరణ్ స్వాగతించారు. 


Updated Date - 2022-04-23T18:58:41+05:30 IST