జెనీవా: కొవిడ్ ఆంక్షలు ఎత్తేయడంలో పలు దేశాలు తొందరపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర కార్యాచరణ విభాగాధిపతి మైక్ రయన్ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ‘‘కొవిడ్ ఆంక్షలు ఎత్తేసి పరిస్థితులు సాధారణ స్థితికి తేవడంలో మనం చాలా తొందరపడ్డాం. దీనికి త్వరలో మూల్యం చెల్లించబోతున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటన్, అమెరికాతో పాటూ పలు ఐరోపా దేశాలు ఇటీవల కాలంలో కొవిడ్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో మైక్ రయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తీరు ఇలాగే కొనసాగితే..కొత్త కరోనా వేవ్‌లు సంభవిస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘‘కరోనా సంక్షోభం సమసిపోలేదు. ఇది మనందరికీ తెలుసు. ఐరోపా ఖండంలో ఇప్పటికీ సగటున వారానికి ఒక మిలియన్ కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఉభయ అమెరికా ఖండాల్లోనూ ఇదే పరిస్థితి.’’ అని ఆయన కామెంట్ చేశారు.