Abn logo
Jul 13 2020 @ 00:00AM

అతణ్ణి దక్కించుకునేదెలా?

డాక్టర్‌! పదేళ్ల క్రితం నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి అమ్మ ఎవరి ఆసరా లేకుండానే నన్ను చదివించి, వృద్ధిలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. ఆఫీసులో పని చేసే సహోద్యోగితో పరిచయం ప్రేమగా మారింది. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా, అతను వాళ్ల తల్లితండ్రులకు చెప్పడానికి జంకుతున్నాడని అర్థమవుతోంది. గట్టిగా నిలదీద్దామంటే, అతనికి కోపం వచ్చి పెళ్లి మానుకుంటాడేమో అని భయమేస్తోంది. ఇదిలా ఉంటే, అతని తల్లిది వేధించే తత్వమని, స్నేహితుల ద్వారా తెలిసింది. అతని తల్లితండ్రులను పెళ్లికి ఒప్పించేదెలా? అత్తగారి స్వభావానికి నొచ్చుకోకుండా ఉండేదెలా?  

- ఓ సోదరి, గుంటూరు.


చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు కాబట్టి మీలో అభద్రతాభావం గూడుకట్టుకుపోయింది. దాంతో మీకు నచ్చని పనులు ఎదుటివారు చేస్తున్నా, ఖండించలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడితే వారు ఎక్కడ దూరమైపోతారేమో అనే భయం మీలో నిండుకుపోయింది. అయితే ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు అనుకునే మీ తత్వం వల్ల మీరే ఎక్కువగా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. రెండేళ్లుగా పెళ్లి విషయం దాటవేస్తున్న ఆ అబ్బాయికి, ఒక డెడ్‌లైన్‌ పెట్టండి. తల్లితండ్రులతో వచ్చి, పెళ్లి సంబంధం మాట్లాడకపోతే పెళ్లి ఆలోచన మానుకోమని, అతనికి మీరు దక్కరనీ కరాఖండీగా చెప్పేయండి. ఇలా మాట్లాడడం ద్వారా, డెడ్‌లైన్‌లోగా పెళ్లి సంబంధం మాట్లాడకపోతే, మీరు అతనికి ఎప్పటికీ దక్కరనే భయాన్ని అతనిలో పుట్టించండి. దాంతో ప్రేమించిన మాట వాస్తవమే అయితే అతను కచ్చితంగా తల్లితండ్రులను మీ ఇంటికి తీసుకురావడమే కాదు, పెళ్లికి కూడా వాళ్లను ఒప్పిస్తాడు. ఇక కాబోయే అత్తగారి సంగతి తీసుకుంటే, వేధించే స్వభావం ఉండీ, పనిగట్టుకుని సాధించే వ్యక్తి అయి ఉంటే ఆ స్వభావాన్ని తట్టుకునే తత్వం మీకు లేదని సున్నితంగా చెప్పండి.


కరకుగా మాట్లాడడం, విసుక్కోవడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి మీరు తట్టుకోలేరని ముందుగానే చెప్పండి. మీరు పెరిగిన తీరు, జీవితంలో తిన్న దెబ్బలు, తండ్రి మరణంతో మగ తోడు లేకుండా అమ్మ పెంచి, పెద్ద చేసిన తీరుల గురించి వివరించండి. ఆ క్రమంలో మీలో రూపుదిద్దుకున్న సున్నిత మనస్తత్వం గురించీ ఆమెకు సానుకూలంగా వివరించండి. ఆవిడ తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీలో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మీకు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి. అందుకోసం నేరుగా, స్పష్టంగా మాట్లాడండి, అడిగి తీసుకోండి. ఏమనుకుంటారో, దూరమైపోతారేమో... అనే ఆలోచనలతో ఎదుటివారి ప్రవర్తనలను అడ్డుకోకపోతే, మీ నిస్సహాయతనువారు ఆసరాగా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనుంచి అయినా ముక్కుసూటిగా వ్యవహరించడం అలవరచుకోండి. 

- డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి

క్లినికల్‌ సైకియాట్రిస్ట్‌.