దమ్ము, ధైర్యం మా సొత్తు

ABN , First Publish Date - 2021-07-28T06:27:46+05:30 IST

దమ్ము, ధైర్యం తమ సొత్తని, చివరి వరకు ప్రజలకోసం ఉంటామని, ఉద్యమం కోసం నాడు శ్రీకాంతాచారి, నేడు ఉద్యోగం కోసం పాక శ్రీకాంత్‌ ప్రాణాలు వదిలారని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

దమ్ము, ధైర్యం మా సొత్తు
శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల

నాడు శ్రీకాంతాచారి, నేడు శ్రీకాంత్‌ ఉద్యోగాల కోసం ప్రాణాలు వదిలారు

ఉచిత విద్యుత్‌ మొదలుపెట్టింది వైఎ్‌సఆరే

పుల్లెంలలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్‌ షర్మిల


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : దమ్ము, ధైర్యం తమ సొత్తని, చివరి వరకు ప్రజలకోసం ఉంటామని, ఉద్యమం కోసం నాడు శ్రీకాంతాచారి, నేడు ఉద్యోగం కోసం పాక శ్రీకాంత్‌ ప్రాణాలు వదిలారని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో షర్మిల నిరుద్యోగ దీక్ష మంగళవారం నిర్వహించారు. తొలుత పాక శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం సాయంత్రం వరకు దీక్ష కొనసాగించి విరమించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. దమ్ము, ధైర్యం తమ సొత్తు అని, చివరి రక్తపు బొట్టు కూడా ప్రజల కోసమే అని షర్మిల అన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం ప్రారంభించింది వైఎస్‌ఆరే అని, పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన ఘనత ఆయనదే అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో సంక్షోభం ఏర్పడిందని ఇప్పుడు ప్రతీ కుటుంబం అప్పుల పాలైందని, రాష్ట్రం రూ.4లక్షలకోట్ల అప్పుల్లో ఉందన్నారు. చిన్నదొర, పెద్దదొరకు మహిళల పట్ల గౌరవం లేదని, తాను సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి 1.91లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరితే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను పార్టీ ప్రారంభించకముందే నిరుద్యోగుల కోసం మూడు రోజులు దీక్ష చేయాలని ప్రయత్నిస్తే ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, పోలీసులతో దాడి చేయించారన్నారు. ప్రతీ మంగళవారం తాను నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తుంటే వ్రతాలు చేస్తున్నానంటూ చిన్నదొర కేటీఆర్‌ హేళన చేశారన్నారు. కేటీఆర్‌ మొనగాడివైతే 54లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సవాల్‌ విసిరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, అమ్మానాన్నకు భారం కాకూడదని ఓ యువతి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని, ఇది ప్రభుత్వ హత్యే అన్నారు. పుల్లెంలకు చెందిన శ్రీకాంత్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం రోజు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది చూసైనా సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదన్నారు. శ్రీకాంతాచారి ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే పాక శ్రీకాంత్‌ ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఉద్యమాల కోసం, ఉద్యోగాల కోసం మన బిడ్డలు చనిపోతుంటే తెచ్చుకున్న తెలంగాణ ఇక ఎవరి కోసమని ప్రశ్నించారు. ఏ ఒక్క ఇంటికైనా ఉద్యోగం వచ్చిందా, రూ.3016 ఏ నిరుద్యోగికి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రం 4లక్షలకోట్ల అప్పుల్లో కూరుకపోయిందన్నారు. ఇంత అప్పు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు వివరించాలన్నారు. వైఎ్‌సఆర్‌ మూడుసార్లు నోటిఫికేషన్‌ వేసి లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎ్‌సఆర్‌ది అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు 11లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించారన్నారు. వాళ్లేమో పండుగలు, పుట్టినరోజులు చేసుకోవాలి.. నిరుద్యోగులేమో ఆత్మహత్యలు చేసుకోవాలి.. దినాలు చేసుకోవాలా అని ఆవేదనతో ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కారణంగానే ఉద్యోగాల భర్తీ, దళితబంధు పథకం అంటు ముందుకు వస్తున్నారన్నారు. దీక్షలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న, రాజగోపాల్‌, అజీజ్‌, కోర గోవర్థన్‌, శ్రీరామాచారి, తాడెం అనీల్‌కుమార్‌ పాల్గొన్నారు. దీక్షకు డీసీసీ ఉపాధ్యక్షుడు గండు వెంకట్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న సంఘీభావం తెలిపారు. చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు.


షర్మిల దీక్షకు రాజగోపాల్‌రెడ్డి సంఘీభావం

షర్మిలకు ఫోన్‌చేసి హృదయపూర్వక సంఘీభావం తెలుపుతున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ అంటే ప్రాణమని, తాము బతికున్నంత కాలం గుండెల్లో ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని వైఎస్‌ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ పట్టుబట్టి సాధించామన్నారు. 90శాతం పనులు పూర్తి చేయించగా, మిగిలిన 10శాతం పనులు పూర్తి చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని ఏడేళ్లుగా ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఢిల్లీలో పని ఉండటంతో ఫోన్‌లో సంఘీభావం తెలుపుతున్నానని, లేదంటే నేరుగా దీక్షా శిబిరానికి వచ్చేవాడినని అన్నారు. జగదీ్‌షరెడ్డి అనే ఓ డమ్మీ మంత్రి ఉన్నాడని, రిబ్బన్‌ కట్‌ చేసి కొబ్బరికాయ కొట్టేందుకే ఆయన పరిమితమని, రూపాయి నిధులు తేలేడని ఆరోపించారు. చౌటుప్పల్‌లో జరిగిన సభలో నిరసన తెలిపి మైక్‌ లాక్కొని మంత్రిని వెళ్లగొట్టామని అన్నారు. బుధవారం 10వేల మందితో మునుగోడులో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళిత బంధు హుజూరాబాద్‌కే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ దీక్ష చేపడుతున్నట్లు షర్మిలకు వివరించారు. కాగా, సంఘీభావం తెలిపినందుకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-07-28T06:27:46+05:30 IST