ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-09-17T05:26:08+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏ ముహూర్తాన ఎన్నికల ప్రక్రియ మొదలైందో.. కానీ రకరకాల వివాదాలు, అవరోధాలు చోటు చేసుకున్నాయి.

ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌

ఖరారు కాని తేదీ.. అధికార యంత్రాంగం సన్నద్ధం

జడ్పీటీసీ స్థానాలు 45, ఎంపీటీసీ స్థానాలు 781

 డివిజన్ల వారీగా కౌంటింగ్‌కు కసరత్తు


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏ ముహూర్తాన ఎన్నికల ప్రక్రియ మొదలైందో.. కానీ రకరకాల వివాదాలు, అవరోధాలు చోటు చేసుకున్నాయి. కరోనా ముందు నోటిఫికేషన్‌, నామినేషన్ల ప్రక్రియ ముగిసి వాయిదాపడింది. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ వెలువడగా.. 8న  పోలింగ్‌ నిర్వహించారు. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఓట్ల లెక్కింపుపై స్పష్టత ఇవ్వడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 


ఏలూరు సిటీ, సెప్టెంబరు 16 : గతేడాది కరోనా విజృంభించడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అర్ధంతరంగా ఆగిపోయాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 1న జడ్పీటీసీ, ఎంపీటీపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిం ది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నోటిఫికేషన్‌ జారీ చేయలేదని కొంత మంది చేసిన ఫిర్యాదుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ఎస్‌ఈసీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయిం చగా ఏప్రిల్‌ 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యధాతఽథంగా నిర్వహించు కోవాలని కానీ ఎన్నికల ఫలితాలను వెల్లడించవద్దని తీర్పు చెప్పింది. దీంతో అప్పట్లో ఎన్నికలు నిర్వహిం చినా కౌంటింగ్‌ నిర్వహించలేదు. అయితే మే 21న ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. దీనిపై ఎస్‌ఈసీ మరోసారి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను  ఆశ్రయించింది. ఆగస్టు 5న పూర్తి విచారణ చేసి తీర్పు రిజర్వు చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించుకోవచ్చునని గురువారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది.


45 జడ్పీటీసీ స్థానాలు, 781 ఎంపీటీసీ స్థానాలు 

జిల్లాలో 48 జడ్పీటీసీలుండగా ఇందులో రెండు జడ్పీటీసీలు (ఏలూరు, జంగారెడ్డిగూడెం) ఏకగ్రీవం అయ్యాయి. పెనుగొండ జడ్పీటీసీ అభ్యర్థి ఒకరు మృతి చెందడంతో ఆ ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం జిల్లాలో 45 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక ఎంపీటీసీలు జిల్లాలో 863 స్థానాలుండగా వీటిలో 73 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులు మృతి చెందడంతో మొత్తం 781 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జడ్పీటీసీకి సంబంధించి 187 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2041 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఐదు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూస్తూ.. హైకోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందోనని తీవ్ర ఉత్కంఠతో గడిపిన అభ్యర్థులు తాజాగా ఊపిరి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ గెలుపుపై టెన్షన్‌ మొదలైంది. మరోవైపు బెట్టింగురాయుళ్లు బరిలోకి దిగుతున్నారు. ఇక కౌంటింగ్‌ డివిజన్ల వారీగా చేపట్టనున్నారు. ఏలూరు డివిజన్‌లో సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో నోవా ఇంజనీరింగ్‌ కళాశాల, నరసాపురం డివిజన్‌లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, కొవ్వూరు డివిజన్‌లో తణుకు ఆకుల శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహించ నున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను అక్కడే భద్రపరిచారు.


భీమవరంలో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్‌

భీమవరం క్రైం, సెప్టెంబరు 16 : భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవలసిన భద్రతా చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ఏ కేంద్రం వద్ద ఎంత మంది ఉండాలి, పార్టీ అభ్యర్థులు, నాయకుల పార్కింగ్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలో చర్చించారు. నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, భీమవరం టూటౌన్‌ సీఐ కృష్ణకిషోర్‌, వన్‌టౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2021-09-17T05:26:08+05:30 IST