అధిక వర్షాలతో దెబ్బతిన్న పత్తి చేలు

ABN , First Publish Date - 2020-10-24T11:34:05+05:30 IST

పంటచేతి కొచ్చే సమయంలో భారీ వర్షాలతో పత్తి దెబ్బతిన్నది. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 1నుంచి ఇప్పటి వరకు 835.6మి.మీ వర్షపాతం నమోదైంది

అధిక వర్షాలతో దెబ్బతిన్న పత్తి చేలు

తెగుళ్లతో పెట్టుబడులురాని దైన్యం

ఆందోళనలో రైతులు


 తెల్లబంగారం ఈ ఏడాది సిరులు కురిపిస్తుందని ఆశపడ్డ రైతులను వర్షం నిండా ముంచింది. ఆదాయం దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడి సైతం వచ్చేలా లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం లో సకాలంలో వర్షాలు కురవడంతో నల్లగొండ జిల్లా లో 7.29లక్షల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 1.20 లక్షలు, యాదాద్రి జిల్లాలో 1.74లక్షలు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 10.23లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. కాగా వర్షాలతో 86వేల ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నది.


నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పంటచేతి కొచ్చే సమయంలో భారీ వర్షాలతో పత్తి దెబ్బతిన్నది. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 1నుంచి ఇప్పటి వరకు 835.6మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 597.1మి.మీ కాగా, ఈ ఏడాది అదనంగా 40మి.మీ వర్షం కురిసింది. దీంతో నల్లగొండ జిల్లాలో 46,826 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 17వేల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 22,456, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 86,282 ఎకరాల్లో పత్తిపంట దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పంటనష్టం అధికంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33శాతం పంటనష్టం జరిగితేనే అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో అధికారుల ప్రాథమిక అంచనాలో నష్టం విస్తీర్ణం భారీగా తగ్గింది. అంతేగాక గ్రామాలవారీగా సర్వే నిర్వహించిన అధికారులు, రైతులవారీగా పంటనష్టాన్ని లెక్కించలేదు.


పత్తి ఎకరా సాగుకు సుమారు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కౌలు రైతులైతే కనీసంగా రూ.10వేలు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. ఎకరాకు 10క్వింటాళ్ల దిగుబడి వస్తే, ప్రస్తుతం పత్తి క్వింటాకు రూ.4000 నుంచి రూ.4500 వరకు ధర ఉండగా, రైతులకు రూ.40వేల వరకు ఆదాయం వస్తుంది. పత్తి ఏరివేతకు కూలీలకు కిలోకు రూ.10 నుంచి రూ.11 చెల్లించాల్సి వస్తోంది. క్వింటాకు రూ.1000 చొప్పు న కూలీలకు ఇవ్వాలి. వర్షం కారణంగా ఎకరాకు 2క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గనుంది. అంటే 8క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ.32వేల ఆదాయం వస్తుంది. కౌలుతో కలిపి మొత్తం పెట్టుబడి సుమారు రూ.43వేలు అయితే ఇంకా రూ.10వేల నష్టం రైతులు చవిచూడాల్సి వస్తుంది. ఆదాయం లేకపోగా పెట్టుబడులకు చేసిన అప్పులుకూడా తీరని పరిస్థితి. ఇక వర్షాలతో పత్తికి తెగుళ్లుసోకి దిగుబడి మరింత తగ్గనుంది.


రైతులకు కోలుకోలేని దెబ్బ

ఉమ్మడి జిల్లాలో వరితో పాటు ప్రధానంగా పత్తి అధికంగా సాగైంది. సుమారు 3లక్షల మంది రైతులు పత్తి సాగుచేసినట్టు అంచనా. కాగా, వర్షాలతో 70శాతం మందికిపైగా పత్తి రైతులు నష్టపోయినట్టు సమాచారం. దసరా నాటికి పత్తి దిగుబడులు భారీగా రావల్సి ఉండగా, వర్షాలతో దిగుబడి పడిపోయింది. తడిచిన పత్తిని రైతులు క్వింటాకు రూ.2500కే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి పత్తి విక్రయిద్దామన్నా సీసీఐ కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు.


ప్రభుత్వమే ఆదుకోవాలి

ఐదెకరాలు పత్తి కౌలుకు తీసుకొని సాగు చేశా. సెప్టెంబరుతోపాటు ప్రస్తుత మాసంలో కురిసిన అకాల వర్షాలతో పంట దిగుబడి పూర్తిగా పడిపోయింది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రకృతివైపరీత్యంతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ప్రభుత్వమే ఆదుకోవాలి.

- రవీందర్‌, ఏనుబాముల, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం


పెట్టుబడులు కూడా రావు

అకాల వర్షాలతో పత్తి పూర్తి గా దెబ్బతిన్నది. ఒక్కోచెట్టుకు ఐదు కాయలు కూడా లేవు. కాసి న పత్తి వర్షానికి తడిసి ఏరేందుకు కూడా వీలులేకుండా ఉంది. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. అధికారులు ఇప్పటి వరకు పత్తి చేలను సందర్శించి నష్టం అంచనా వేసిన దాఖలాలు లేవు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

- వెంకట్‌రెడ్డి, చర్లపల్లి, నల్లగొండ మండలం

Updated Date - 2020-10-24T11:34:05+05:30 IST