నేర్చుకోవలసిన దేశాలు

ABN , First Publish Date - 2020-06-11T06:34:54+05:30 IST

కరోనా ఉత్పాతం మొదలైన దగ్గర నుంచి, అది ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎట్లా విజృంభిస్తున్నదీ, ఎక్కడ మందకొడిగా ఉన్నదీ అందరూ గమనిస్తున్నారు. ఉధృతికి కానీ, ఉదాసీనతకు కానీ కారణాలేమి కావచ్చునో ఊహించడం ఒక బౌద్ధిక వ్యాసంగంగా కూడా మారింది...

నేర్చుకోవలసిన దేశాలు

కరోనా ఉత్పాతం మొదలైన దగ్గర నుంచి, అది ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎట్లా విజృంభిస్తున్నదీ, ఎక్కడ మందకొడిగా ఉన్నదీ అందరూ గమనిస్తున్నారు. ఉధృతికి కానీ, ఉదాసీనతకు కానీ కారణాలేమి కావచ్చునో ఊహించడం ఒక బౌద్ధిక వ్యాసంగంగా కూడా మారింది. చైనా ఎట్లా వూహాన్‌కే వైరస్‌ను కట్టడి చేయగలిగింది, స్పెయిన్‌లో, ఇటలీలో ఎందుకు వ్యాధి మొదట వీరంగం వేసిందీ, ఆ తరువాత అమెరికాలో అన్నిటిని దాటుకుని ప్రళయతాండవం చేసిందీ– మనం చూస్తూనే వచ్చాము. ఇప్పుడు క్రమంగా భారతదేశం ఒక్కో దేశాన్ని దాటుకుని మొదటి అంకెల్లోకి చేరబోతున్నదన్న హెచ్చరికా వినిపిస్తున్నది. 


ఇటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కొనడంలో అనుభవం ఎవరికీ ఉండదు కాబట్టి, ప్రతి దేశమూ ఇతర వైపరీత్యాల అనుభవం నుంచి, కొంత వివేకం నుంచి తన వ్యూహాలను రూపొందించుకున్నది. కొన్ని దేశాలలో అటువంటి వ్యూహాలు విజయవంతం అయ్యాయి. మొదటగా చెప్పుకోవలసింది క్యూబా. ఈ విపత్తుకు బెంబేలు పడిపోకుండా, ఆ చిన్నదేశం ఇతరులకు సహాయం చేయడానికి చొరవ చూపింది. పెద్ద సంఖ్యలో వైద్యులను రూపొందించిన దేశంగా, ప్రజారోగ్యానికి అమిత ప్రాధాన్యం ఇచ్చే సమాజంగా క్యూబా అందరికీ ఆదర్శంగా నిలిచింది. కోటీ పదిహేను లక్షల జనాభాలో కేవలం 2300 మందికి వైరస్‌ సోకగా, 83 మంది మాత్రమే మరణించారు. కరోనా విముక్త దేశంగా అతి త్వరలో ప్రకటించుకోనున్నది. ద్వీపదేశంగా న్యూజీలాండ్‌ కూడా ప్రశంసార్హమైన కట్టడిని అమలుచేసి, వైరస్‌ నిశ్శేష దేశంగా చెప్పుకుంటున్నది. యాభై లక్షల జనాభా కలిగిన న్యూజీలాండ్‌ 12 వందల పాజిటివ్‌ కేసులను, 22 మరణాలను మాత్రమే నమోదు చేసుకున్నది. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ మహిళాప్రధాని జసిందా అర్డెర్న్‌ను ప్రపంచమంతా ప్రశంసిస్తున్నది. భారతదేశంలో కేరళ, ఆ తరువాత ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న సొంత చొరవను అందరూ ప్రస్తావిస్తున్నారు. 


ఇటువంటి ఆపదకాలంలోనూ ప్రపంచం ఆఫ్రికాను విస్మరిస్తున్నది. అక్కడ జరుగుతున్న మంచిని చాటకపోవడం మంచిది కాదు. తాము కరోనా నుంచి విముక్తమవుతున్నామని టాంజానియా తాజాగా ప్రకటించింది. ఆఫ్రికా ఖండం జనాభా సుమారు 125 కోట్లు. అటూ ఇటూగా భారతదేశ జనాభాకు సరిసాటి. 2,03, 000 పాజిటివ్‌ కేసులు, 5600 మరణాలు ఆఫ్రికాలో నమోదయ్యాయి. భారతదేశంలో కేసులు 3 లక్షలకు సమీపిస్తుండగా, 8000 దాకా మరణాలు నమోదయ్యాయి. భారతదేశం కంటె ఆఫ్రికన్‌ దేశాలు వెనుకబడినవి. దారిద్య్రంలో, ఆహారలోపంతో, అంతర్గత హింసలతో కునారిల్లిపోయే దేశాలే ఎక్కువ. అయినా, కరోనాపై పోరాటంలో వారు అందరికంటె ముందున్నారు. వ్యాధివ్యాప్తిని సమర్థంగా కట్టడి చేస్తున్నారు. ర్వాండా, ఉగాండా, ఇథియోపియా, లైబీరియా– ఈ దేశాల పేర్లను సానుకూలమైన సమాచారంతో పాటు ఎప్పుడూ విని ఉండము. కానీ, ర్వాండా నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆఫ్రికన్‌దేశాలు సాధించిన ఈ పురోగతికి కారణం– అంటువ్యాధులను ఎదుర్కొనడంలో వారికి ఉన్న అనుభవం. ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి ఉంటే విపరీత జననష్టానికి కారణమయి ఉండే ప్రాణాంతక ‘ఎబోలా’ ను రెండేళ్ల కిందటే అనేక ఆఫ్రికన్‌దేశాలు ఎదుర్కొన్నాయి. వ్యక్తిగత దూరాలు పాటించడం, శుభ్రీకరణ వంటి పద్ధతులు ఇతరులకు 2020లో తెలిస్తే, వారికి రెండేళ్ల నుంచే అమలులో ఉన్నాయి. ఎబోలా అదుపులోకి వచ్చినా వారు ఇంకా ఆ పద్ధతులను వదలలేదు. ఆఫ్రికా దేశాలలో వ్యాధి మందకొడిగా ఉండడానికి అక్కడేదో మాయ ఉన్నదనీ, లేదా నల్లవారి రోగనిరోధక శక్తి దృఢమైనదనీ ఏవేవో కారణాలు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలనూ ఊహిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, అది కూడా చాలా మొదట్లోనే చేయడం, రోగుల సంఖ్య అతి స్వల్పంగా ఉన్నప్పుడే తీవ్రమైన, విస్తృతమైన చర్యలు తీసుకోవడం, రోగవ్యాప్తిని తెలుసుకుంటూ పోయి వ్యాప్తిని అరికట్టడం– వంటి పద్ధతులు ఈ చిన్న చిన్న ఆఫ్రికన్‌దేశాలు సమర్థవంతంగా చేశాయి. వారికి ఉన్న వైద్య ఆరోగ్య వ్యవస్థ అతి బలహీనమైనది. వైద్యసిబ్బంది సంఖ్య కూడా తక్కువ. ఆ పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఆఫ్రికా, వ్యాధిని కనుగొని, అరికట్టే వ్యూహం మీద ఆధారపడింది. అన్ని దేశాలూ ఒకే రకంగా లేవు. కొన్ని వ్యాధిని గట్టిగా ఎదుర్కొనలేకపోయాయి. అన్నిదేశాల్లోనూ లాక్‌డౌన్‌, వ్యాధి కట్టడి పేరిట మానవహక్కుల ఉల్లంఘనలు కూడా జరిగాయి. అయినప్పటికీ, భారతదేశం, తెలుగు రాష్ట్రాలు ఆయా ఆఫ్రికన్‌దేశాల అనుభవాలనుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది. 


ఆఫ్రికాలో కూడా ప్రమాదకరమైన అలక్ష్యాన్ని, విదూషకత్వాన్ని ప్రదర్శిస్తున్న దేశాధినేతలు లేకపోలేదు. ఆ ఘనత కేవలం అమెరికా సొంతమే కాదు. మెడగాస్కర్‌ అధ్యక్షుడు ఒక హెర్బల్‌ టీని కరోనాకు మందుగా ప్రచారం చేశాడు. భారతదేశంలో కూడా కొందరు గోమూత్రాన్ని కరోనాకు వైద్యంగా ప్రతిపాదించారు, అసంఖ్యాకంగా దాన్ని పాటించడానికి ప్రయత్నించారు. అట్లాగే, ఆ టీ కి కూడా మంచి ఆదరణ లభించింది. కాంగో, టాంజానియాల నుంచి భారీ ఆర్డర్లు కూడా వచ్చాయట. పేరాసెటమాల్‌ వేసుకుంటే తగ్గిపోయే జ్వరమని మన దగ్గర నేతలు అన్నట్టే, టాంజానియా అధ్యక్షుడు కూడా పాజిటివ్‌ రావడానికేమిటి, బొప్పాయి పండును పరీక్షించినా పాజిటివే వస్తుంది– అన్నాడు. ఇటువంటివి ప్రమాద గాంభీర్యాన్ని తగ్గిస్తాయి. అయితే, అక్కడ చిట్కాలూ చమత్కారాలూ ఉన్నప్పటికీ, పని కూడా సమర్థంగా జరిగిందని గుర్తించాలి.

Updated Date - 2020-06-11T06:34:54+05:30 IST