పత్తి కొనుగోళ్లు లేక రైతుల అవస్థలు

ABN , First Publish Date - 2021-10-26T06:13:48+05:30 IST

మండల కేంద్రంలో ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పత్తి కొనుగోళ్లు లేక రైతుల అవస్థలు
కాల్వ శ్రీరాంపూర్‌ వ్యవసాయ మార్కెట్‌

- ఇతర ప్రాంతాలకు తరలించి ఇబ్బందులు పడుతున్న రైతులు 

- కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబరు 25: మండల కేంద్రంలో ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పండిన పత్తిని ఇతర ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. మండలంలో రైతులు వరితో పాటు పత్తి పంటను అధికంగా పండిస్తారు. ఏటా పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులు జమ్మికుంట, పెద్దపల్లి, వరంగల్‌కు తరలించాల్సి వస్తుండడంతో నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వాహనాల కిరాయిలు, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు అధికంగా ఉన్నా కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. 

మండల కేంద్రంలో ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే మండలంతోపాటు ఓదెల, ముత్తారం మండలాల్లోని పత్తి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మండలంతో పాటు ముత్తారం, ఓదెల మండలాల్లో వరి కన్నా ఎక్కువగా పత్తిని సాగు చేస్తారు. ఈ ఏడాది కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 9000 ఎకరాలు, ఓదెల మండలంలో 6500 ఎకరాలు, ముత్తారం మండలంలో 3000 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. పండించిన పత్తిని ఇక్కడే అమ్ముకుంటే రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు పత్తికి ధర వచ్చినప్పుడు రైతులు అమ్ముకునేందుకు వీలుగా ఉటుంది. కొంతమంది రైతులు పండిన పత్తిని దూర ప్రాంతాలకు తీసుపోలేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు. దళారులు రైతులకు సరిగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఎందరో పత్తి రైతులు దళాకారులను నమ్మి నిండా మునిగిన సంఘటనలు మండలంలో అనేకం ఉన్నాయి. కాల్వశ్రీరాంపూర్‌కు 16కిలోమీటర్ల దూరంలో ముత్తారం, 8కిలో మీటర్ల దూరంలో ఓదెల మండలం ఉంటుంది. ఈ రెండు మండలాలకు మధ్యలో కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఉంది. ఇక్కడ పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తే ఈ మూడు మండలాల రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించి కాల్వశ్రీరాంపూర్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-10-26T06:13:48+05:30 IST