‘అధికార’ దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-06-03T10:49:26+05:30 IST

అధికార పార్టీ నేతల భూదాష్టీకం పరాకాష్టకు చేరింది. నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ భూములపై కన్నేసిన నేతలు ఒకడుగు ..

‘అధికార’ దౌర్జన్యం

కోర్టు వివాదంలో ఉన్న భూమి కబ్జాకు యత్నం

వాట్సప్‌లో ఎస్పీకి పిర్యాదుచేసిన బాధితుడు


మార్కాపురం, జూన్‌ 2: అధికార పార్టీ నేతల భూదాష్టీకం పరాకాష్టకు చేరింది. నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ భూములపై కన్నేసిన నేతలు ఒకడుగు ముందుకేశారు. ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్న భూములను కూడా వదలటం లేదు. ఇటువంటి దురాగతాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం వారి ఒత్తిళ్లకు లొంగి ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న భూమిలో ఒక ఫిర్యాదుదారుడు భూమికి కంచె వేసుకొని ఉన్నాడు.


ఆ భూమిని తమకు అమ్మాలని అధికారపార్టీకి చెందిన నాయకుడు ఒకరు అతనిపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాడు. అతను ససేమిరా అన్నాడు. దీంతో దానిని ఆక్రమించడానికి రంగం సిద్ధం చేశారు. నిన్నమొన్నటి వరకూ లాక్‌డౌన్‌తో మిన్నకున్న సదరు నాయకుడు తన మందీమార్బలంతో రంగంలో దిగాడు. బాధితుడు పొలానికి రక్షణగా వేసుకున్న కంచెను మంగళవారం బలవంతంగా తొలగించారు. అందుకు స్థానికంగా ఉన్న ఇరువురు వైసీపీ నాయకులు (బాధితుని కుటుంబంతో ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో) పూర్తిస్థాయిలో అండగా ఉన్నారు.


విషయమేమిటంటే..

మార్కాపురం మండలం ఇడుపూరు పంచాయతీ దరిమడుగు ఇలాకాలో సర్వే నెంబర్‌ 846, 847లలో 3.5ఎకరాల భూమి ఉంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఈ భూమిని 1917లో ముదిరెడ్డి ఓబులరెడ్డి కొనుగోలు చేశారు. ఓబులరెడ్డి తదనంతరం ఆయన కుమారులైన గుండారెడ్డి, నారాయణరెడ్డిలకు ఆస్తి సంక్రమించింది. నారాయణరెడ్డికి కుమారులు లేకపోవడంతో గుండారెడ్డికి గల ఐదుగురు కుమారులకు తదనంతర కాలంలో ఆస్తి సంక్రమించింది. వారి మధ్య భాగ పంపకాలు కూడా జరిగాయి. అయితే ఓబులరెడ్డి ఆస్తిలో తమకు భాగం ఉందని ఆయన అన్న మనవళ్లు కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. రియల్టర్ల అక్రమాలను ముందుగా గుర్తెరిగిన ముదిరెడ్డి భాస్కరరెడ్డి 2018లో హైకోర్టు నుంచి ఇంజెక్షన్‌ ఉత్తర్వులు తీసుకొచ్చారు. అంతేకాక ఈ ఏడాది జనవరిలోనే తొలిసారి ఆక్రమించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే మార్కాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


అధికారపార్టీ నాయకుని అండతో...

ఆ భూమిపై కన్నేసిన వైసీపీ కీలక నేత మంగళవారం 30మందితో సదరు భూమికి రక్షణగా ఉన్న కంచెను తొలగించాడు. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లో ఉండటంతో వారి ఆక్రమణ పర్వాన్ని అడ్డుకునే నాఽథుడే కరువయ్యారు. స్థానిక పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. 


వాట్సప్‌ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు

దరిమడుగు వద్ద జరిగిన ఆక్రమణను బంధువు ద్వారా ఫొటోలో రూపంలో తెలుసుకున్న భాస్కర్‌రెడ్డి ఫోన్‌లో మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ స్పందన రాకపోవడంతో వాట్సప్‌ ద్వారా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు పిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ తన అంతర్గత సమాచార సిబ్బంది ద్వారా అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటున్నట్లు సమాచారం.


పార్టీ అధిష్టానానికీ పిర్యాదు

తన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన రియల్టర్లకు వైసీపీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుడు ఒకరు, మండల స్థాయి నాయకులు అండగా ఉండటంతో వారిపై బాధితుడు ఆపార్టీ అధిష్టానానికి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి విషయం వివరించినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-06-03T10:49:26+05:30 IST