Shocking Incident: పెళ్లప్పుడు ఇంత మంచిగా ఫొటోలకు ఫోజులిచ్చి.. ఇప్పుడేమో..

ABN , First Publish Date - 2022-08-14T00:30:11+05:30 IST

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం. ఆ మనస్పర్థలే ముదిరి పాకాన పడితే విడాకులు తీసుకుని..

Shocking Incident: పెళ్లప్పుడు ఇంత మంచిగా ఫొటోలకు ఫోజులిచ్చి.. ఇప్పుడేమో..

హసన్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం. ఆ మనస్పర్థలే ముదిరి పాకాన పడితే విడాకులు తీసుకుని భార్యాభర్తలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అయితే.. విడాకులు దరఖాస్తు చేసినా కోర్టు వెంటనే మంజూరు చేయదు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదురుతుందేమోనన్న ఉద్దేశంతో కోరిన వెంటనే విడాకులు మంజూరు చేయకుండా కోర్టు కొంత వ్యవధి ఇస్తుంది. అప్పటికీ ఆ భార్యాభర్తలు విడాకులు కావాలనే నిర్ణయానికే కట్టుబడి ఉంటే అప్పుడు విడాకులు మంజూరు చేస్తుంది. కానీ.. కర్ణాటకలో ఓ భర్త విడాకులు కేసు కోర్టులో ఉండగానే సంయమనం కోల్పోయాడు.



కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న భార్యను వెంబడించి వెంట తెచ్చుకున్న కత్తితో కోర్టు ప్రాంగణంలోనే గొంతు కోశాడు. పాపం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన హసన్ జిల్లా హోలెనరసిపుర కోర్టు ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తట్టెకెరె ప్రాంతానికి చెందిన చైత్ర, శివకుమార్‌కు ఆరేళ్ల  క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మూడేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. భర్త నుంచి భరణం కోరుతూ చైత్ర కోర్టును ఆశ్రయించింది.



హోలెనరసిపుర కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ‘లోక్ అదాలత్’లో భార్యాభర్తలు కలిసి ఉండాలని చైత్ర, శివకుమార్‌కు న్యాయమూర్తి సూచించారు. అయినప్పటికీ భార్యాభర్తలిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. చైత్ర తన కూతురిని టాయ్‌లెట్‌కు తీసుకెళ్లిన క్రమంలో ఆమెను వెంబడించిన శివకుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కత్తితో గొంతు కోయడంతో చైత్ర కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను హుటాహుటిన హోలెనరసిపుర హాస్పిటల్‌కు తరలించారు. పారిపోతున్న శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చైత్రకు హోలెనరసిపుర హాస్పిటల్‌‌లో ప్రాథమిక చికిత్స చేసి హసన్ జిల్లా హాస్పిటల్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో తరలించారు. జిల్లా ఆసుపత్రిలో చేర్చిన కొన్ని నిమిషాలకే చైత్ర ప్రాణాలు కోల్పోయింది. కోర్టు ప్రాంగణంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు.

Updated Date - 2022-08-14T00:30:11+05:30 IST