మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టు విచారణలు

ABN , First Publish Date - 2020-09-24T06:47:56+05:30 IST

కరోనా కారణంగా కోర్టులలో కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న నేపధ్యంలో న్యాయవాదుల సౌకర్యం కోసం రాష్ట్ర

మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టు విచారణలు

ఖమ్మంలో ప్రత్యేక వాహనం ఏర్పాటు


ఖమ్మంలీగల్‌, సెప్టెంబరు 23: కరోనా కారణంగా కోర్టులలో కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న నేపధ్యంలో న్యాయవాదుల సౌకర్యం కోసం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని బుధవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ శావిలి హైదరాబాదునుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వివిధ కారణాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక తమ వాదనలు వినిపించేందుకు కోర్టులో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు రాలేని న్యాయవాదుల కోసం మొబైల్‌ వీడియోకాన్ఫరెన్స్‌ వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


న్యాయవాదులు ఈ వాహనాన్ని వినియోగించుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా జడ్జ్‌ ఎం.లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఈ మొబైల్‌ వాహనం ప్రతిరోజు (కోర్టు పనిదినాలలో)ఉదయం 10-30గంటలనుంచి 11-30గంటల వరకు ముస్తాఫానగర్‌లోని సెయింట్‌మేరీస్‌ పాఠశాల ఆవరణం, 11-45నుంచి 12-45వరకు గాంధీచౌక్‌లోని చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌, 1నుంచి 2గంటల వరకు పెవిలియన్‌గ్రౌండ్‌ వద్ద న్యాయవాదులకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.తాజుద్దీన్‌బాబా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, న్యాయమూర్తులు వి.బాలభాస్కర్‌రావు, తిరుపతి, పి.చంద్రశేఖర్‌ప్రసాద్‌, కె.అరుణకుమారి, వినోద్‌కుమార్‌, అప్రోజ్‌ అక్తర్‌, ఎం. ఉషశ్రీ, రుబీనా ఫాతిమా పాల్గొన్నారు. జిల్లా కోర్టు పరిపాలనాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాంకేతిక అధికారులు నరేష్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.  

Updated Date - 2020-09-24T06:47:56+05:30 IST