14 కేంద్రాల్లో కౌంటింగ్‌

ABN , First Publish Date - 2021-09-18T06:18:08+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 19న ఆదివారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

14 కేంద్రాల్లో కౌంటింగ్‌
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతోన్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌


రేపే పరిషత్‌ ఓట్ల లెక్కింపు 

సమన్వయకర్తలుగా జిల్లా అధికారులు

రెవెన్యూ డివిజన్‌కి స్పెషల్‌ ఆఫీసర్‌గా జేసీలు

సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ


గుంటూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 19న ఆదివారం  నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 14 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా కేంద్రాల్లో 47 కౌంటింగ్‌ సెంటర్లని ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ, ఎంపీసీటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉన్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై తొలి విడత శిక్షణ ఇచ్చారు. మండల స్థాయిలో కౌంటింగ్‌ సిబ్బందికి మాష్టర్‌ ట్రైనర్లతో శనివారం శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 862 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎన్నికలు 571 చోట్ల జరిగాయి. ఇందుకోసం మొత్తం 610 కౌంటింగ్‌ టేబుల్స్‌ని ఏర్పాటు చేశారు. అత్యధికంగా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎనిమిది మండలాల కౌంటింగ్‌ జరగనుంది. అక్కడ 101 టేబుల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దుర్గి మండలంలో కేవలం ఒక ఎంపీటీసీ స్థానానికే ఎన్నిక జరిగినందున అక్కడ మండలపరిషత్తు కార్యాలయంలో ఒక టేబుల్‌పై లెక్కింపు జరుపుతారు. కౌంటింగ్‌కు సంబంధించి శుక్రవారం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులతో, జేసీలు రాజకుమారి, కే శ్రీధర్‌రెడ్డిలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.  రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ రెండు అంచెల భద్రతని లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తామన్నారు. ర్యాలీలు కూడా పూర్తిగా నిషేధించామని చెప్పారు. ఆయా సమీక్షల్లో ట్రాన్స్‌కో ఎస్‌ఈ విజయ్‌కుమార్‌, డీపీవో కేశవరెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, మెప్మా పీడీ ఆనంద్‌నాయక్‌, వైసీపీ నుంచి అత్తోట జోసఫ్‌, టీడీపీ నుంచి కంచర్ల శివరామయ్య, కాంగ్రస్‌ నుంచి అడవి అంజనేయులు, సీపీఐ నుంచి కే ఈశ్వరరావు, బీజేపీ నుంచి బ్రహ్మయ్య, ఎంఐఎంఐఎం నుంచి షేక్‌ బాజీత్‌బాషా బహుజన సమాజ్‌ పార్టీ కోశాధికారి చిరతనగుండ్ల వాసు తదితరులు పాల్గొన్నారు.


ఉద్యోగులకు సెలవుల రద్దు

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సెలవులో ఉన్న వారు తక్షణమే విధులకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని వివిధ శాఖల అధిపతులను ఆదేశించారు.


నేడు ఎస్‌ఈసీ నీలం సాహ్ని రాక

జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లని పరిశీలించి అధికారులతో సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నీలం సాహ్ని శనివారం గుంటూరు రానున్నారు. ఆమె తొలుత కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పలు కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి ప్రకాశం జిల్లాకు వెళతారని అధికారులు తెలిపారు.


రేపు మద్యం షాపుల మూత

 పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని ఆదివారం కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. 

Updated Date - 2021-09-18T06:18:08+05:30 IST