కౌన్సెలింగ్‌కు.. కసరత్తు

ABN , First Publish Date - 2021-10-19T05:29:53+05:30 IST

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

కౌన్సెలింగ్‌కు.. కసరత్తు

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లకు లైన్‌క్లియర్‌

ఈ నెల 25 తర్వాత నోటిఫికేషన్‌ జారీ

ప్రైవేటు వర్సిటీల్లోనూ విద్యార్థులకు సీట్లు

ఫీజులపై విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించేనా?



గుంటూరు(విద్య), అక్టోబరు 18: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రైవేటు వర్సిటీల్లో 30 శాతం సీట్లు విద్యార్థులకు కేటాయించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో జరిగిన జాప్యంతో నోటిఫికేషన్‌ జారీ ఆలస్యమైందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ అంశం ఈ వారం రోజుల్లో ఒక కొలిక్కి వస్తుందని ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల కానున్నదని సమాచారం. నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియకు అడ్డంకులు ఏవీ లేవని విద్యార్థులు సన్నద్ధం కావాలని కళాశాలల యాజమాన్యాలు సూచిస్తున్నాయి.


మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి ఏర్పాట్లు

జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటాలో ఉంటాయి.  మిగిలిన 30 శాతం సీట్లు భర్తీ ప్రక్రియ దాదాపు నెల క్రితం నుంచే ప్రారంభమైంది. ఆయా కళాశాలల పనితీరును బట్టి డొనేషన్‌తోపాటు ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు వసూలు చేస్తారు. ఇక కన్వీనర్‌ కోటాలో సీట్లు ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు ఎంచుకుంటారు. ఈ సీట్లుకు కూడా గతంలో ఉండే ఫీజుల కంటే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత భారీ మార్పులు చేసింది. అనేక కళాశాలల ఫీజుల్ని తగ్గించారు. ఫీజుల తగ్గింపుపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. మరో ఏడాది దాకా తగ్గించిన ఫీజులు అమల్లో ఉంటాయని సమాచారం. వసతులు, సౌకర్యాలు, బోధన, ల్యాబ్‌లు, ప్లేస్‌మెంట్‌ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని కళాశాలల్లో ఫీజులు సవరించాలని ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నాయకులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇది ఏమాత్రం అమలుకానుందో నోటిఫికేషన్‌ జారీలోగా తెలియాల్సి ఉంది.


==================================================================================

Updated Date - 2021-10-19T05:29:53+05:30 IST