ప్రత్తిపాడులో నకిలీ పురుగుమందుల కలకలం

ABN , First Publish Date - 2020-10-01T14:57:29+05:30 IST

ప్రత్తిపాడులో నకిలీ మందుల కలకలం రేగింది. డూపాంట్‌ కంపెనీకి చెందిన..

ప్రత్తిపాడులో నకిలీ పురుగుమందుల కలకలం

రైతుల వద్ద నకిలీలు ఉన్నాయంటున్న కంపెనీ ప్రతినిధులు 

పలుచోట్ల అధికారుల సోదాలు


ప్రత్తిపాడు(గుంటూరు): ప్రత్తిపాడులో నకిలీ మందుల కలకలం రేగింది. డూపాంట్‌ కంపెనీకి చెందిన ట్రేసర్‌ మందును మార్కెట్‌లో కంపెనీ రేటు రూ.1600లు ఉండగా రూ.1200లకే అమ్ముతున్నారన్న  విషయంపై కంపెనీ ప్రతినిధులు విచారణ నిర్వహించగా అవి  నకిలీ పురుగు మందులు అని నిర్థారించుకున్నారు. దీంతో బుధవారం కంపెనీ ప్రతినిధులు ప్రసన్నకుమార్‌, అనిల్‌ గ్రామాలలో పర్యటించి రైతులను విచారించారు. తక్కువ ధరకు ట్రేసర్‌ కొన్న రైతులతో మాట్లాడగా కొత్తమల్లాయపాలేనికి చెందిన వణుకూరి అంజిరెడ్డి తమకు అమ్మినట్టు రైతులు తెలియజేశారని, ఆ విషయాలను రికార్డు చేశామంటూ కంపెనీ ప్రతినిధులు అధికారులకు తెలిపారు. జేసీ నుంచి వచ్చిన ఆదేశాలతో స్థానికంగా ఉన్న లక్ష్మీ వల్లభ రెస్టారెంటు వద్ద పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.


ఎక్కడైనా నకిలీ మందులను ఎక్కడన్నా డంప్‌ చేశారా.. తయారుచేస్తున్నారా అని పరిశీలించారు. అయితే ఎక్కడా కూడా అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. అయితే అంజిరెడ్డిని అధికారులు ప్రశ్నించగా తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పురుగు మందులను అమ్మటం లేదని, గుంటూరుకు చెందిన ఉమాట్రేడర్స్‌ వారు అమ్ముతుంటారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏవో విజయరాజు, ఆర్‌ఐ దివ్య, ఏఎస్‌ఐ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T14:57:29+05:30 IST