కేసీఆర్‌ సర్కారుకు కౌంట్‌ డౌన్‌

ABN , First Publish Date - 2022-06-30T11:08:05+05:30 IST

సికింద్రాబాద్‌, న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ, అవినీతి. వారసత్వ పాలనకు చరమగీతం పాడుతూ, బంగారు

కేసీఆర్‌ సర్కారుకు కౌంట్‌ డౌన్‌

చరమ గీతం పాడే వేదిక మోదీ సభ

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌

వచ్చే సర్కార్‌ బీజేపీదే :  అనురాగ్‌ ఠాకూర్‌ 

అభద్రతతోనే ఫ్లెక్సీ రాజకీయాలు: లక్ష్మణ్‌

సికింద్రాబాద్‌, న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ, అవినీతి. వారసత్వ పాలనకు చరమగీతం పాడుతూ, బంగారు తెలంగాణ సాధన కోసం పునాదులు వేసే చరిత్రాత్మక ఘట్టానికి పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగ సభకు వేదిక కానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రధాని మోదీ ప్రసంగం సాగనుందని తెలిపారు. శుక్రవారం మోదీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. బీజేపీ నేతలు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, డీకే అరుణ, తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా తరుణ్‌ ఛుగ్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు.. సెలవు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే టీఆర్‌ఎస్‌ సర్కారుకు తాము కౌంట్‌డౌన్‌ ప్రారంభించామని వెల్లడించారు. కాగా, తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో అఖండ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ సర్కార్‌ పాత్ర ఎంతో ఉందన్నారు. 130 కోట్ల దేశ ప్రజల సంపూర్ణ మద్దతు తెలంగాణకు ఉంటుందని భరోసా కల్పించేందుకే ఈ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత అభద్రతా భావంతో ఉన్నారో అర్థమవుతుందన్నారు. కార్యవర్గ సమావేశాల తరువాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతోందని తెలిపారు. 

Updated Date - 2022-06-30T11:08:05+05:30 IST