Abn logo
Sep 24 2021 @ 15:26PM

chitturuలో పదవుల చిచ్చు.. ఎత్తుకు పైఎత్తుల్లో.. ఎవరిది పైచేయి..!

పరిషత్ పదవులు అధికార పార్టీలో కాకరేపుతున్నాయా? గ్రూపుల మధ్య తీవ్రమైన పోటీ.. జిల్లాలో వర్గ పోరును మరింతగా పెంచుతోందా? క్యాంపు రాజకీయాలు, ఆశావహుల ప్రయత్నాలు మంత్రులకు తలనొప్పిగా మారాయా? పరిషత్ ఎన్నికల పదవులు కాకరేపడానికి గల కారణాలేంటి?

తల పట్టుకుంటున్న మంత్రులు..

పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరులో పరిషత్ చైర్మన్ ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో వైసీపీ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు పదవుల కోసం అధికార పార్టీలో గ్రూపుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పదవులను దక్కించుకోవడానికి ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులతో అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక జిల్లాకు చెందిన మంత్రులకు సైతం ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.

 పదవుల కోసం పోటీ..

జిల్లాలో మొత్తం 65 మండలాలు వున్నాయి. దీంతో 65 ఎంపీపీ పదవులు, వైస్ ఎంపీపీ పదవులతో పాటు.. ఒక జెడ్పీ చైర్మన్, రెండు వైస్ చైర్మన్ల పదవులకు ఎన్నిక జరగాల్సి ఉంది. 65 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 30 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 35 స్థానాల్లో 33 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అన్నీ కూడా అధికార పార్టీ కైవసం చేసుకుంది. 63 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు బయట నుంచి పోటీనే లేకుండా పోయింది. అధికార పార్టీలోనే పలువురు పదవుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.

గొడవలకు వారే కారణమా..?

ఎన్నికలకు ముందు జడ్పీ చైర్మన్ పదవికి వి.కోట మండలానికి చెందిన జి.శ్రీనివాసులు పేరు తొలిసారిగా వినిపించింది. శ్రీనివాసులు  సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడు. తొలుత జడ్పీ చైర్మన్ పదవి బీసీలకు రిజర్వు అయింది. శ్రీనివాసులు పక్కళి సామాజిక వర్గానికి చెందిన వారు. మన రాష్ట్రంలో అయితే ఈ సామాజిక వర్గాన్ని ఓసీగా పరిగణిస్తారు. కర్ణాటకలో మాత్రం బీసీగా గుర్తిస్తారు. శ్రీనివాసులు కర్ణాటకలో చదువుకోవడంతో ఆయన బీసీ సర్టిఫికెట్ పొందారన్న ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో జరిగింది. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టడానికి ఏకంగా జెడ్పీ చైర్మన్ పదవి రిజర్వేషన్ కేటగిరినే ప్రభుత్వం మార్చేసి, జనరల్‌కు కేటాయించింది. దీంతో శ్రీనివాసులుకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే, ఆయన సామాజికవర్గం ఇప్పుడు వైస్ చైర్మన్ పదవుల విషయంలో వివాదానికి కారణమవుతోంది.

 అధినేత వద్ద పంచాయితీ..

శ్రీనివాసులు ఓసీ అనుకుంటే, వైస్ చైర్మన్ పదవుల్లో ఒకటి బీసీ, మరోటి ఎస్సీలకు కేటాయించాల్సి ఉంది. కానీ వైస్ చైర్మన్ పదవుల్లో మొదటిది చిత్తూరు డివిజన్‌లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన.. ఓ బలమైన జెడ్పీటీసీకి కేటాయించేలా జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పుడు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో.. శ్రీనివాసులు బీసీ వర్గానికి చెందిన వారుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.


ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తున్నామని చెప్పుకోవడానికి వైపీపీ.. చైర్మన్ మదనపల్లెకు, మిగిలిన వైస్ చైర్మన్లను చిత్తూరు, తిరుపతికి డివిజన్‌లోని వారిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీకి చెందిన పలువురు బీసీ నేతలు అధినేతను కూడా కలిసినట్లు సమాచారం. రెండో వైస్ చైర్మన్ పదవిని తిరుపతి డివిజన్ పరిధిలోని ఎస్సీ వర్గం వారికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇలా సామాజిక వర్గంపై జరుగుతున్న చర్చల్లో కులం కూడా కీలకంగా మారింది.

 ఆశావహుల బల ప్రదర్శన..

మరోవైపు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఈసారి ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలవడంతో ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ పదవులు దక్కించుకోవడానికి పలువురు నేతలు సై అంటే సై అంటున్నారు. దీంతో పలు మండలాల్లోని అధికార పార్టీలో వర్గ రాజకీయాలు జోరందుకున్నాయి. పదవులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల కీలక నాయకులు.. ఆశావహులతో బేరాలు సైతం జరుపుతున్నారట. మరికొన్ని చోట్ల ఆశావహులు బలప్రదర్శనకు దిగుతున్నారు. క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఇలాంటి పరిస్థితి సత్యవేడు నియోజకవర్గం పరిదిలోని వరదయ్యపాలెం మండలంలో చోటు చేసుకుంది.


ఇక్కడ ఎంపీపీ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. పార్టీ మండల కన్వీనర్ దయాకర్ రెడ్డి భార్య హేమలత, మరో ముఖ్యనేత దామోదర్ రెడ్డి భార్య పద్మప్రియలను ఎంపీపీగా చేయాలని... ఈ నేతలు ఇద్దరు తీవ్రంగా పోటీపడుతున్నారు. అయితే నియోజకవర్గ ముఖ్యనేతలు మీలో మీరే తేల్చుకోండని చెప్పడంతో.. ఎవరి ప్రయత్నాల్లో వారు తమ మద్దతుదారులను కాపాడుకునేందుకు క్యాంపులకు తీసుకెళ్ళినట్టు సమాచారం.

కుమార్‌రాజా భార్యకు పదవి దక్కేనా..?

బంగారుపాలెం మండలంలో మరిన్ని విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడి ఎంపీపీ పదవి బీసీ మహిళలకు కేటాయించారు. మాజీ జమిందార్ కుటుంబానికి చెందిన కుమార్ రాజా భార్య పద్మావతికి ఎంపీపీ పదవి ఇవ్వాలని.. ఎన్నికల ముందే పార్టీ నేతలు ప్రకటించారు. ఈ హామీతోనే కుమార్ రాజా 12 మంది ఎంపీటీసీలను ఏకగ్రీవంగా గెలిపించుకున్నారట. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల సమయంలో అక్కడ సీన్ మారింది. మండలంలో ఓ ముఖ్యనేత పద్మావతి కాకుండా, అదే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కుమార్‌రాజా వర్గం.. ఓ మంత్రిని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులే జిల్లాలోని చాలా మండలాల్లో కొనసాగుతున్నాయి.

చివరికి ఎవరిది పైచేయి..

ఎన్నికలు జరిగే సమయానికి మరెన్ని వివాదాలు పుట్టుకొస్తాయో.. ఎవరు పైచేయి సాధించి పదవులు దక్కించుకుంటారోన్న ఉత్కంఠ జిల్లాలో కొనసాగుతోంది. మొత్తానికి వైపీపీలో పదవుల వ్యవహారం.. గ్రూపుల మధ్య వివాదాలను మరింత పెంచుతుందని జిల్లా అధిష్టానం కలవరపడుతోంది. పదవుల వ్యవహారం మంత్రులకు సైతం తలనొప్పిగా మారింది. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యేసరికి వర్గ విభేదాలు, అసంతృప్తి రాగాలు మరిన్ని బయటపడతాయనే ఆందోళన వైసీపీ నేతలను వెంటాడుతోంది. 


ఇవి కూడా చదవండిImage Caption