మిమ్మల్ని వెతకడానికే బోలెడు ఖర్చయింది.. సగం డబ్బు కట్టు.. ఓ మహిళతో ఎస్కేప్ అయిన వ్యక్తికి హైకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-04-21T08:43:44+05:30 IST

ఇంట్లో భార్య ఉన్నా మరో యువతిని ప్రేమించాడు ఆ యువకుడు. ఆ యువతిని తీసుకొని ఇంటినుంచి పారిపోయాడు. ఆ యువతి ఏమైందో తెలియక.. ఆమె తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో కోర్టును...

మిమ్మల్ని వెతకడానికే బోలెడు ఖర్చయింది.. సగం డబ్బు కట్టు.. ఓ మహిళతో ఎస్కేప్ అయిన వ్యక్తికి హైకోర్టు ఆదేశాలు

ఇంట్లో భార్య ఉన్నా మరో యువతిని ప్రేమించాడు ఆ యువకుడు. ఆ యువతిని తీసుకొని ఇంటినుంచి పారిపోయాడు. ఆ యువతి ఏమైందో తెలియక.. ఆమె తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువతి ఆచూకీ తెలుసుకోవడానికి ఏడు నెలలు దాకా శ్రమించారు. పైగా చాలా డబ్బు కూడా ఖర్చుపెట్టారు. చివరికి ఎలాగోలా ఆ ప్రేమికులిద్దరినీ వెతికి పట్టుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఖర్చు పెట్టిన సొమ్ములో సగం కట్టాలని కోర్టు ఆ యువకుడిని ఆదేశించింది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.


గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లోని నివసించే రాఘాభాయ్ పర్మార్ అనే యువకుడికి ఇంతకుముందే వివాహం జరిగింది. కానీ ఇంట్లో భార్య ఉన్న అతను మరో యువతి(20)ని ప్రేమించాడు. ఆ యువతి ఒకరోజు రాఘాభాయ్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియక. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆ యువతి తండ్రి గుజరాత్ హైకోర్టు తలుపులు తట్టాడు. ఈ కేసు విచారణ మొదలుపెట్టిన హైకోర్టు.. మిస్సింగ్ యువతి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని  పోలీసులకు ఆదేశించింది.


కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులకు మిస్సింగ్ యువతిని పట్టుకోవడానికి ఏడు నెలలు సమయం పట్టింది. పైగా రూ.1,10,000 ఖర్చు కూడా అయింది. పోలీసులు పర్మార్, ఆ యువతిని కోర్టు ముందు ఇటీవల హాజరుపరిచారు. కేసును పూర్తిగా విచారణ చేసిన హై కోర్టు పర్మార్ ఇంతకుముందే వివాహితుడని తెలిసి అతడికి శిక్ష విధించింది. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఖర్చు పెట్టిన మొత్తంలో సగం అంటే రూ.55,000 చెల్లించాలని తీర్పనిచ్చింది. 


కేసు విచారణలో ఉండగా.. యువతి తండ్రి తను కూడా దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపాడు. అది కూడా ఇప్పించాలని కోరాడు. కానీ కోర్టు అందుకు వేరేగా కింది కోర్టులో కేసు వేయమని సూచించింది.


Updated Date - 2022-04-21T08:43:44+05:30 IST