Abn logo
Nov 25 2020 @ 00:30AM

ఈ జంట అందరి కోసం...

‘దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు’ అంటారు. కానీ అలాంటి వాళ్ల కోసమే మేమున్నామంటూ సమాజానికి సేవలందిస్తోంది ఓ ఆదర్శ జంట. ఆకలి తీర్చడం మొదలు... ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం వరకూ భిన్నమైన బాధ్యతలను భుజాన మోస్తున్న ఆ దంపతులే వింజమూరి సూర్యప్రకాష్‌, సామవేదం కామేశ్వరి. అలుపెరగని తమ సేవా ప్రయాణంలో తమ అనుభవాలు, ఆలోచనలను ఈ వైద్య జంట నవ్యతో పంచుకున్నారు!


‘‘నేను తినగలుగుతున్నాను. మరి నాలాగా సాటివారందరికీ భోజనం దక్కుతోందా?’ భోజనంచేస్తున్న ప్రతిసారీ మనసులో కలిగే ఆలోచనలివి. సమయానికి తిండి దొరకని వారి పరిస్థితి ఏమిటి? ఉండడానికి నీడ లేని వారికి ఎవరు దిక్కు? ఇలాంటి ఆలోచనలు ఇతరుల ఆకలి తీర్చే మార్గాన్వేషణకు పురిగొల్పాయి. ప్రారంభంలో ఉచితంగా అరటిపండ్లు పంచడంతో మొదలైన మా ప్రయత్నం క్రమేపీ భోజనం పెట్టగలిగే స్థాయికి చేరుకుంది. ఎవరైనా వచ్చి అడిగేవరకూ ఎందుకు? వాళ్లంతట వాళ్లే వచ్చి, వండుకుని తినే వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా? అని అనిపించింది. అందుకోసం 2006 జూన్‌ 15న ఏర్పడిందే ‘అందరి ఇల్లు’. ఇక్కడకు ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు. ఎన్ని రోజులైనా ఉండవచ్చు. ఇక్కడ వంట వండుకోవడానికి అవసరమైన వస్తువులు, నీటి సౌకర్యాలు ఉంటాయి. ‘అందరి ఇల్లు’ను నడిపించడానికి నెలకు సుమారు 30 నుంచి 50 వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది. అయినా మాకు ఎప్పుడూ భారం అనిపించలేదు. ఇందుకు కారణం ఎంతోమంది అవసరార్ధులకు ‘అందరి ఇల్లు’ ఆసరా కావడమే! ఆ ఇంటితో జీవితంలో మర్చిపోలేని అనుభవాలూ, జ్ఞాపకాలూ ముడిపడి ఉన్నాయి.


విజ్ఞానాన్ని పంచే ఆనంద నిలయం

ఆకలి తర్వాతి స్థానం విజ్ఞానానిది. ఆకలి తీర్చితే సరిపోదు. అంతో ఇంతో విజ్ఞానం కూడా అందించాలి. ఈ ఆలోచనతో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం కోసం, విజ్ఞానాన్ని పెంచడం కోసం 2011లో తెలంగాణాలో 9 రీడింగ్‌ ప్లేసెస్‌ను, లైబ్రరీలను ఏర్పాటు చేశాం. ఆ రీడింగ్‌ ప్లేసెస్‌ ఇప్పుడు 100కు చేరుకున్నాయి. ‘ఆనంద నిలయం’ మేము నెలకొల్పిన సెంట్రల్‌ లైబ్రరీ. ఇప్పటికీ ఒక అంశం మీద పట్టు కోసం కనీసం 20 మంది కలిసి వచ్చి అడిగితే, వాళ్లకు అవసరమైన సహాయం అందిస్తాం. ఇక రీడింగ్‌ ప్లేసెస్‌లో ప్రతి శనివారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకూ గంట పాటు పుస్తకాలను చదివి వినిపించడం, ఆ పుస్తకం గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకూ సుమారు వేల పుస్తకాలను ప్రజలకు పరిచయం చేయగలిగాం. కొవిడ్‌ సమయంలో కూడా ఆన్‌లైన్‌ ద్వారా రీడింగ్‌ కార్యక్రమాన్ని కొనసాగించాం. కొవిడ్‌ కారణంగా కార్యక్రమాలు నిలిపివేసిన ‘ఆనంద నిలయం’ తిరిగి 2021 జులై 18 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. 


ఆకుకూరలే మేలు...

90శాతం మహిళల సమస్యలను ఆహారంతోనే నయం చేసే వీలుంది. ఆడపిల్లల్లో అంతో ఇంతో నెలసరి నొప్పి సహజం. అయితే పెయిన్‌ కిల్లర్స్‌తో పనిలేకుండా ఆకుకూరలతోనే నొప్పిని తగ్గించుకునే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 525 రకాల ఆకుకూరలు దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని నెలసరి నొప్పిని తగ్గిస్తే, నెల మొత్తం తినగలిగితే ఒంటినొప్పులను అదుపులోకి తెచ్చే ఇంకొన్ని ఆకుకూరలూ ఉన్నాయి. అంతటి శక్తి ఆహారానికి ఉంది.


నిజజీవిత కథలెన్నో...

ఓ రోజు ఒక మధ్య వయస్కురాలు ఎంతో నీరసంతో ‘అందరి ఇల్లు’కు చేరుకుంది. ఆకలి తీరిన తర్వాత ‘నా కొడుకును కూడా తీసుకురావచ్చా?’ అని అడిగింది. ఆ బాబు ఆమె కంటే ఎక్కువగా నీరసించి ఉన్నాడు. భోజనంచేసి రెండు రోజులైందని వాళ్ల మాటల ద్వారా తెలిసింది. ఆ మాటలతో మనసు ద్రవించుకుపోయింది. వాళ్లు ఆ పరిస్థితి చూసి ఎందుకొచ్చారు? ఎక్కడివారు? అనే ప్రశ్నలేవీ తట్టలేదు. అవసరానికి ‘అందరి ఇల్లు’ ఉపయోగపడిందనే తృప్తి కలిగింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఆ తల్లీబిడ్డా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత కాలం తర్వాత అదే కుర్రాడు స్కూటరు మీద వెళ్తూ ఆగి, ‘గుర్తుపట్టారా’ అంకుల్‌ అని పలకరించాడు. టైల్స్‌ పరిచే పని చేస్తున్నాననీ, తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితి క్రమేపీ మెరుగైందనీ, ఆపత్కాలంలో తమకు ఆసరా అందించిన ‘అందరి ఇల్లు’కు తనకు తోచిన సహాయం చేయగలననీ అన్నాడు. వాళ్లది బాగా బతికిన కుటుంబమనీ, ఓ ప్రమాదంలో తన ఆరోగ్యం దెబ్బతిని, 80 లక్షలు ఖర్చు పెట్టడంతో కుటుంబం రోడ్డున పడిందనీ, ఆ సమయంలో ‘అందరి ఇల్లు’ గురించి తెలిసి, ఆక్కడికి వచ్చి తలదాచుకున్నామనీ ఆ కుర్రాడు చెప్పుకొచ్చాడు. ఇలాంటి నిజజీవిత కథలెన్నో ఆ ఇంటితో ముడిపడి ఉన్నాయి. 

- వింజమూరి సూర్యప్రకాష్‌


మహిళలు మేల్కోవాలి

మహిళలు తమ శరీరం విలువను గ్రహించాలి. శరీరంలో నిరర్ధకమైన అవయవం ఏదీ ఉండదు. అయితే స్వల్ప అసౌకర్యానికి విసుగు చెంది, గర్భసంచీని తొలగించుకునే (హిస్ట్రక్టమీ) మహిళల సంఖ్య పెరుగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియాలలో వెయ్యి మంది మహిళల్లో కేవలం ఇద్దరు, ముగ్గురికే హిస్ట్రక్టమీలు జరుగుతూ ఉంటే, మన దగ్గర ప్రతి వంద మంది మహిళల్లో 9 నుంచి 15 వరకూ, కొన్ని ప్రాంతాల్లో 30 వరకూ హిస్ట్రక్టమీలు జరుగుతున్నాయి. అలాగే సహజసిద్ధంగా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నా, ఐ.వి.ఎఫ్‌ లాంటి వైద్య ప్రక్రియలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లడానికీ, గర్భసంచీ తొలగించే సర్జరీలను ఆశ్రయించడానికీ ప్రధాన కారణం ఆ అంశాల పట్ల మహిళలకు అవగాహన లేకపోవడమే! ఇందుకోసం ఒక వైద్యురాలిగా, సాటి మహిళగా అవగాహనా కార్యక్రమాల ద్వారా మహిళల్లో చైతన్యం తీసుకురాగలిగాను. ఇందుకోసం ఉద్యమాలు చేపట్టాను. ‘గర్భసంచీని కాపాడుకుందాం - సమాజాన్ని బలపరుచుకుందాం’ అనే పేరుతో పుస్తకం కూడా రాశాను. అవగాహన అవసరం

తొలి నెలసరి మొదలైన ఆడపిల్లలు మొదలు మెనోపాజ్‌కు చేరుకునే వయసు వరకూ మహిళలే నా లక్ష్యం. మహిళల జీవితకాలంలో ఈ సమయం ఎంతో కీలకం. తీసుకునే ఆహారం, ఆచరించే అలవాట్లు, అనుసరించే జీవనశైలి... ఇలా మహిళల ఆరోగ్యం ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సమస్య తలెత్తితే మూల కారణాన్ని కనిపెట్టి సరిదిద్దుకుని ఆరోగ్యాన్ని గాడిన పెట్టుకునే తత్వం కూడా మహిళల్లో కొరవడుతోంది. అందుకే మహిళలకు సంబంధించిన ఎలాంటి అనుమానాలనైనా, ఎటువంటి అపోహలనైనా నివృత్తి చేసి, వాళ్లలో అవగాహన నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకోసం నిరంతరంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాను. నెలసరిలో పాటించవలసిన పరిశుభ్రత, నొప్పి తగ్గించే మార్గాలు, సహజసిద్ధ గర్భధారణ, ప్రసవం, బాలింతల ఆరోగ్యం, గర్భసంచి ప్రాముఖ్యం, తొలగిస్తే కలిగే దీర్ఘకాల నష్టం, మెనోపాజ్‌ మేనేజ్‌మెంట్‌... ఇలా జీవితంలోని వివిధ దశల్లో తలెత్తే ఏ సమస్యనైనా మహిళలు చాకచక్యంగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా పరిష్కరించుకోవచ్చో నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ ప్రయాణం నిరంతరం కొనసాగిస్తాను. 

- గోగుమళ్ల కవితAdvertisement
Advertisement
Advertisement