ఈ ఇంటిని చూస్తే ‘క్లిక్’మనిపించకుండా ఉండలేరు!

ABN , First Publish Date - 2020-07-16T02:29:48+05:30 IST

గృహమే కదా స్వర్గసీమ అన్నారు.. అదే తాము స్వర్గంలా భావించే వృత్తి ఏకంగా ఇంటి రూపంలో కళ్ల ముందు నిలబడితే...

ఈ ఇంటిని చూస్తే ‘క్లిక్’మనిపించకుండా ఉండలేరు!

బెంగళూరు: గృహమే కదా స్వర్గసీమ అన్నారు..  ఎంతో ఇష్టపడే వృత్తి ఏకంగా గృహమై కళ్ల ముందు నిలబడితే... అంతకు మించిన ఆనందం మరోటి ఉండదేమో. అచ్చం అదే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు కర్నాటకలోని బెళగావికి చెందిన ఫోటోగ్రాఫర్ దంపతులు రవి, కృపా హొంగల్. ఫోటోగ్రఫీపై మక్కువను ప్రతిబింబించేలా తమ కొత్త ఇంటికి ఏకంగా కెమేరా రూపాన్ని ఇచ్చారు. రూ.71 లక్షలతో నిర్మించిన ఈ ఇంటికి ‘క్లిక్’ అని పేరుపెట్టారు. అంతే కాదు... వీరి ముగ్గురు పిల్లలకు కెమేరా కంపెనీల పేర్లే పెట్టడం మరో విశేషం. ‘కేనన్’, ‘నికాన్’, ‘ఎస్పన్’ అని తమ పిల్లలకు పేర్లు పెట్టినట్టు ఈ దంపతులు వెల్లడించారు. 


కాగా కెమేరాను పోలిన ‘క్లిక్’ భవనంలో కిటికీలు మొదలు అన్నీ వైవిధ్యభరితంగా ఉన్నాయి. కిచెన్ కిటీకికి లెన్స్ రూపాన్ని ఇవ్వగా.. బెడ్రూమ్ విండోను మెమొరీ కార్డులా, రెయిలింగ్‌ను రీల్ ఆకారంలో, మరో బెడ్రూం కిటికీని ఫ్లాష్ ఆకారంలో ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకున్నారు. ఇక మూడు అంతస్తుల ఈ భవనం లోపల కూడా కెమేరా భాగాలను తలపించేలా ఉండడం మరో విశేషం. వాస్తవానికి ఏప్రిల్ 26న తాము ఘనంగా గృహ ప్రవేశం చేయాలనుకున్నామనీ... కానీ కొవిడ్-19 కారణంగా సాధ్యంకాలేదని రవి తెలిపారు. అయినప్పటికీ అటుగా వెళ్లే చూపరులను ఈ ఇల్లు ఇట్టే ఆకట్టుకుంటోంది. చాలా మంది ఇక్కడ ఆగి సెల్ఫీలు తీసుకుని మరీ వెళ్తున్నారు. 





Updated Date - 2020-07-16T02:29:48+05:30 IST