మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు?

ABN , First Publish Date - 2020-09-27T07:11:14+05:30 IST

జిల్లాలో 24 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. పత్తిని కొనుగోలు చేసేందుకు జిన్నింగ్‌ మిల్లులన్నింటినీ సీసీఐ కేంద్రాలుగానే ఏర్పాటు చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా....

మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు?

గతేడాది జిన్నింగ్‌ మిల్లుల (సీసీఐ) ద్వారా కొనుగోలు

ఈ యేడాది సీసీఐ, మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు

రైతులకు తప్పనున్న ఇబ్బందులు

ఈ యేడు 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా 


సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు: జిల్లాలో 24 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. పత్తిని కొనుగోలు చేసేందుకు జిన్నింగ్‌ మిల్లులన్నింటినీ సీసీఐ కేంద్రాలుగానే ఏర్పాటు చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా, మద్దతు ధర రైతులకే చెందే విధంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ యేడాది మార్కెటింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీసీఐ, మార్కెట్‌ కమిటీలు పత్తిని కొనుగోలు చేస్తే రైతులకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటు, కొనుగోలు కేంద్రాల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం రైతులకు ఉండదు.


జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో పత్తి సాగును ప్రోత్సహించడంతో జిల్లాలో ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి ధరను తేమ శాతం ఆధారంగా గరిష్ఠంగా క్వింటాలుకు రూ.5,825గా నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వం క్వింటాలుకు రూ.275 అదనంగా ధర కల్పించింది. పత్తిని ప్రైవేట్‌ వ్యాపారులతో పాటు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. గత ఏడాది 12 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ, 3.5 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది 20 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. దీనికి అనుగుణంగానే కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమవుతోంది. గతంలో సీసీఐ ఆధ్వర్యంలో బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఈ విధానంతో తగిన ప్రమాణాలు ఉండడం లేదని భావించి నాలుగేళ్లుగా లూజుగా పత్తిని కొనుగోలు చేస్తోంది. రెండేళ్ల నుంచి ఆ విధానంలో కూడా మార్పులు తెచ్చింది. 


అక్రమాలను అరికట్టేందుకే పంటల నమోదు

జిన్నింగ్‌ మిల్లులకు విక్రయానికి వచ్చే పత్తిలో వాహన స్థాయిని బట్టి ఒక్కో దాంట్లో తరుగు పేరిట 6 నుంచి 10 కిలోల చొప్పున తీస్తున్నారు.  అంతేకాక పంటలో ప్రమాణాలు, పత్తిలో తేమ శాతం ఉండటం లేవని, సీసీఐ కొరివి పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాగా గతేడాది గ్రామాల్లో ప్రైవేట్‌ వ్యాపారులు పర్యటించి రైతుల నుంచి క్వింటాలుకు రూ.4,000 నుంచి రూ.4,500 చొప్పున కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో (జిన్నింగ్‌ మిల్లులో) రూ.5,550 చొప్పున బినామీ రైతుల పేరిట విక్రయించారనే అనుమానాలున్నాయి. దళారులు, సీసీఐ కేంద్రాలు (జిన్నింగ్‌ మిల్లులు) కుమ్మక్కయ్యాయని, దీంతో  రైతుకు రావాల్సిన మద్దతు ధర దళారులకు వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ నమోదు చేసిన పంటల నమోదు ప్రక్రియ కీలకం కానున్నది. ఒక రైతు నుంచి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.


రైతులకు ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు 

పత్తి కొనుగోళ్లలో రైతుకు ప్రయోజనం చేకూరే దిశగా చర్యలు తీసుకుంటాం.  జిల్లాలో 24 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులన్నిట్లో సీసీఐ కేంద్రాలు ఉంటాయి.  అదనంగా ఈ సారి మార్కెటింగ్‌ కమిటీలో కొనుగోలును ప్రారంభించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఈ ప్రతిపాదన ఉత్తర్వులు రాగానే మార్కెటింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు నిర్వహణ చేపడుతాం. రైతులకు పత్తి కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.

-సంతోష్‌ కుమార్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

Updated Date - 2020-09-27T07:11:14+05:30 IST