మైలాపూరు దంపతుల హత్యకేసు..

ABN , First Publish Date - 2022-05-10T18:18:27+05:30 IST

నగరంలో తీవ్రసంచలనం కలిగించిన మైలాపూర్‌ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్‌ లాల్‌ కిషన్‌ అలియాస్‌ కృష్ణ తండ్రి

మైలాపూరు దంపతుల హత్యకేసు..

నేపాల్‌కు ప్రత్యేక పోలీసు బృందం

చెన్నై: నగరంలో తీవ్రసంచలనం కలిగించిన మైలాపూర్‌ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్‌ లాల్‌ కిషన్‌ అలియాస్‌ కృష్ణ తండ్రి లాల్‌ శర్మను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం నేపాల్‌కు బయలుదేరి వెళ్లింది. పారిశ్రామికవేత్త శ్రీకాంత్‌, ఆయన సతీమణి అనురాధను కృష్ణ హత్య చేయడానికి పథకం వేసుకున్నాడని తెలుసుకున్న అతని తండ్రి లాల్‌కృష్ణ 15 రోజులకు ముందే తన భార్యతో కలిసి స్వస్థలమైన నేపాల్‌కు పారిపోయాడు. లాల్‌కృష్ణ పారిశ్రామికవేత్త శ్రీకాంత్‌కు చెందిన మహాబలిపురం సమీపంలొరి నెమిలిచేరి వద్దనున్న ఫామ్‌హౌ్‌సలో సెక్యూరిటీ గార్డుగా 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతడి మీద నమ్మకంతో కారు డ్రైవర్‌గా నియమించుకున్నారు. ఈ హత్యకేసులో అరెస్టయిన కృష్ణ అతడి అనుచరుడు రవిరాయ్‌ వద్ద పోలీసులు విచారణ జరిపినప్పుడు కృష్ణ తండ్రి లాల్‌శర్మ నేపాల్‌కు పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రత్యేక పోలీసుల బృందం ఆయనను అరెస్టు చేయడానికి నేపాల్‌కు వెళ్లింది. 


ముగిసిన పోస్టుమార్టం

శ్రీకాంత్‌, అనురాధ దంపతుల మృతదేహాలను ఆదివారం పోలీసులు తహసీల్దార్‌, రెవిన్యూ అధికారుల సమక్షంలో వెలికి తీశారు. చెంగల్పట్టు ఆస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం ముగిసింది. కాగా అమెరికాలో ఉన్న శ్రీకాంత్‌ కుమారుడు జస్వంత్‌, కుమార్తె సునంద చెన్నైకి విమానంలో బయలుదేరారు. సునంద కాలిఫోర్నియాలోని ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జస్వంత్‌ డాక్టర్‌ కోర్సు చదువుతున్నాడు. వీరు సోమవారం రాత్రిలోపు నగరానికి చేరుకుంటారని వారు రాగానే మృతదేహాలను వారికి అప్పగించనున్నామని పోలీసులు వెల్లడించారు. 


మూడు నెలలుగా పథకం...

శ్రీకాంత్‌, అనురాధ దంపతులను హతమార్చేందుకు కారు డ్రైవర్‌ కృష్ణ, అతడి అనుచరుడు రవిరాయ్‌ మూడు నెలలుగా పథకం రూపొందించారు. అమెరికాలో ఉన్న కుమార్తె సునందకు మూడు నెలల క్రితం ఓ బిడ్డ జన్మించింది. దీంతో కుమార్తెను చూడటానికి శ్రీకాంత్‌, అనురాధ దంపతులు మార్చిలో అమెరికా బయలుదేరారు. ఆ దంపతులు అమెరికా నుంచి తిరిగి వచ్చే రోజునే వారిని హతమార్చాలని పథకం వేశారు. నెమిలిచేరి వద్దనున్న శ్రీకాంత్‌ ఫామ్‌ హౌస్‌లో మృతదేహాలను పాతిపెట్టేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. హత మార్చేందుకు, మట్టిని తవ్వేందుకు పరికరాలు ఎంపిక చేసుకున్నారు. వాటిని  శ్రీకాంత్‌ నివాసంలోనే భద్రపరిచారు. మృతదేహాలను మూటగట్టేందుకు పెద్ద ప్లాస్టిక్‌ సంచులను, గోనె సంచులను ఆ ఇంట్లోనే ఓ చోట దాచిపెట్టారు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో నిర్బంధించి హత్య చేయాలని పథకం వేశారు. ఆ మేరకు వేర్వేరు గదులో నిర్బంధించి దారుణంగా హతమార్చారు. తర్వాత ఇంట్లోని నగలను, నగదును మూటగట్టుకుని శ్రీకాంత్‌ కారులో మృతదేహాలను నెమిలిచేరి ఫామ్‌ హౌస్‌ వద్దకు తీసుకెళ్లి ఎంపిక చేసిన స్థలంలోనే పూడ్చివేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మీదుగా నేపాల్‌కు పయనమయ్యారు.


చిన్న తప్పిదంతో అరెస్టు...

నిందితులు కృష్ణ, రవిరాయ్‌ రెండు తప్పిదాల వల్ల పోలీసులకు పట్టుబడ్డారు. శ్రీకాంత్‌ దంపతులను హతమార్చిన తర్వాత వారి సెల్‌ఫోన్లను పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అయితే కృష్ణ తన సెల్‌ఫోన్‌ వినియోగంలో ఉంచాడు. అలాగే వేరే కారు కాకుండా శ్రీకాంత్‌కు చెందిన కారులోనే చెన్నై నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ తప్పిదాల వల్లే హత్య జరిగిన ఆరుగంటల్లోపే ఒంగోలు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. 

Read more