ముంబై: మూడ్రోజుల క్రితం పుట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల పాపను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు తమ పాపను చూపించేందుకు విరుష్క జంట ఇష్టపడడం లేదు. తమ పాప ప్రైవసీని కాపాడాలని.. సరైన సమయంలో తామే పాప ఫొటోను షేర్ చేస్తామని ఫొటోగ్రాపర్లకు రాసిన లేఖలో కోహ్లీ, అనుష్క విజ్ఞప్తి చేశారు.‘తల్లిదండ్రులుగా మేం కోరుతున్నది ఒకటే. పాప ప్రైవసీని కాపాడాలని అనుకుంటున్నాం. ఇందుకు మీ మద్దతు, సాయం కావాలి. సరైన సమయంలో మేమే పాప ఫొటోను షేర్ చేస్తాం. అప్పటిదాకా దయచేసి.. పాప ఫొటోలను క్లిక్ చేయొద్దు’ అని ఆ లేఖలో తెలిపారు.