ధైర్యంతోనే పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

‘‘ఎవరైనా మీకు సమాచారం ఇస్తే తప్పో, ఒప్పో తెలుసుకోవాలి. నిజమైనదయితే ఇతరులకు చేరవేయాలి.

ధైర్యంతోనే పరిష్కారం

‘‘ఎవరైనా మీకు సమాచారం ఇస్తే తప్పో, ఒప్పో తెలుసుకోవాలి. నిజమైనదయితే ఇతరులకు చేరవేయాలి. నిజం కానట్టయితే... దాన్ని ఆపే ప్రయత్నం గట్టిగా చెయ్యాలి’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ చెప్పారు. ‘‘అబద్ధం మహాపాపం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకూడదు. ప్రాణం పోయినా స్థిరంగా ఉండాలి. ఆపదలు (కష్టాలు) వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలను చూసి, పారిపోయి, ఇంట్లో కూర్చుంటే పరిష్కార మార్గం దొరకదు’’ అని ఒక సందర్భంలో ఆయన స్పష్టం చేశారు.


పూర్వం ఒక పట్టణానికి సమీపంలో చిన్న గ్రామం ఉండేది. దానికి నలువైపులా కొండలు, పిల్ల కాలువలు, జలపాతాలు, మృగాలు, రకరకాల పండ్ల చెట్లతో అడవి వ్యాపించి ఉండేది. ఆ అడవి నుంచి హఠాత్తుగా భయంకరమైన, విచిత్రమైన శబ్దాలు రావడం మొదలైంది. గ్రామస్తులు భయాందోళనలు చెందారు. రాత్రయ్యేసరికి ఆ శబ్దాలు మరింత ఎక్కువయ్యేవి. వారికి నిద్ర కరువైంది. పురుషులు కర్రలు తీసుకొని గ్రామ కూడళ్ళ దగ్గర కాపలా కాసేవారు. మహిళలు, చిన్న పిల్లలు ఇళ్ళ తలుపులు గడియ వేసుకొని, రాత్రంతా వణుకుతూ గడిపేవారు. గ్రామానికి ఏదో చెడు జరగబోతోందని ఒకరికి ఒకరు చెప్పుకోసాగారు. 


ఒక రోజు చాలా దూరం నుంచి ఒక బాటసారి ఆ గ్రామానికి చేరుకున్నాడు. గ్రామస్తుల పరిస్థితిని గమనించి, వారిని మరింత భయపెట్టడం కోసం ‘‘మీరందరూ ఎందుకు భయపడుతున్నారో నాకు తెలిసింది. నేను వచ్చేటప్పుడు అడవిలో నివసిస్తున్న క్రూరమైన రాక్షసుణ్ణి చూశాను. అతడు ఒక గుహ లోపల కూర్చొని... భయంకరంగా అరుస్తున్నాడు, శబ్దాలు చేస్తున్నాడు’’ అని చెప్పాడు. 


అతను చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి... గ్రామ ప్రజలు మరింత ఆందోళన చెందారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరకు ‘మనందరం కలిసి రాజు దగ్గరకు వెళ్దాం’ అని నిర్ణయించుకున్నారు. మర్నాడు అందరూ రాజును కలిసి విషయం చెప్పారు. రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైన రక్షించండని మొరపెట్టుకున్నారు.

‘‘మీరు అడవిలోకి వెళ్ళలేదు. రాక్షసుణ్ణి చూడలేదు. ఆ అరుపులూ, శబ్దాలూ రాక్షసుడివేనని ఎలా భావిస్తారు?’’ అని రాజు ప్రశ్నించాడు.

‘‘ఒక బాటసారి మా గ్రామానికి వచ్చి, ఈ విషయం చెప్పి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇంకా భయం పెరిగింది’’ అన్నారు గ్రామస్తులు.


ఆ భయంకరమైన రాక్షసుడి నుంచి విముక్తి కలిగించే వారికి డబ్బు, బంగారం, వెండి రూపంలో గొప్ప బహుమానం ఇస్తామని దర్బారులో రాజు ప్రకటించాడు. 

ఈ విషయం పట్టణంలో ఉండే ఒక బాలుడి చెవిలో పడింది. ఎలాగైనా రాక్షసుడి నుంచి గ్రామ ప్రజలను రక్షించాలనుకున్నాడు. రాజు దగ్గరకు వెళ్ళి అనుమతి అడిగాడు. ‘‘ఈ కుర్రాడా రాక్షసుణ్ణి ఎదుర్కొనేది?’’ అని రాజు, గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. అయితే రాజు అతనికి అనుమతి ఇచ్చాడు. బాలుడు ధైర్యంగా అడవిలోకి వెళ్ళి తిరగడం ప్రారంభించాడు. తిరిగి తిరిగి బాగా అలిసిపోయి, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చీకటి పడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలోనే దూరం నుంచి అరుపులు (శబ్దాలు) రావడం విన్నాడు. వెంటనే లేచి, పెద్ద కర్ర తీసుకొని, అటువైపు నడిచాడు. అరుపులు వస్తున్న ప్రాంతానికి చేరుకున్నాడు. 


ఒక పెద్ద ఏనుగు గుంతలో పడి ఉంది. దాని కాళ్ళలో పెద్ద ముళ్ళు గుచ్చుకున్నాయి. దెబ్బలు బాగా తగిలాయి. ఒక కాలు విరిగింది. తొండానికి బలమైన గాయం తగిలింది. కదలలేక, గాయాల నొప్పి భరించలేక అది అరుస్తోంది. చీకటి పడగానే భయంతో ఆ అరుపులు మరింత పెద్దవవుతున్నాయి. 


ఇది గమనించిన ఆ బాలుడు వెంటనే గ్రామంలోకి వెళ్ళాడు. విషయం వివరించి, తనతోపాటు అడవికి రావాలని గ్రామస్తులను ప్రాధేయపడ్డాడు. రాత్రయింది. 

‘అడవిలోకి వెళ్తే రాక్షసుడు చంపేస్తాడు. ఈ కుర్రాడికి ఏం తెలీదు’ అని వాళ్ళు వెనుకాడారు. వారిని బతిమాలి విసిగిపోయిన ఆ బాలుడు నేరుగా రాజు దగ్గరకు వెళ్ళాడు. విషయం వివరించాడు. ఒక వైద్యుణ్ణి, బలమైన యాభై మంది సైనికుల్ని పంపాల్సిందిగా కోరాడు. 

సైనికులు ఆ ఏనుగును గుంతలోంచి బయటకు తీశారు. వైద్యుడు దాని కాళ్ళలో ముళ్ళు తొలగించాడు. విరిగిన కాలును సరిచేశాడు. గాయాల మీద మందు పూశాడు. సైనికులు ఆ ఏనుగును శుభ్రంగా కడిగి, ఆహారం తినిపించి, నీళ్ళు తాగించి... వెనుతిరిగారు. వారికి కన్నీటితో ఏనుగు వీడ్కోలు పలికింది. 


మరుసటి రోజు ఆ బాలుణ్ణి, గ్రామస్తులనూ రాజు తన దర్బారుకు పిలిపించాడు. ‘‘మీరు చేయలేని సాహసం ఈ చిన్న బాలుడు చేసి చూపించాడు. రాక్షసుడూ లేడు, అరుపులూ లేవు. ఏనుగు గుంతలో పడి, బాధతో పెట్టిన అరుపులు మాత్రమే. వాటికే మీరు అంత భయపడ్డారు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు... నిజం ఏమిటో తెలుసుకోకుండా ఆందోళన చెందితే అనర్థాలు తప్పవు’’ అన్నాడు. ఆ బాలుడికి మంచి కానుకలు ఇచ్చి పంపాడు. 

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST