కిట్టి పార్టీలే కొంప ముంచాయా?

ABN , First Publish Date - 2021-11-28T01:10:11+05:30 IST

రియల్ ఎస్టేట్ వ్యాపారం, అధిక వడ్డీలు , వెంచర్లు పేరుతో ఈ మధ్యకాలంలో సంపన్న కుటుంబాలను టార్గెట్‌గా ...

కిట్టి పార్టీలే కొంప ముంచాయా?

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారం, అధిక వడ్డీలు , వెంచర్లు పేరుతో ఈ మధ్యకాలంలో సంపన్న కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని కోట్ల రూపాయలు నిండా ముంచేస్తున్నారు. కిట్టి పార్టీల్లో పరిచయం అయినా ఆడవాళ్లను టార్గెట్‌గా చేసుకొని అధిక వడ్డీలు పేరుతో డబ్బులు పెట్టుబడులు పెట్టించి నిండా ముంచేస్తున్నారు. ఇక ఫ్లాట్‌లు అమ్మకాలు, భూమి కొనుగోళ్లలో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఈ కేసులన్నీ కూడా సైబరాబాద్ కమిషరేట్‌లోనే వెలుగుచూస్తుండడంతో పోలీసులు కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకొని విచారణ చేస్తున్నారు. 


సైబరాబాద్ కమిషనరేట్‌లోని నార్సింగ్ పీఎస్ పరిధిలో ఓ కిలాడి లేడీ కోట్లు రూపాయలు ముంచేసింది. అధిక వడ్డీల పేరుతో హై ప్రొఫైల్‌ జనాలకు మస్కా కొట్టింది ఓ కిలాడీ లేడీ. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. పదుల సంఖ్యలోనే జనాలకు కుచ్చుటోపి పెట్టినట్లు పోలీసులు విచారణ‌లో తేలింది. హైదరాబాద్‌కి చెందిన శిల్పాచౌదరి, శ్రీనివాస్‌ దంపతులు ఇద్దరు సినీ ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  హై ప్రొఫైల్‌ మెయింటైన్ చేస్తూ , బడాబాబుల బిడ్డలు, కోడళ్లు టార్గెట్‌గా కిట్టీ పార్టీలు నిర్వహించేది. పార్టీలో తన బిజినెస్‌ ప్రపొజల్స్‌ పెట్టి ఆకర్షించేంది. పదేళ్ల నుంచి కిట్టి పార్టీ నడుపుతూ పెట్టుబడులు పేరుతో కోట్లు రుపాయాలు వసూలు చేసింది. 


పుప్పాల‌గూడ‌కి చెందిన దివ్య రెడ్డి అనే మహిళ కిట్టి పార్టీ‌లో పరిచయం అయ్యింది .. దివ్య రెడ్డి‌కి శిల్ప చౌదరికి పదేళ్లుగా పరిచయం ఉంది. అయితే శిల్పా మాయ మాటలు చెప్పి అధిక వడ్డీ‌లు పేరుతో  కోటి ఐదు లక్షలు తీసుకొని దివ్య రెడ్డి ని మోసం చేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు దివ్య రెడ్డి‌కి నాలుగు చెక్‌లు కూడా ఇచ్చింది. ఆ నాలుగు చెక్‌లు కూడా బౌన్స్ అయినట్లు తేలింది. ఇక డబ్బులు ఆడిగేందుకు వెళ్లిన దివ్య రెడ్డి‌ని తన బౌన్సర్ల‌తో బెదరింపులకు పాల్పడింది.. ఇలా పదుల సంఖ్య‌లో కిట్టి పార్టీ‌లో పరిచయం అయిన వారి దగ్గర నుండి ఫైనాన్స్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసింది. ఈ కిలాడి లేడి సినీ ఇండస్టీకి చెందిన వారితో కూడా పరిచయాలు ఉండడంతో ఓ సినిమా నిర్మాణం చేసింది. శిల్ప దంపతులు ఇద్దరు కూడా నిర్మాణంలో సహేరి అనే సినిమా తీశారు. అయితే రిలీజ్‌కు ముందే ఆ మూవీ వివాదంలో ఉండడంతో టెక్నీకల్‌గా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. దీంతో ఇప్పటికే ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


దివ్య రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో శిల్పా దంపతులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఐపీసీ 406 ,420, 341, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈకేసులో ఇంకా భాదితులు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది సినీ ప్రముఖులు బయటకి వచ్చి ఫిర్యాదు చేయలేక పోతున్నారని సమాచారం ఉంది. దీంతో పోలీసులు అయితే మాత్రం ఈ కిలాడీ లేడి చేతిలో మోసపోయిన బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఈ కేసులో శిల్ప దంపతులు ఇద్దరినీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. 


ఇక భూములు అమ్మకాలు, ప్లాట్స్ పేరుతో కోట్లు రూపాయలు కొల్లగొట్టిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కేసుపై కూడా సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్‌లో మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకి వచ్చాడు. అయితే శ్రీధర్ రావుపై మరి కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో నాలుగు రోజులు క్రితం విచారణకు హాజరు కావాలని సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసుల విచారణకు హాజరుకాకుండా నిర్లక్ష్యం చేశాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 


పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌ సహా ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్స్‌ని శ్రీధర్ రావు మోసం చేసినట్లు భాదితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. నార్సింగి, రాయదుర్గం పీఎస్‌లో ఉన్న కేసులకు సంబంధించి శ్రీధర్ రావు విచారణకు హాజరుకావడం లేదు. దీంతో శ్రీధర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇక సనత్ నగర్ పీఎస్‌లో శ్రీధర్ రావు‌పై లైంగిక దాడి  కేసు నమోదు అయ్యింది .. తనపై  అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. దీనిపైనా సనత్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయాలు కొట్టేశాడని శ్రీధర్‌ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదులపై కూడా విచారణ చేస్తున్నారు. రాయదుర్గంలో కమర్షియల్ కాంప్లెక్స్‌ వ్యవహారంలో నవంబర్ 18న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో బెంగళూరులో శ్రీధర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌‌కు తీసుకువచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు.  రిమాండ్ ముగియడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు శ్రీధర్‌రావు.  అప్పటినుంచి పోలీసులకు కనిపించుకుండా ఎస్కేప్ అయ్యాడు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూర్‌లో తల దాచుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో నాలుగు రోజులుగా గాలిస్తున్నారు పోలీసులు. 


ఇటు కిలాడీ లేడి శిల్పా , అటు కోట్లు రూపాయలు ముంచేసిన శ్రీధర్ రావు కేసులను పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకొని విచారణ చేస్తున్నారు.  ఈ ఇద్దరి చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2021-11-28T01:10:11+05:30 IST