పరిషత పోలింగ్‌... అలా జరిగింది!

ABN , First Publish Date - 2021-04-09T05:40:45+05:30 IST

ఏడాది కాలంగా ఊగిసలాడుతూ... అప్పుడా.. ఇప్పుడా అని ఊరిస్తున్న పరిషత ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ఎట్టకేలకు ముగిసింది.

పరిషత పోలింగ్‌... అలా జరిగింది!
పెనుకొండ మండలం గుట్టూరులో ఓటింగ్‌ను సబ్‌ కలెక్టర్‌ నిషాంతి,

-మధ్యాహ్నం 3 వరకూ మందకొడిగా..

-ఆపై అమాంతంగా పెరిగిన పోలింగ్‌ శాతం

- ఎన్నికల్లో విచిత్రాలెన్నో..? ఆపై అనుమానాలు ఎన్నెన్నో?

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 8: ఏడాది కాలంగా ఊగిసలాడుతూ... అప్పుడా.. ఇప్పుడా అని ఊరిస్తున్న పరిషత ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ఎట్టకేలకు ముగిసింది.  పెనుకొండ రెవెన్యూ డివిజనలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించడంతో ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. పంచాయతీ ఎన్నికలకంటే పోలింగ్‌శాతం గణనీయంగా తగ్గిపోయింది. హిందూపురం మండలంలో 15ఎంపీటీసీ స్థానాలు ఉండగా అన్నింటిలోనూ టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. జెడ్పీటీసీ బరిలో ఐదుగురు ఉండగా తెలుగుదేశం వైసీపీ మద్య గట్టి పోటీ నెలకొంది. 42 మంది ఎంపీటీసీ అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఉదయం 7గంటలకే పోలింగ్‌ ప్రారంభంకాగా మొదటిగంటలో 5శాతం లోపే పోలయ్యింది. 11గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా సాగింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను రప్పించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. హిందూపురం మండలంలో 14పంచాయతీలకుగాను 39,009ఓటర్లు ఉండగా 26,355మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా పోలింగ్‌ ముగిసేసరికి 67.56 శాతం నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే హిందూపురం మండలంలో టీడీపీ అభ్యర్థులు అన్నింటిలోనూ బరిలో ఉండటంతో ఓటు వేయడానికి ఓటర్లను ఇరు పార్టీలు కేంద్రాల వద్దకు తరలించారు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులు నిరుత్సాహంగా ఉండటంతో పోలింగ్‌శాతం తగ్గినట్లు భావిస్తున్నారు. హిందూపురం అత్యధికంగా మణేసముద్రంలో బూతలో  80.55శాతం పోలింగ్‌ నమోదుకాగా అత్యల్పంగా కిరికెర-1వ సెగ్మెంట్‌లో మూడవ బూతలో కేవలం 41.56శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలంపల్లి 68.38, చలివెందుల 74.10, ఎం.బీరేపల్లి 74.16, మలుగూరు 66.06, కిరికెర -1 53.52, కిరికెర-2 55.34, కిరికెర-3 65.68, కొటిపి 69.66, గోళ్లాపురం 69.23, తూముకుంట 67.63, చౌళూరు 77.54, సంతేబిదునూరు 74.09, బేవనహళ్లి 74.30శాతం నమోదైంది. అయితే ఉదయం 9గంటలకే ఓటర్లు లేక బూతలు వెలవెల బోయాయి. పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు ఉత్సాహం చూపలేదు. 

గోరంట్ల: పరిషత ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో గురువారం జరిగిన పోలింగ్‌లో చాలా మంది ఓటువేయడానికి ఆసక్తిచూపలేదు. గోరంట్ల మండలంలో 22ఎంపీటీసీలకుగాను 20స్థానాలకు జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగ్గా 59,890మంది ఓటర్లకుగాను 27,817మంది ఓట్లు వేయడంతో 46.45శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్‌ఓ రత్నం తెలిపారు. గోరంట్ల పట్టణంలోని 6 ఎంపీటీస్థానాలకుగాను 35 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. గోరంట్లలో ఉదయం నుంచే పోలింగ్‌కేంద్రాలవద్ద జనంలేక బోసిపోయాయి. బూదిలి, వడిగేపల్లి గ్రామాల్లో ఓటు వేయడానికి జనం బారులు తీరి కనిపించారు. మల్లాపల్లి ప్రాథమిక పాఠశాల పోలింగ్‌ కేంద్రంవద్ద బీజేపీ అభ్యర్థి లక్ష్మీకాంతమ్మకు అధికార పార్టీ నాయకుల మధ్య వివాదం తలెత్తడంతో సీఐ జయనాయక్‌ జోక్యంతో పరిస్థితి చక్కదిద్దారు. వడిగేపల్లిలో టీడీపీ అభ్యర్థి హరినాథ్‌, ఎన్నికల ప్రచారంచేసి ఏజెంట్లను నియమించారు. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన పోలింగ్‌ కేంద్ర నుంచి బయటకు వచ్చేశారు.




Updated Date - 2021-04-09T05:40:45+05:30 IST