సారీ.. మా వల్ల కాదు!

ABN , First Publish Date - 2022-07-20T16:33:07+05:30 IST

కలెక్టర్‌, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించినా వాగు పనులు చేపట్టేందుకు మునిసిపాలిటీ ముందుకు రాలేదు. ఆ పని మా పరిధిలో కాదని

సారీ.. మా వల్ల కాదు!

ఇద్దరు ఎమ్మెల్యేలు.. కలెక్టర్‌ ప్రతిపాదనకు కౌన్సిల్‌ నో

పందెన్‌ వాగు వంతెన పూర్తయ్యేనా?


హైదరాబాద్/నార్సింగ్‌: కలెక్టర్‌, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించినా వాగు పనులు చేపట్టేందుకు  మునిసిపాలిటీ ముందుకు రాలేదు. ఆ పని మా పరిధిలో కాదని ఏకంగా కౌన్సిల్‌లోనే తేల్చి చెప్పింది. దీంతో పందెం వాగుపై వంతెన నిర్మాణానికి ఆదిలోనే బ్రేక్‌ పడినట్లయింది. 

మణికొండ మున్సిపాలిటీ పరిఽధిలో పంచవటి, సాయిలక్ష్మి కాలనీలు కలిసి ఉంటాయి. రెండు కాలనీల మధ్య ఉన్న పందెన్‌వాగు శేరిలింగంపల్లి సర్కిల్‌ గచ్చిబౌలి డివిజన్‌లోకి వస్తుంది. ఇటుపక్క కాలనీ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. గచ్చిబౌలి డివిజన్‌ వాసులు ఇటువైపు రావడానికి పందెన్‌వాగుపై వంతెన నిర్మించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ప్రస్తుతం రాయదుర్గం లేదా ఓయూ కాలనీ నుంచి రావాల్సి వస్తుండటంతో కాలనీవాసులే పైప్‌లైన్‌లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. గట్టిగా వర్షం పడితే ఆ పైప్‌లైన్‌లు కొట్టుకుపోవడం ఖాయం. 


కలెక్టర్‌ను ఒప్పించిన ఎమ్మెల్యేలు

ప్రజల విజ్ఞప్తి మేరకు పందెంబాగుపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు మణికొండ మున్సిపాలిటీ బాధ్యులను ఆదేశించారు. వంతెన నిర్మించే ప్రాంతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్‌లోకి వస్తుందని అధికారులు ఎమ్మెల్యేలకు తెలిపారు. తమ నిధులతో వంతెన నిర్మాణం సాధ్యం కాదని శేరిలింగంపల్లి మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు వంతెన కోసం రంగారెడ్డి  కలెక్టర్‌ను ఒప్పించి మణికొండ మునిసిపల్‌ నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. రూ. 60 లక్షలతో ప్రతిపాదన సిద్ధం చేశారు. 


తిరస్కరించిన కౌన్సిల్‌

చైర్మన్‌ కస్తూరి నరేందర్‌ ఆధ్వర్యంలో సోమవారం మణికొండ మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. పలు తీర్మానాలను ఆమోదించిన కౌన్సిల్‌ పందెం వాగు వంతెన నిర్మాణం కోసం రూ. 60 లక్షలు కేటాయించే తీర్మానాన్ని తిరస్కరించింది. తమ పరిధి కాని ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టలేమని పేర్కొంది. ఉన్నతస్థాయి ఆదేశాలు ఉన్నాయని, కమిషనర్‌ ఫాల్గుణకుమార్‌ కౌన్సిల్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఇద్దరు ఎమ్మెల్యేలూ తమ నిధులతో ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉండగా, మునిసిపాలిటీ నిధులతోనే చేపట్టాలని పట్టుబట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


కలెక్టర్‌కు నివేదిస్తాం..

ఆ ప్రాంతం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చినా రంగారెడ్డి  కలెక్టర్‌ సూచన మేరకు వంతెన నిర్మాణం అంశాన్ని మణికొండ కౌన్సిల్‌లో పెట్టాం. తమ పరిధి కాని ప్రాంతంలో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడానికి కౌన్సిల్‌ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తాం. 

- ఫాల్గుణకుమార్‌, కమిషనర్‌, మణికొండ


70 శాతం మణికొండ పరిధే..

పంచవటి కాలనీ - లక్ష్మీసాయినగర్‌ సరిహద్దు ప్రాంతంలో వరద నీటి కాలువ నిర్మాణ పనులు 70 శాతం పూర్తి అయ్యాయి. గతంలో ఈ కాలువ ప్రాంతంలో పైప్‌లైన్‌లు ఉండేవి. అయితే, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పైప్‌లైన్‌లను తొలగించి కల్వర్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంతం మణికొండ పరిధిలో 70 శాతం ఉండడం, శేరిలింగంపల్లి పరిధిలో 30 శాతం ఉండటంతో మిగతా పనులను వారే చేపట్టాలి.

- శ్రీనివాస్‌, ఈఈ, శేరిలింగంపల్లి

Updated Date - 2022-07-20T16:33:07+05:30 IST