దేశ సేవిక, త్యాగజీవన

ABN , First Publish Date - 2021-01-20T09:13:13+05:30 IST

‘ఊయల లూగించే కోమల కరాలే రాజ్యాలను శాసిస్తవి!/తూలికపట్టే మృదు హస్తాలే శతఘ్నులు విదలిస్తవి!/ జోలలబుచ్చే సుకుమారపు చేతులే...

దేశ సేవిక, త్యాగజీవన

‘ఊయల లూగించే కోమల కరాలే రాజ్యాలను శాసిస్తవి!/తూలికపట్టే మృదు హస్తాలే శతఘ్నులు విదలిస్తవి!/ జోలలబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి!’...అంటూ వందేళ్ల క్రితమే ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అంటూ ఆచరించి చూపించారు. నెల్లూరు జిల్లా పోట్లపూడికి చెందిన పొణకా కనకమ్మ విప్లవకారిణి, సాహితీవేత్త, మహిళోద్ధరణ వేగుచుక్క. దేశం కోసం సర్వం త్యాగం చేసి, ఆమె కనబర్చిన తెగువ, పోరాట పటిమ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచాయి.


మరుపూరి కొండారెడ్డి, కావమ్మ దంపతులకు 1892 జూన్ 10న కనకమ్మ జన్మించారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డి చిటికెన వేలును అందుకుని అత్తారింట్లో అడుగుపెట్టారు. కనకమ్మ కాపురానికి వెళ్లే నాటికి పొణకా కుటుంబం 150 ఎకరాల స్థిరాస్థితో వైభవంగా తులతూగుతుండేది. భూస్వామ్య కుటుంబాల్లోని పరదాచాటు జీవితం అనుభవించకుండా పరాయి పాలకులను పారద్రోలేందుకు కనకమ్మ గడపదాటారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చైతన్య కెరటమై ఎగిశారు.


ఉద్యమ కాలంలో పోట్లపూడికి ఎవరు వచ్చినా కనకమ్మ ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లేవారు కాదు. కనకమ్మ గృహం రాజకీయ, సాంస్కృతిక సమావేశాలకు కేంద్రంగా విరాజిల్లింది. విఖ్యాత రచయితలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, కవులు, కళాకారులు ఇలా ఎంతో మంది కనకమ్మ ఔదార్యానికి పాత్రులైనవారే. వందేమాతరం ఉద్యమం సందర్భంగా 1907లో ఆంధ్రరాష్ట్రానికి వచ్చిన బెంగాల్ నాయకుడు బిపిన్ చంద్రపాల్ కనకమ్మ అతిథిగా ఒక రోజంతా పోట్లపూడిలోనే గడిపారు. 1920లో మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం ఉధృతమైన తర్వాత కనకమ్మ నివాసం ఎంతో మంది జాతీయోద్యమ నాయకులకు విడిదిగా మారింది. తమ కుటుంబ ఆస్తులను జాతీయ ఉద్యమం కోసం ఆమె హారతికర్పూరంలా ఖర్చు చేశారు. 


ఆంధ్రమహాసభ సమావేశాలు 1917 జూన్ మొదటి వారంలో నెల్లూరు జిల్లాలో జరిగాయి. ఆ సభల్లో మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావాలని కనకమ్మ చేసిన ప్రసంగం సభికులను ఉత్తేజితులను చేసింది. దీంతో మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే చారిత్రాత్మక తీర్మానాన్ని ఆంధ్రమహాసభ ఆమోదించింది. బాలికా విద్యకోసం కనకమ్మ 1923లో నెల్లూరులో కస్తూరి విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 


1921 ఫిబ్రవరి 7న పల్లెపాడులో పెన్నానదీ తీరాన ‘పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని’ మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఆ ఆశ్రమానికి కనకమ్మ 13 ఎకరాలను దానంగా ఇచ్చారు. అంతే కాదు ఆశ్రమం కోసం ఒంటిపై ఉన్న40 సవర్ల బంగారు నగలను విరాళంగా ఇచ్చారు. ఆనాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆ మహాతల్లి మళ్లీ బంగారు నగలను ధరించనే లేదు.


విప్లవ మార్గంలో పయనిస్తున్న నెల్లూరు యువతకు కనకమ్మ వెన్నుదన్నుగా నిలిచారు. నిషిద్ధ సాహిత్యాన్ని రహస్య ప్రదేశాల్లో భద్రపరచడమే కాకుండా ఆంగ్లేయులపై పోరాటానికి పాండిచ్చేరి నుంచి పిస్టళ్లు తెప్పించారు. 1919లో గదర్ పార్టీ విప్లవకారుడు దర్శి చెంచయ్య జైలు నుంచి విడుదలై నేరుగా కనకమ్మను కలుసుకున్నారు. నాటి విప్లవ నాయకులు ఆ వీర మాతను ‘కణకణమండే విప్లవ నాయిక’గా అభివర్ణించారు.


1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖపాత్ర పోషించారు. అరెస్ట్రై నెల్లూరు, వేలూరులో జైలుశిక్ష అనుభవించారు. 1932 లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. సారా దుకాణాల దగ్గర పికెటింగ్ చేస్తుండగా అరెస్టయ్యారు. పోలీసుల లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కనకమ్మ 18 నెలల జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక వెంకటగిరి జమిందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. కనకమ్మ జమీన్ రైతు సంఘం ఏర్పాటు చేసి, జమిందారులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేశారు. జమిందారీ వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. ఈ క్రమంలోనే 1930 మార్చిలో ‘జమీన్ రైతు’ పత్రికను స్థాపించారు. పత్రిక ద్వారా రైతాంగ హక్కుల కొరకు రైతులను చైతన్య పరిచారు. గాంధీజీ స్వయంగా వెంకటగిరికి వచ్చి జమిందారీ వ్యవస్థ వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ప్రకటించడం ఆ ఉద్యమం ఎంతగా రాజుకుందో తెలియచెబుతుంది. 


పొణకా కనకమ్మ ఎన్నో వ్యాసాలు, కవితలు రాశారు. తన సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. భగవద్గీతను తెలుగీకరించారు. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి శ్రీరమణ మహర్షిని స్తుతిస్తూ అనేక కవితలు రాశాలు. వారిరువురు తొలి తెలుగు జంట కవయిత్రులు. ఈ ఉదాత్త సాహితీ సేవకు గుర్తింపుగా కనకమ్మకు ప్రతిష్ఠాత్మక గృహలక్ష్మీ స్వర్ణకంకణం లభించింది. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన పొణకా కనకమ్మ 1963లో కన్నుమూశారు. మహిళా శక్తికి వెలుగుచుక్కగా నిలిచిన కనకమ్మను ప్రతిఒక్కరు స్మరించుకోవాలి. 

కౌడె సమ్మయ్య

(‘పొణకా కనకమ్మ ఆశయసాధన సమితి–నెల్లూరు’ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌ అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఉదయం 10గం.లకు పొణకా కనకమ్మ స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం)

Updated Date - 2021-01-20T09:13:13+05:30 IST