Chitrajyothy Logo
Advertisement

శోభన్‌బాబుతో జోడి కుదరలేదు

twitter-iconwatsapp-iconfb-icon
శోభన్‌బాబుతో జోడి కుదరలేదు

  • ఎన్టీఆర్‌... ఏఎన్నార్‌లతో కలిసి నటించారు. 
  • చిరంజీవి డైనమిజాన్ని చూశారు. 
  • ప్రభాస్‌ లాంటి నవనాయకులతోనూ పోటీపడ్డారు. 
  • తరాలు మారినా తరగని ‘ప్రభ’... ఆరు పదులు దాటినా 
  • నటించాలన్న తపన... 
  • వెండితెరపై వెలిగిన ఆమె... 
  • ఇప్పుడు తొలిసారి తెలుగులో బుల్లితెరపైనా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అలనాటి అందాల నటి ప్రభతో ‘నవ్య’ ముచ్చట్లు... 

పంథొమ్మిది వందల డెబ్భై నాలుగో... అయిదో... నేను, జయప్రద, జయసుధ ఒకేసారి పరిశ్రమకు వచ్చాం. దాదాపు యాభై ఏళ్ల సినీ ప్రస్థానం. ఆనందంగానే సాగిపోతోంది. కానీ కొన్ని ఘనవిజయం సాధించిన చిత్రాల్లో అవకాశం వచ్చినా చేయలేకపోయానన్న బాధ అప్పుడప్పుడూ వెంటాడుతుంటుంది. చిన్నప్పటి నుంచి నేను సావిత్రి గారి వీరాభిమానిని. ఎల్‌ విజయలక్ష్మి గారి డ్యాన్స్‌లు బాగా ఇష్టపడేదాన్ని. సావిత్రి గారి నటన... విజయలక్ష్మి గారి నర్తన... నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ‘నటిని అవుతా’నంటే మా పెద్దవాళ్లు కూడా ప్రోత్సహించారు. నేను రావడమే ‘నీడలేని ఆడది’తో హీరోయిన్‌గా వచ్చా. దాని కోసం పత్రికలో ప్రకటన చూసి వెళ్లా. మూడు బ్యాచ్‌లు మేకప్‌ వేసి, స్ర్కీన్‌ టెస్ట్‌లు చేశారు. నాదే చివరి బ్యాచ్‌. అప్పటికే ఒకర్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. ఆఖరికి నన్ను తీసుకున్నారు. ‘నవశక్తి ఫిలిమ్స్‌’ అధినేత పర్వతనేని గంగాధర్‌ గారు నిర్మాత. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. నాతో మూడేళ్లు అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. నేను టీనేజిలో ఉన్నాను. పెద్దగా చదువుకోలేదు. సినిమా అవకాశాలు రావడంతో ఏడో తరగతితోనే ఆపేశాను. 


ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చారు... 

తరువాత ‘పద్మాలయ’ వాళ్లు అడిగారు. శోభన్‌బాబు గారి పక్కన. అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. కానీ ‘కథ నాకు నచ్చితేనే తను చేస్తుంది’ అని గంగాధర్‌ గారు అన్నారు. ‘కథ మీకెలా చెబుతాం’ అని వాళ్లన్నారు. దీంతో వచ్చిన అవకాశం పోయింది. అగ్రిమెంట్‌లో ఉండగా ఆయనకు ఇష్టమైన సినిమాలే నేను చేయాలనేది మా నిర్మాత పట్టుదల. నేనా బయటకు రాలేని పరిస్థితి. నాకు పద్దెనిమిదేళ్లు నిండాక ఎంఎస్‌ రెడ్డి గారు, బాలయ్య గారి చిత్రాలు ఒప్పుకున్నా. దాంతో మా నిర్మాత ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. నాకు 18 ఏళ్లు నిండాయని, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టానని సర్టిఫికెట్లు చూపించి... ఆ సినిమాలు చేస్తానని గట్టిగా చెప్పాను. ప్రభాకర్‌రెడ్డి గారు, నాగభూషణం గారు, మరికొందరు పెద్దలు... ‘చిన్న పిల్ల. తన మీద కేసులు, గొడవలు వద్దు’ అని గంగాధర్‌ గారికి నచ్చజెప్పారు. ఆ వివాదం సద్దుమణిగింది. అక్కడి నుంచి వరుస అవకాశాలొచ్చాయి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, చిరంజీవి గారు, కమల్‌హాసన్‌ గారు... పెద్ద హీరోలందరి పక్కన చేశాను. తెలుగు, తమిళం, మళయాలంలో వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించా. మంచి పాత్రలు వచ్చాయి. అవార్డులూ వరించాయి. 


అవకాశాలు చేజారాయి... 

కాకపోతే మధ్యమధ్యలో కొన్ని మెగాహిట్‌ చిత్రాలు చేజారాయి. వాటిల్లో చిరంజీవి ‘ఖైదీ’ ఒకటి. అయితే అంతకుముందే ఆయనతో ‘పార్వతి పరమేశ్వరులు’ చేశా. అలాగే కమల్‌తో ‘సొమ్మొకడిది సోకొకడిది’ కూడా! కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల కొన్ని, డేట్స్‌ కుదరక కొన్ని చేయలేకపోయాను. 


ఆయనతో కుదరలేదు... 

నాడు అందరి హీరోల సరసన నటించాను కానీ శోభన్‌బాబు గారితోనే కుదరలేదు. 1990లో అనుకొంటా... ‘దోషి నిర్దోషి’ సినిమా కోసం అడిగారు. అప్పుడు నేను అమెరికా ‘తానా’ ఉత్సవాల్లో ఉన్నాను. 60 రోజుల్లో 48 నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. ప్రముఖ నాట్య గురువు వెంపటి చినసత్యం గారి ఆధ్వర్యంలో... లైవ్‌ ఆర్కెస్ర్టాతో. ఏకఽధాటిగా అన్ని ప్రదర్శనలు ఇచ్చిన ఏకైక నర్తకి నేనే. దీంతో మళ్లీ శోభన్‌బాబు గారి సినిమాలో అవకాశం పోయింది. తరువాత  మరోసారి కూడా డేట్స్‌ సమస్యతో చెయ్యలేకపోయాను.


మళ్లీ అలా మొదలైంది... 

ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎక్కడా ఖాళీగా ఉన్నదంటూ లేదు. పెళ్లయిన తరువాత కూడా నటించాను. బాబు పుట్టాడు. మధ్యలో అమెరికా వెళ్లాను. నా డ్యాన్స్‌, నా ప్రోగ్రామ్స్‌... బిజీగానే గడిచిపోతోంది. ఇక తల్లి పాత్రల్లోకి వచ్చాక నా తొలి చిత్రం ‘చాలా బాగుంది’. ఆ తరువాత తమిళంలో కూడా ఇదే తరహా రోల్స్‌ చేస్తున్నా. నాకు ఒకే ఒక్క కొడుకు. పేరు రాజా రమేశ్‌. 27 సంవత్సరాలు. అమెరికాలో ఉంటున్నాడు. కానీ ఈ పరిశ్రమ వైపు రాలేదు. వాడిని చూసి పరుచూరి గోపాలకృష్ణ గారు అనేవారు... ‘ఏరా సినిమాలు చేస్తావా’ అని! ‘నో మామా... నాకు ఇంట్రస్ట్‌ లేద’నేవాడు. వాళ్ల నాన్న, బాబాయిల్లా చదువు, ఉద్యోగం... ఆ రూటులోనే వెళ్లాడు. 


ఇష్టపడి ఇటువైపు... / కథ నచ్చింది... 

ఇక ప్రస్తుతం ‘స్టార్‌ మా’లో రానున్న ‘కలిసి ఉంటే కలదు సుఖం’ టీవీ సీరియల్‌లో నటిస్తున్నా. తెలుగులో ఇదే నా మొట్టమొదటి సీరియల్‌. అంతకముందు ఎప్పుడో తమిళంలో చేశాను. అది కూడా నటి రాధికతో ఉన్న స్నేహం వల్ల... కాదనలేకపోయాను. ఆ తరువాత చాలామంది సీరియల్స్‌ కోసం సంప్రతించారు. చేయనని చెప్పాను. ఎందుకంటే నేను సాయంత్రం ఆరు అయ్యేసరికల్లా వెళ్లిపోవాలి. ఇక్కడేమో రాత్రి 9 వరకు షూటింగ్‌ నడుస్తుంటుంది. ముఖ్యంగా నా ఓల్డ్‌ ఇమేజ్‌కి భంగం కలగకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వద్దనుకున్నా. కానీ ఇందులో అన్నీ కుదిరాయి. కథ విన్నాను. చాలా కొత్తగా ఉంది. ‘స్టార్‌ మా’ లాంటి మంచి వేదిక దొరికింది. అందుకే ఒప్పుకున్నా. 


‘గీత’ నచ్చుతుంది... 

‘కలిసి ఉంటే కలదు సుఖం’లో నాది ‘గీత’ పాత్ర. ఆరు పదుల వయసు నిండినా కూడా అప్పుడప్పుడూ అల్లరిగా ఉండే కేరెక్టర్‌. చిన్న పిల్లలతో పిల్లగా ఆడుకొంటుంది. పెద్దవాళ్లతో పెద్దరికంగా వ్యవహరిస్తుంది. భర్త చనిపోయారని బాధపడుతూ కూర్చోకుండా... ఆయన ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చాలి. భిన్న మనస్తత్వాలతో గల పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అనుకుంటుంది. మరి ఆ దారిలో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటుందా? అన్ని రకాల షేడ్స్‌ ఉన్న అద్భుతమైన పాత్ర ఇది. కచ్చితంగా ‘గీత’ అందరికీ నచ్చుతుంది. ‘స్టార్‌ మా’లో వచ్చే వారం నుంచి ఈ డైలీ సీరియల్‌ ప్రసారమవుతుంది. 


దూరపు కొండలు నునుపు... 

తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు అంతా తెలుగు తారలే ఉండేవాళ్లు. ఇప్పుడు బాంబే నుంచో కర్ణాటక నుంచో తీసుకువస్తేనే హీరోయిన్‌. లక్షణంగా మనమ్మాయిలు ఉన్నా కూడా దూరపు కొండలు నునుపు కదా! మనింట్లో కూర ఉన్నా... పక్కింట్లో తాలింపు వాసన వస్తుంటే ఆ కూరే తినాలనిపిస్తుంటుంది. ఇది కూడా అంతే. భాష రానక్కర్లేదు. డబ్బింగ్‌ అవసరం లేదు. నేను చూశాను... ‘ఏక్‌ దో తీన్‌’ అని చెబుతుందా అమ్మాయి. దానికి తరువాత వీళ్లు డబ్బింగ్‌ చెప్పుకున్నారు. మా రోజుల్లో మేమే డైలాగ్‌లు చెప్పాలి. ఆఖరికి ‘జగన్మోహిని’ తమిళ వెర్షన్‌కు కూడా విఠలాచార్య గారు నాతోనే డబ్బింగ్‌ చెప్పించారు. భాష రాకపోయినా చాలా కష్టపడ్డాను. అలాగని ప్రస్తుత నటుల్లో ప్రతిభ లేదని కాదు. ఇప్పుడు ట్రెండ్‌ మారిందంటున్నానంతే. టిక్‌టాక్‌లు, యూట్యూబ్‌లు, టీవీలు... ఒకటేమిటి... అన్నీ అరచేతిలోనే. నాటికి నేటికి ప్రధాన తేడా టెక్నాలజీ. 


బ్రహ్మాండంగా చేస్తున్నారు... 

ఇప్పుడున్న యువ తారల డ్యాన్స్‌లు బ్రహ్మాండం. అల్లు అర్జున్‌ కానివ్వండి, ఎన్టీఆర్‌ కానివ్వండి, రామ్‌చరణ్‌, మహేశ్‌... అంతా మోకాళ్ల చిప్పలు అరిగిపోయేంతగా డ్యాన్స్‌ చేస్తున్నారు. నాడు మహేశ్‌బాబు ‘ముగ్గురు కొడుకులు’లో చేశా. మా గురువు వెంపటి గారి దగ్గర నేను సాధన చేస్తున్న రోజుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చాడు. వేసవి సెలవుల్లో. ఏడాది నేర్చుకున్నాడు. చాలా చాలాకీగా ఉండేవాడు. నేడు అతడిలో ఎంతో మెచ్యూరిటీ. అలాగే ‘రాఘవేంద్ర’లో నేను చూసిన ప్రభాస్‌కు... ఇప్పటి ప్రభాస్‌కు చాలా తేడా ఉంది. ఈతరం హీరోలందరూ నిజంగా ఇష్టంతో కష్టపడతున్నారు. తపనతో చేస్తున్నారు. వాళ్లని వాళ్లు సరిదిద్దుకొంటూ వెళుతున్నారు.’’                                                                                                                                   హనుమా 


సితార్‌ సాధన చేస్తా

షూటింగ్‌ లేకపోతే ఇంట్లోనే సరిపోతుంది. లేవగానే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తా. టీవీ చూస్తా. ఇంటి బాధ్యతలు, పూజలు, సితార్‌ సాధన... ఖాళీ ఉండదు.


సంతృప్తి ఉండదు... 

నాలుగున్నర దశాబ్దాలకు పైగా కెరీర్‌. అయినా నాకు ఎప్పుడూ తృప్తి ఉండదు. ఇంకా ఏదో చేయాలనే కోరిక. లేకపోతే ఇప్పుడు సీరియల్‌కి డబ్బింగ్‌ ఎందుకు చెబుతాను! డబ్బింగ్‌ చెబితే నాకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వరు. కానీ ఇంకా చేయాలి... చేస్తూనే ఉండాలి... అనే తపన మాత్రం ఇంకా పోలేదు. 


కాళ్లకు నోరుంటే తిడుతుంది... 

నాట్యం నాలో భాగం. దాదాపు ముప్ఫై ఏళ్ల పాటు విరామం లేకుండా ప్రదర్శనలు ఇస్తూనే వెళ్లాను. నా కాళ్లకు నోరుంటే నన్ను తిడుతుంది. 1979లో నాకు పెద్ద యాక్సిడెంట్‌ అయింది. షూటింగ్‌లో. నేను, శ్రీదేవి హీరోయిన్లం. దేవదాసు కనకాల గారికి డ్రైవింగ్‌ రాదు. ఆ కారులో నేనున్నాను. కారు పల్టీ కొట్టింది. పెద్ద ప్రమాదం. నా కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాటన్నిటి నుంచి కోలుకుని, మళ్లీ నాట్యం కొనసాగించగలిగానంటే అదంతా ఆ నటరాజ స్వామి ఆశీస్సుల వల్లే. వయసు పెరుగుతుండంతో డాక్టర్ల సూచన మేరకు డ్యాన్స్‌ ఆపేశాను. ప్రస్తుతం నృత్య ప్రదర్శనలకు కొరియోగ్రఫీ, నట్టువాంగం చేస్తున్నా.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement