దగ్గు వచ్చిన వెంటనే పిల్లలకు ఆ మందులు వేస్తున్నారా? అయితే జాగ్రత్త..

ABN , First Publish Date - 2021-11-09T20:34:04+05:30 IST

పిల్లల్లో సూక్ష్మక్రిములను బయటకు నెట్టడం కోసం వాళ్ల శరీరం చేసే ప్రయత్నమే... ‘దగ్గు’! దగ్గును తగ్గించే మందులతో ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయడం ఎంతవరకూ ఆరోగ్యకరం?

దగ్గు వచ్చిన వెంటనే పిల్లలకు ఆ మందులు వేస్తున్నారా? అయితే జాగ్రత్త..

ఆంధ్రజ్యోతి(09-11-2021)

పిల్లల్లో సూక్ష్మక్రిములను బయటకు నెట్టడం కోసం వాళ్ల శరీరం చేసే ప్రయత్నమే... ‘దగ్గు’! దగ్గును తగ్గించే మందులతో ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయడం ఎంతవరకూ ఆరోగ్యకరం? 


దగ్గు, జలుబులను కలిగించే బోలెడన్ని వైరస్‌లు స్వైరవిహారం చేసే కాలమిది. వీటికి జ్వరం కూడా తోడవవచ్చు. అయితే అంతమాత్రాన చేతికందిన మందులు, యాంటీబయాటిక్‌లు కొనేసి పిల్లలకు వాడకూడదు. కొన్ని మందులతో రుగ్మత తగ్గకపోగా, పెరిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా మందులకు లొంగనంతగా వైరస్‌లు మరింత బలం పుంజుకునే ప్రమాదం కూడా ఉంటుంది. 


తగ్గినట్టే తగ్గి: సినారెస్ట్‌, టిమినిక్‌, మాక్స్‌ట్రా మందులు ముక్కు నుంచి స్రావాలను అదుపులోకి తెస్తాయి. అయితే మందులు వాడడం ఆపేసిన తర్వాత, తగ్గిన స్రావాలు తిరిగి విపరీతమయ్యే అవకాశాలు ఉంటాయి. పదే పదే ఈ మందులు వాడడం వల్ల ‘రైనైటిస్‌ మెడికమెంటోసా’ అనే సమస్య తలెత్తే ప్రమాదం కూడా ఉంది. మందుల వాడకంతోనే తరచూ జలుబు మొదలయ్యే పరిస్థితి ఇది. కొందర్లో పెరిగిన స్రావాల వల్ల చెవి ఇన్‌ఫెక్షన్లు కూడా మొదలవుతాయి. ఈ మందుల ప్రభావంతో వాయుమార్గాలు పొడిగా మారతాయి. కొన్ని రకాల దగ్గులు మరింత పెరిగిపోతాయి. ఏడాది లోపు పిల్లలకు ఈ మందులు వాడకూడదు.


వైరల్‌ దగ్గులు: ఆంబ్రోడిల్‌, రెలెంట్‌ ప్లస్‌, కుఫ్రిల్‌ మొదలైన మందులు మ్యూకస్‌ను విరిచేస్తాయి. కాబట్టి మ్యూకస్‌తో సంబంధం లేని దగ్గుకు ఈ మందులు పని చేయవు. మరీ ముఖ్యంగా వైరల్‌ దగ్గులకు ఈ మందులు నిరుపయోగం. 


ఇన్‌హేలర్లు: ఆస్థాలిన్‌ సిరప్‌, ఆస్కోరిల్‌ సిరప్‌లు కుంచించుకుపోయిన వాయుమార్గాలు  విప్పారడానికి తోడ్పడతాయి. అయితే ఇలాంటి సమయాల్లో నెబ్యులైజేషన్‌/పఫ్స్‌లతో మెడిసిన్‌ను అందించడం ద్వారా వాయుమార్గాలను మరింత తేలికగా విప్పారేలా చేయవచ్చు. ఈ మందులతో గుండె వేగం పెరగడం, వణుకు, పొటాషియం స్థాయి తగ్గడం మొదలైన దుష్ప్రభావాలు ఉండే వీలుంటుంది. బ్రాంఖియోలైటిస్‌ సమస్యలో మూడు శాతం సెలైన్‌తో కూడిన నెబ్యులైజేషన్‌ మెరుగైన ఫలితాన్నిస్తుంది. బదులుగా సినారెస్ట్‌, మాక్స్‌ట్రా, టిమినిక్‌ మొదలైన మందులతో నెబ్యులైజేషన్‌ చేస్తే, సమస్య మరింత తీవ్రమవుతుంది.


దగ్గు: ఎక్కువ శబ్దంతో కూడిన దగ్గు (బార్కింగ్‌ కాఫ్‌), ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు శబ్దాలు వెలువడడం (నాయిసీ బ్రీదింగ్‌) ఈ సమస్యలను ‘క్రూప్‌’ కోవలోకి వస్తాయి. అడ్రినలిన్‌, స్టెరాయిడ్స్‌తో కూడిన నెబ్యులైజేషన్‌ సహాయపడుతుంది. వీటికి బదులుగా దగ్గు, జలుబు మందులు వాడితే సమస్య మరింత తీవ్రమవుతుంది.


యాంటీబయాటిక్‌: అజీ, అజిత్రాల్‌ మందులు జ్వరం, దగ్గు, గొంతు నొప్పిలకు కారణమయ్యే కొన్ని రకాల బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి. అయితే దగ్గు మొదలైన మొదటి రోజు నుంచే వీటిని వాడడం మొదలుపెట్టి, అదుపులోకి రానప్పుడు మాత్రమే పెద్దలు పిల్లలను వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఈ మందులతో పొట్టలో నొప్పి, డయేరియా సమస్యలు కూడా మొదలవుతాయి. నిజానికి ఇలాంటి మందులు వాడడం వల్ల యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ పెరిగి, బిడ్డకు నిజానికి అవసరమయ్యే సమయానికి ఈ మందులు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. 


ప్రథమ చికిత్సలు  

పిల్లల్లో దగ్గు, జలుబు కనిపించిన వెంటనే మందులు కొనేసి వాడకుండా, ప్రధమ చికిత్సలతో వాటిని సహజసిద్ధంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. అందుకోసం....


రోజుకు రెండు నంచి మూడు సార్లు వెచ్చని, తేమతో కూడిన గాలి అందేలా చేయాలి. ఇందుకోసం బాత్రూమ్‌ను ఆవిరితో నింపి బిడ్డతో పాటు అక్కడే కూర్చోవాలి. పొరపాటున కూడా నేరుగా ముక్కుకు తగిలేలా ఆవిరి పట్టకూడదు. 


ముక్కు దిబ్బెడ ఉంటే, నాశికా రంధ్రాల్లో రెండు నుంచి మూడు చుక్కల సెలైన్‌ నోస్‌ డ్రాప్స్‌ వేయవచ్చు.


తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినిపిస్తూ, ఎక్కువ ద్రవాలు అందిస్తూ ఉండాలి.


బిడ్డ ఆహారం తినకపోతున్నా, వేగంగా శ్వాస తీసుకుంటున్నా, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, చెవులను లాక్కుంటున్నా, వాంతులు చేసుకుంటున్నా, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు శబ్దం వెలువడుతున్నా, ఐదు రోజులకు మించి దగ్గు తగ్గకపోతున్నా, బిడ్డకు విపరీతంగా/తరచుగా జ్వరం వస్తున్నా తప్పనిసరిగా పిల్లల వైద్యులను కలవాలి.


చెవి నొప్పితో బిడ్డ ఏడుస్తుంటే, కాపడం పెట్టవచ్చు. నొప్పి తగ్గడం కోసం ఒక డోస్‌ పారాసిటమాల్‌ ఇవ్వవచ్చు. అదే సమయంలో ముక్కు మూసుకుపోయుందేమో గమనించాలి. నొప్పి అదుపులోకి రాకపోతే వైద్యులను సంప్రతించాలి.


పిల్లలకు గొంతు నొప్పి ఉంటే, చల్ల నీళ్లను సిప్‌ చేయించాలి. గొంతు నొప్పి ఉన్నప్పుడు చల్ల నీళ్లు తాగించకూడదు అనేది అపోహ మాత్రమే!


పిల్లలకు గొంతు నొప్పి ఉంటే, చల్ల నీళ్లను సిప్‌ చేయించాలి. గొంతు నొప్పి ఉన్నప్పుడు చల్ల నీళ్లు తాగించకూడదు అనేది అపోహ మాత్రమే!


డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌ పిడియాట్రీషియన్‌.


Updated Date - 2021-11-09T20:34:04+05:30 IST